TG Govt.: ముగిసిన పుర‘పాలన’.. రంగంలోకి దిగనున్న స్పెషల్ ఆఫీసర్లు

by Kema Shiva Kumar |   (  Updated:2025-01-27 02:03:32  IST  )

పాలకవర్గాల గడువు ముగిసిన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ప్రభుత్వం ప్రత్యేకాధికారులను నియమించింది.

TG Govt.: ముగిసిన పుర‘పాలన’.. రంగంలోకి దిగనున్న స్పెషల్ ఆఫీసర్లు
X

దిశ, తెలంగాణ బ్యూరో: పాలకవర్గాల గడువు ముగిసిన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ప్రభుత్వం ప్రత్యేకాధికారులను నియమించింది. ఈ మేరకు పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి దాన కిశోర్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 143 పట్టణ స్థానిక సంస్థలు ఉన్నాయి. వీటిలో 129 మున్సిపాలిటీలు ఉండగా, మందమర్రి, మణుగూరు, పాల్వంచ, జహీరాబాద్ మున్సిపాలిటీలకు అనివార్యకారణాల వల్ల ఎన్నికలు నిర్వహించలేదు. ఆసిఫాబాద్ మున్సిపాలిటీని కొత్తగా ఏర్పాటు చేశారు. జనవరి 26తో 120 మున్సిపాలిటీ పాలకవర్గాల గడువు ముగిసింది. అచ్చంపేట, జడ్చర్ల, సిద్దిపేట, కొత్తూరు, నకిరకల్ మున్సిపాలిటీలకు పాలకవర్గాల పదవీకాలం 2026 మే వరకు ఉన్నది.

9 కార్పొరేషన్లకు సైతం..

రాష్ట్రవ్యాప్తంగా 14 కార్పొరేషన్లు ఉండగా.. ఇందులో ఎనిమిది కార్పొరేషన్లకు సంబంధించి పాలకవర్గాల గడువు ఆదివారానితో ముగిసింది. కరీంనగర్ కార్పొరేషన్ గడువు జనవరి 28తో ముగియనున్నది. గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ల పాలకవర్గాల గడువు 2026 మే వరకు ఉన్నది. జీహెచ్ఎంసీకు 2026 ఫిబ్రవరి వరకు గడువు ఉన్నది. ఇప్పటికే నస్పూర్ మున్సిపాలిటీని మంచిర్యాల కార్పొరేషన్ లో, కొత్తపల్లిని కరీంనగర్ కార్పొరేషన్ లో ప్రభుత్వం విలీనం చేసింది.

అధికారులకు స్పెషలాఫీసర్ల బాధ్యతలు

పాలకవర్గాల గడువు ముగిసిన 120 మున్సిపాలిటీలు, 8 కార్పొరేషన్లు, జనవరి 28తో ముగియనున్న కరీంనగర్ కార్పొరేషన్ కు స్పెషలాఫీసర్లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయా జిల్లాల్లో ఉన్న కార్పొరేషన్ల సంఖ్యను బట్టి స్పెషలాఫీసర్లుగా కలెక్టర్లు, డీఆర్ఓ, సీనియర్ అధికారులు, పురపాలకశాఖకు సంబంధించిన జాయింట్ డైరెక్టర్ స్థాయి అధికారులను కూడా నియమించింది. మున్సిపాలిటీలకు రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ (ఆర్డీఓ)లను నియమించనుంది.

Next Story