- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TG Govt.: భూభారతికి ఫుల్ రెస్పాన్స్.. ఆ నాలుగు మండలాల్లో ముగిసిన సదస్సులు
తెలంగాణలో భూ సమస్యలు శాశ్వత పరిష్కారమే లక్ష్యంగా గత నెల 14వ తేదీన చారిత్రాత్మకమైన భూ భారతి చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది.

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో భూ సమస్యలు శాశ్వత పరిష్కారమే లక్ష్యంగా గత నెల 14వ తేదీన చారిత్రాత్మకమైన భూ భారతి చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రిజిస్ట్రేషన్ ప్రక్రియకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఉండేలా పైలెట్ ప్రాజెక్టుగా ఖమ్మం జిల్లా నేలకొండపల్లి, కామారెడ్డి జిల్లా లింగంపేట, నారాయణపేట జిల్లా మద్దూర్, ములుగు జిల్లా వెంకటాపూర్ ఈ నాలుగు మండలాల్లో పూర్తి స్థాయిలో అమలు చేస్తున్నారు. ఇదే సమయంలో ఈ చట్టంపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి ప్రతి రోజు ఓ మండలంలోని రెండు గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తోంది. ఈ రెండు సదస్సుల్లో కలెక్టర్లు స్వయంగా పాల్గొనాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇందుకోసం మండల స్థాయిలో తహశీల్దార్, డిప్యూటీ తహశీల్దార్ ఆధ్వర్యంలో ఆరుగురు సభ్యులతో రెండు బృందాలను ఏర్పాటు చేసింది. భూ భారతి చట్టం రైతులకు అర్ధమయ్యే విధంగా చట్టాన్ని అమలు చేసే అధికారులకు ప్రత్యేకంగా శిక్షణా తరగతులు నిర్వహించింది. భూ భారతి చట్టంలో కీలక పాత్ర వహించిన రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దీన్ని సవాల్‌గా తీసుకొని విస్తృత స్ధాయిలో జిల్లాల్లో పర్యటించి రోజుకు రెండు, మూడు అవగాహన సదస్సుల్లో పాల్గొనడం విశేషం. ఏప్రిల్ 17వ తేదీ నుంచి 30వ తేదీ వరకు దాదాపు 20 జిల్లాల్లో సుమారు 45 సదస్సుల్లో పాల్గొన్నారు.
పైలెట్ ప్రాజెక్టు పూర్తి..
పైలెట్ ప్రాజెక్టుగా నాలుగు మండలాల్లోని 72 గ్రామాల్లో ఏప్రిల్ 17 నుంచి 30వ తేదీ వరకు రెవెన్యూ సదస్సులను పూర్తి చేశారు. ఈ సదస్సుల్లో చట్టంపై ప్రజలకు అవగాహన కల్పిస్తూనే మరోవైపు ఆయా మండలాల్లో భూ సమస్యలపై దరఖాస్తులను స్వీకరించారు. స్వీకరించిన ప్రతి దరఖాస్తుకు రశీదు అందజేశారు. ఒక ప్రత్యేక ఫార్మాట్ లో తయారు చేసిన దరఖాస్తులను రెవెన్యూ సదస్సుకు ముందు రోజే ప్రజలకు అందించారు. లింగంపేటలో 3,702, వెంకటాపూర్‌లో 3,969, మద్దూర్‌లో 1,341, నేలకొండపల్లిలో 2,618 మొత్తం 11,130 దరఖాస్తులను తీసుకున్నారు. ఇందులో ప్రధానంగా పీపీబీకి సంబంధించి 3,446, సాదాబైనామాలపై 2,796 అప్లికేషన్లు వచ్చాయి.
ఆ దరఖాస్తులన్నింటిని ఎప్పటికప్పుడు కంప్యూటర్ లో ఎంటర్ చేసి సంబంధిత అధికారులకు పంపారు. మండుటెండలను సైతం లెక్క చేయకుండా ప్రజలు స్వచ్ఛందంగా ఈ సదస్సుల్లో పాల్గొన్నారు. హైదరాబాద్ మినహా 605 మండలాలకు గాను 555 మండలాలలో బుధవారం నాటికి సదస్సులు పూర్తి అయ్యాయి. వచ్చిన అప్లికేషన్లను క్షుణ్ణంగా పరిశీలించి జూన్ 2వ తేదీ నాటికి ఆ నాలుగు మండలాల్లో భూ సమస్యలను పరిష్కరించే దిశగా సర్కారు అడుగులు వేస్తోంది. మరో వైపు హైదరాబాద్ మినహా మిగిలిన 28 జిల్లాల్లో జిల్లాకు ఓ మండలాన్ని పైలెట్ ప్రాజెక్టుగా తీసుకొని 28 మండలాల్లో పూర్తి స్థాయిలో భూ భారతి చట్టాన్ని అమలు చేయాలని నిర్ణయించింది.
భూ భారతి మార్పునకు నాంది: మంత్రి పొంగులేటి
సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వం దార్శనికతతో తీసుకొచ్చిన భూ భారతి చట్టం విప్లవాత్మక మార్పుకు నాంది పలుకుతుంది. నూటికి నూరు శాతం ప్రజలే కేంద్ర బిందువుగా, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా రైతు సంక్షేమమే లక్ష్యంగా ఈ చట్టం ఉంది. ఈ చట్టానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. జిల్లాల్లో పర్యటించిన సందర్భంలో తమ భూ సమస్యలు ఈ భూ భారతి చట్టంతో పరిష్కారమవుతాయనే నమ్మకం, విశ్వాసాన్ని రైతులు వ్యక్తం చేశారు. ధరణితో వారు అనుభవించిన కష్టాలను, బాధలను వ్యక్తం చేశారు. ధరణితో రైతులు ఎదుర్కొన్న సమస్యలను చెప్తుంటే వారు పడ్డ కష్టం కళ్ళముందే కనిపించింది.
రైతుల భూ సమస్యలను వీలైనంత త్వరితగతిన పరిష్కరించడానికి అధికార యంత్రాంగాన్ని సంసిద్ధం చేశాం. ఇక నుంచి రైతులు ఏ కోర్టుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా రెవెన్యూ కార్యాలయంలోనే వాళ్ళ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. ప్రజల వద్దకే అధికారులు వచ్చి పైసా ఖర్చు పరిష్కరించే విధానం నిరంతరం కొనసాగుతుంది. ఈ పైలెట్ నాలుగు మండలాలలో కోర్టు పరిధిలో ఉన్న భూ సమస్యలు మినహా అన్ని సమస్యలను జూన్ 2వ తేదీ నాటికి పరిష్కరిస్తాం. ఆ నాలుగు మండలాల మాదిరిగానే ఈ నెల 5వ తేదీ నుంచి రాష్ట్రంలోని 28 జిల్లాల్లో జిల్లాకు ఒక మండలంలో పూర్తి స్థాయిలో భూ భారతిని అమలు చేస్తున్నాం. చట్టం తీసుకువస్తే సరిపోదు, అదీ పూర్తి స్దాయిలో అమలు జరిగినప్పుడే రైతులకు నిజమైన న్యాయం లభిస్తుంది. ఆ దిశగా మా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది.






