TG Govt.: ‘భూ భారతి’ ప్రజాస్వామ్య స్ఫూర్తి.. ‘డ్రాఫ్ట్ బిల్లు’పై అభిప్రాయ సేకరణ

by Kema Shiva Kumar |

భూ పరిపాలనలో కీలక పరిణామం చోటు చేసుకున్నది. భూ భారతి ఆర్వోఆర్ యాక్ట్-2024 కు గవర్నర్ ఆమోదం లభించింది.

TG Govt.: ‘భూ భారతి’ ప్రజాస్వామ్య స్ఫూర్తి.. ‘డ్రాఫ్ట్ బిల్లు’పై అభిప్రాయ సేకరణ
X

దిశ, తెలంగాణ బ్యూరో: భూ పరిపాలనలో కీలక పరిణామం చోటు చేసుకున్నది. భూ భారతి ఆర్వోఆర్ యాక్ట్-2024 కు గవర్నర్ ఆమోదం లభించింది. 14 ఏండ్ల తర్వాత ప్రజాస్వామ్యయుతంగా రూపొందించిన చట్టమిది. డ్రాఫ్ట్ బిల్లును ప్రజల్లో పెట్టి అభిప్రాయాలను సేకరించారు. చేర్పులు, మార్పులు చేపట్టి ప్రజానుకూల బిల్లుగా అసెంబ్లీ, మండలిలో ఆమోదించారు. సుదీర్ఘ కాలం పాటు అన్ని వర్గాలతో డిస్కషన్ చేశారు. దానికి తోడు 22 సార్లు రివ్యూ చేసిన తర్వాతే తుది రూపం ఇచ్చారు. గతంలో అమల్లోకి వచ్చిన ఏ చట్టమూ ఈ రీతిన ప్రజల్లో చర్చ పెట్టిన దాఖలాలు లేవు. అందుకే భూ భారతి అమలు దేశ వ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది.

ఇక.. రూల్స్ ఫ్రేమ్ పై ఎక్సర్ సైజ్

భూభారతి.. వ్యవసాయ, వ్యవసాయేతర స్థలాలు కలిగిన ప్రతి ఒక్కరికి సంబంధించిన చట్టం. ఇంటి స్థలాలకు కూడా వర్తిస్తుంది. అయితే గవర్నర్ ఆమోదించగానే మరుసటి రోజు నుంచే ఈ చట్టం అమల్లోకి రాదు. అమలుకు చాలా కసరత్తు చేయాల్సి ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. చట్ట రూపకల్పన కంటే అమలుకు సంబంధించిన అంశాలపై చేసే ఎక్సర్ సైజ్ కష్టతరమైనది. చట్టానికి అనుకూలంగా రూల్స్ తయారు చేయాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత చట్టం ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందో నోటిఫై చేయాల్సి ఉంది. దానికి ఎంత సమయం పడుతుందో వేచి చూడాలి. అయితే భూ భారతికి మూడు నెలల్లోపే రూల్స్ ఫ్రేం చేస్తామని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అసెంబ్లీలో ప్రకటించడం గమనార్హం. అందుకే చట్టాన్ని ఏ తేదీ నుంచి అమలు చేస్తారు? అన్నీ ఒకే రోజు నుంచి అమలు చేస్తారా? లేదంటే ఏ అంశాలను ముందు అమలు చేస్తారు? ఈ అంశాలు తేలాల్సి ఉంది. చట్టాన్ని రేపో మాపో గెజిట్ పబ్లికేషన్ చేయనున్నారు. ఒకటీ రెండు రోజుల్లో పబ్లిక్ డొమెయిన్ లో అందుబాటులో ఉంచుతారని తెలిసింది.

అన్నీ కాదు.. ఒక్కొక్కటిగానే..

భూ భారతి చట్టంలో అనేక కీలకాంశాలు ఉన్నాయి. వాటిని అన్నీ ఒకేసారి అమలు చేయడం కష్టమే. ఆర్వోఆర్-2024 సెక్షన్ 1(3) ప్రకారం రాష్ట్రం మొత్తం ఒకేసారి అమలు చేస్తారా? గ్రామీణ ప్రాంతాల్లోనే ముందు అమల్లోకి తీసుకొస్తారా? అన్ని అంశాలనా? కొన్నింటినే చేస్తారా? అనేది తేలాల్సి ఉన్నది. ఉదాహరణకు సేల్ డీడ్, ఇతర లావాదేవీలకు సర్వే మ్యాప్ తప్పనిసరి అనే సెక్షన్ ఉంది. దాన్ని అమలుకు ముందు ప్రభుత్వం కసరత్తు చేయాల్సి ఉంది. ప్రతి మండలంలోనూ సర్వే చేసేందుకు వ్యవస్థ ఏర్పాటు చేయాలి. అది పూర్తయిన తర్వాతే అమల్లోకి వస్తుంది. అలాగే భూదార్ టెంపరరీ, పర్మినెంట్ నంబర్ ఇచ్చే సెక్షన్ అమలుకు కూడా కసరత్తు జరగాలి. సక్సెషన్ చేసేందుకు విచారణ చేసే వ్యవస్థ రావాలి. ఇలా ప్రతి అంశానికి ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి. వాటన్నింటినీ ఏర్పాటు చేయడం తప్పనిసరి. అలాగే ప్రతి సెక్షన్ అమలుకు రూల్స్ ఫ్రేం చేయాల్సి ఉంది. ఇవన్నీ పూర్తయిన తర్వాతే చట్టం అమల్లోకి రావాలి. అయితే అన్ని అంశాలపై క్లారిటీ వచ్చేంత వరకు ఆగాల్సిన పని కూడా లేదు. సాధారణ పనులు జరిగేందుకు ఇప్పుడున్న వ్యవస్థ అమలుకు తేదీని ప్రకటించే వీలుంది. చట్టం మొత్తం ఒకేసారి అమల్లోకి తీసుకొచ్చే తేదీని ప్రకటించాలంటే సమగ్రమైన రూల్స్ ని రెడీ చేయాల్సి ఉంటుందని నిపుణులు చెప్తున్నారు.

ఆర్వోఆర్-2020కి రూల్స్ లేవు

ధరణి పోర్టల్ ను అమల్లోకి తీసుకొచ్చిన ఆర్వోఆర్-2020 కు ఇప్పటి వరకు రూల్స్ లేవు. ఎలాంటి రూల్స్ తయారు చేయకుండానే 2020 అక్టోబరు 29న చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. ఎప్పటికప్పుడు సర్క్యులర్లతోనే కాలం వెళ్లదీశారు. కానీ సమగ్రమైన నిబంధనలను రూపొందించకపోవడం వల్లే ఏ అధికారి ఏ పని చేయాలన్న క్లారిటీ లేదు. ఆ నిబంధనల రూపకల్పన లేకుండానే అమల్లోకి తీసుకొచ్చిన చట్టం వల్లే లక్షలాది మంది రైతులు ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు ఆర్వోఆర్-2024కు కూడా రూల్స్ తప్పనిసరి. అలాగే ఆర్వోఆర్-1971 యాక్ట్ కి ముందు కొన్ని రూల్స్ మాత్రమే డిజైన్ చేశారు. నిజానికి 1989లో పూర్తి స్థాయిలో రూల్స్ ఫ్రేం చేశారు. అంటే నిబంధనలను రూపొందించడానికి 18 సంవత్సరాల సుదీర్ఘ కాల వ్యవధిని తీసుకోవడం గమనార్హం. ఇలా ప్రతి ఆర్వోఆర్ యాక్ట్‌ కి రూల్స్ పక్కాగా ఉండాలి.

ఆర్వోఆర్ చట్టమే కీలకం

అన్ని చట్టాల కంటే ఆర్వోఆర్ యాక్ట్ చాలా ప్రధానమైనది. అందరికీ ఆమోదయోగ్యంగా, ప్రజాస్వామ్యయుతంగా రూపొందించిన చట్టమిది. అమలు కూడా ప్రజల భాగస్వామ్యంతో ఉండాలి. అప్పుడే ఈ చట్టం ఫలాలు ప్రజలకు దక్కుతాయి. పన్ను వసూళ్లు చేసే చట్టం కాదు. అందుకే కేవలం రెవెన్యూ శాఖతోనే చేయాల్సింది కాదు. ప్రజలను భాగస్వాములను చేయాల్సిన అవసరం ఉంటుంది. రికార్డుల నిర్వహణలోనూ ప్రజల భాగస్వామ్యాన్ని పెంచాలి. వాస్తవ భూ యజమాని పేరు రికార్డుల్లో ఉండాలి. వారందరికీ పట్టాదారు పాసు పుస్తకాలు అందాలి. ఆర్వోఆర్ యాక్ట్-2024 ద్వారా అంతిమంగా రైతుకు మేలు కలిగించాలి. అలాగే హక్కుల గ్యారంటీ ఇచ్చే రూపం రావాలి.

- ఎం.సునీల్ కుమార్(భూమి సునీల్), భూ చట్టాల నిపుణులు

Next Story