- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TG Govt: సర్కార్ బడుల్లో ఏఐ బోధన.. భారీగా పెరుగుతోన్న అడ్మిషన్లు
ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్చుకోవడమే లక్ష్యంగా ప్రభుత్వం వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నది.

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్చుకోవడమే లక్ష్యంగా ప్రభుత్వం వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నది. అందులో భాగంగా పాఠశాల స్థాయి నుంచే సాంకేతిక విద్యను అందిస్తున్నది. ఇటీవల ఏఐతో సరికొత్త ఒరవడిని సృష్టిస్తున్నది. 2025-26 విద్యా సంవత్సరం నుంచి 50కి పైగా విద్యార్థులు ఉన్న అన్ని ప్రాథమిక పాఠశాలల్లో ఐదు చొప్పున కంప్యూటర్లు ఏర్పాటు చేసి విద్యార్థులకు పాఠాలు చెప్పాలని విద్యాశాఖ నిర్ణయించింది. జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలలు వాటిని అమలు చేస్తున్నాయి. ప్రభుత్వ బడుల్లో ప్రవేశాలు ఇంకా కొనసాగుతున్నందున.. ఎన్ని స్కూళ్లలో ఏఐ భోధన అమలవుతుందనే విషయాల్లో క్లారిటీ రావడానికి కాస్త సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు. ఏఐ విద్యాబోధన వల్ల మెరుగైన అభ్యాస ఫలితాలు వస్తాయని, విద్యార్థులలో విశ్లేషణాత్మక ఆలోచన, సమస్య పరిష్కార నైపుణ్యాలు గణనీయంగా పెరుగుతాయని విద్యారంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
20 నిమిషాల పాటు..
ప్రత్యేక సాఫ్ట్ వేర్ తో పిల్లలను ఆకట్టుకునేలా ఏఐ ద్వారా బోధిస్తున్నారు. విద్యార్థులు కంప్యూటర్ ను అవలీలగా ఉపయోగిస్తూ పోటాపోటీగా ఇందులో పాల్గొంటున్నారు. 3, 4, 5 తరగతులను ఒక బ్యాచ్ గా విభజించి.. ఒక్కో బ్యాచ్ కు తెలుగు, ఇంగ్లిష్, మ్యాథ్స్ అభ్యాసన సామర్థ్యాలపై 20 నిమిషాల పాటే ఏఐ ద్వారా బోధిస్తున్నారు. విద్యార్థి అర్థం చేసుకుంటున్నాడా, లేదా అని ఏఐ గుర్తిస్తున్నది. అర్థం కాకుంటే సులువైన మార్గంలో, మెరుగైన పద్ధతిలో బోధిస్తున్నది. ప్రతి విద్యార్థి సామర్థ్యాలు మెరుగయ్యేలా చర్యలు తీసుకుంటున్నది.
విద్యార్థుల నుంచి విశేష స్పందన
తెరపై చూస్తుండడం, హెడ్ ఫోన్ సాయంతో వినిపించేలా ఏర్పాటు చేయడంతో ఎక్కువ కాలం గుర్తుంచుకునే అవకాశం ఉంటుంది. క్లాస్ లో వెనకబడిన విద్యార్థులు కూడా చదవడం, రాయడం, మ్యాథ్స్ ఈజీగా చేయడం నేర్చుకోగలుగుతున్నారు. సంప్రదాయ బోధనా పద్ధతుల కంటే ఏఐ ద్వారా నేర్చుకోవడం సులభంగా, మరింత ఆకర్షణీయంగా ఉందని పలువురు విద్యార్థులు చెబుతున్నారు. క్లాసులో ఏఐ ఉన్నందున.. కష్టమైన లెక్కలను కూడా సులభంగా చేయగలుగుతున్నామని పేర్కొంటున్నారు.
5,651 స్కూళ్లలో..
ఏఐ బోధనకు ఎక్ స్టెప్ ఫౌండేషన్ సహకారం అందిస్తున్నది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 5,651 ప్రాథమిక పాఠశాలల్లో ఏఐ ఆధారిత బోధనకు ఏర్పాట్లు చేశారు. సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథమెటిక్స్ (స్టెమ్) సబ్జెక్టులపై విద్యార్థులకు మరింత అవగాహన కల్పించేందుకు.. రాష్ట్రంలోని అన్ని ఉన్నత పాఠశాలల్లో టీ-స్టెమ్ ల్యాబ్‌లను ఏర్పాటు చేస్తున్నారు. వాటిని 6 నుంచి 10 తరగతి ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు సైతం ఉపయోగించుకోవచ్చు. దీనికోసం ఖాన్ అకాడమీ సహకారం అందించనుంది. అలాగే చదువులో వెనుకబడిన విద్యార్థులపై మరింత శ్రద్ధ పెట్టేందుకు పీజీ కాంట్రాక్టు టీచర్లను నియమించనున్నారు. అలాగే ఇప్పటికే జూనియర్ లెక్చరర్లుగా విధులు నిర్వర్తిస్తున్న వారి సేవలనూ పాఠశాలల్లో వినియోగించనున్నారు. ఎక్ స్టెప్ ఫౌండేషన్ ద్వారా ప్రస్తుతం 540 పాఠశాలల్లో కృత్రిమ మేధ ఆధారిత ప్లాట్‌ఫారమ్‌తో పనిచేస్తున్న ఈ సంస్థ, ఇకపై 33 జిల్లాల పరిధిలో ఐదువేలకు పైగా ప్రాథమిక పాఠశాలలకు విస్తరించనుంది. 3 నుండి 5వ తరగతి విద్యార్థులకు తెలుగు, ఇంగ్లిష్ భాషలతోపాటు గణితం ప్రాథమికాంశాలను ఈ సంస్థ అందిస్తున్నది. ఖాన్ అకాడమీ ద్వారా రాష్ట్రంలో 6వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులకు పాఠ్యాంశాలకు అనుగుణంగా వీడియో ఆధారిత స్టెమ్ (సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథ్స్) శిక్షణను అందజేయనున్నారు. జామ్ ఫౌండేషన్ ద్వారా ఒకటో తరగతి నుండి పదో తరగతి వరకు విద్యార్థులకు కోడింగ్, కంప్యూటేషనల్ థింకింగ్‌పై శిక్షణను అందిస్తున్నారు.






