TG Govt.: శరవేగంగా సాగు భూముల మార్కింగ్.. వ్యవసాయ శాఖ కసరత్తు

by Kema Shiva Kumar |

తెలంగాణ ప్రభుత్వం అన్నదాతలకు రైతు భరోసా పంపిణీ చేసేందుకు ఏర్పాట్లను వేగం చేసింది.

TG Govt.: శరవేగంగా సాగు భూముల మార్కింగ్.. వ్యవసాయ శాఖ కసరత్తు
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వం అన్నదాతలకు రైతు భరోసా పంపిణీ చేసేందుకు ఏర్పాట్లను వేగం చేసింది. అందుకు గాను 5 శాఖల సమన్వయంతో సర్వే చేసి ఈనెల 22లోగా పంట సాగు భూముల వివరాలు సేకరించి, ఆ జాబితా వ్యవసాయ శాఖకు అప్పగించనుంది. ఇప్పటికే మండలానికి ఒక విలేజ్​ఎంపిక చేసిన అధికారులు, అక్కడ పంట భూముల వద్దకు వెళ్లి ఏ పంట, ఎంత విస్తీర్ణంలో సాగు చేశారో సర్వే చేపట్టింది. వివిధ శాఖలకు చెందిన సిబ్బంది గ్రామాల వారీగా సాగుకు పనికి రాని భూముల లెక్కలను సంబంధిత శాఖలతో కలిసి సర్వే చేపట్టారు. రాళ్లు, రప్పలు, కొండలు, గుట్టలు, పరిశ్రమల భూములు, రియల్ వెంచర్లు, నాలా, ప్రభుత్వం వివిధ అవసరాలకు సేకరించిన భూములు, నివాసాలు ఏర్పాటైన భూములను రైతు జాబితా నుంచి తొలగించనున్నారు. వాటి వివరాలు వస్తే సాగు భూముల వివరాలు సులభంగా గుర్తించవచ్చని అధికారులు భావిస్తున్నారు. కొంత భూమి సాగులో ఉండి, మరికొంత సాగుకు యోగ్యం కాని భూమి ఉంటే పట్టాదారు ఖాతా నంబర్ కాకుండా, ఎక్కడ సాగుకు అవకాశం లేదో ఆ సర్వే నంబరు గుర్తించి దానికి రైతు భరోసా కోత పెట్టనున్నారు.

ఐదు శాఖల నుంచి పంట వివరాలు సేకరణ

ఇప్పటికే నాలుగు శాఖల నుంచి రాళ్లు, కొండలు, గుట్టలు, రియల్ వెంచర్లు, పరి శ్రమల భూములు, నాలా, ప్రభుత్వ వివిధ అవసరాలకు సేకరించిన భూముల వివరాలను ఆయా శాఖలు సిద్ధం చేసి 2 లేదా 3 రోజుల్లో ప్రభుత్వానికి జాబితా ఇవ్వనున్నారు. ముందుగా వీటన్నింటిని వ్యవసాయ శాఖ క్రోడికరించి రైతు భరోసా అందకుండా ఆ సర్వే నెంబర్లను బ్లాక్ లిస్టులో పెట్టనుంది. నాలా భూముల వివరాలను మున్సిపల్ శాఖ నుంచి.. ఇరిగేషన్ ప్రాజెక్టుల కాల్వలు, శిఖం భూముల వివరాలను ఇరిగేషన్ శాఖ నుంచి.. రోడ్లకు సంబంధించి ఆర్​అండ్​బీ శాఖ, పరిశ్రమల కోసం తీసుకున్నవి టీజీఐఐసీ నుంచి, ఇతర అవసరాలకు తీసుకున్నవి కలెక్టర్​ఆఫీసులోని భూసేకరణ విభాగం నుంచి తీసుకుంటారు. క్షేత్రస్థాయిలో రెవెన్యూ, వ్యవసాయ, పంచాయతీరాజ్ శాఖల అధికారులు పరిశీలన చేపడుతారు.

వానా కాలం సాగు వివరాలు పరిగణలోకి..

వానాకాలంలో సాగు చేసిన భూమి వివరాలను ఐదారు రోజుల క్రితమే వ్యవసాయ శాఖ నుంచి ప్రభుత్వం తెప్పించుకున్నట్లు తెలిసింది. అధికార గణాంకాల ప్రకారం 1.38 లక్షల ఎకరాల్లో పంట సాగు చేసినట్లు గతంలోనే వెల్లడించాయి. ఈ లెక్కలను ప్రామాణికంగా తీసుకుని రైతు భరోసా డబ్బులను అన్నదాతల ఖాతాల్లో జమ చేసేందుకు సరిపడా నిధులు కూడబెట్టేందుకు ప్రయత్నాలు వేగం చేసింది. యాసంగి సీజన్‌కు రైతులు వడ్డీ వ్యాపారుల వద్దకు వెళ్లకుండా చూడనుంది. గత బీఆర్ఎస్​ పంపిణీ చేసిన దానికంటే రూ.1000 కోట్లు అదనంగా పెరగవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. సీసీఎల్‌ఏ రికార్డుల ప్రకారం రాష్ర్టంలో 69.99 లక్షల మందికి 1. 54 లక్షల ఎకరాల భూమి ఉన్నది. ఆ లెక్కల ప్రకారం ఇవ్వడం కుదరని, ప్రభుత్వం సాగుభూములే ప్రామాణికంగా తీసుకుని రైతు భరోసా పక్కదారి పట్టకుండా చర్యలు తీసుకుంటోంది.

Next Story