TG Govt.: ఎరువుల దుకాణాలపై వ్యవసాయ శాఖ నజర్.. కృత్రిమ కొరతపై ఉక్కుపాదం

by Kema Shiva Kumar |

యాసంగిలో రైతులకు సరఫరా చేయాల్సిన ఎరువులు బ్లాక్ మార్కెట్‌‌కు తరలిస్తున్నారంటూ ఇప్పటికే పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో యూరియా కృత్రిమ కొరత సృష్టించే వ్యాపారుల భరతం పట్టేందుకు వ్యవసాయ శాఖ నడుం బిగించింది.

TG Govt.: ఎరువుల దుకాణాలపై వ్యవసాయ శాఖ నజర్.. కృత్రిమ కొరతపై ఉక్కుపాదం
X

దిశ, తెలంగాణ బ్యూరో: యాసంగిలో రైతులకు సరఫరా చేయాల్సిన ఎరువులు బ్లాక్ మార్కెట్‌‌కు తరలిస్తున్నారంటూ ఇప్పటికే పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో యూరియా కృత్రిమ కొరత సృష్టించే వ్యాపారుల భరతం పట్టేందుకు వ్యవసాయ శాఖ నడుం బిగించింది. జిల్లాలో ఎరు వుల దుకాణాలు, గోదాముల్లో అక్ర మంగా నిల్వ చేసిన స్టాక్ను తనిఖీ చేసేం దుకు ముగ్గురితో కూడిన ఆరు బృందాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఆ శాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు. గత వానాకాలం సీజన్లో కూడా ఇదే విధంగా ఎరువుల దుకాణాదారులు టన్నుల కొద్దీ యూరియా నిల్వలు ఉంచుకొని కృత్రిమ కొరత సృష్టించి రైతుల నుంచి అక్రమంగా దండుకున్నారు. ఈ యాసంగి సీజన్లో అలాంటి పరిస్థితులు రాకుండా అక్రమార్కులపై ఉక్కుపాదం మోపేందుకు అధికారులు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మెదక్, సంగారెడ్డి, సూర్యాపేట, నల్లగొండ, ఆదిలాబాద్, కరీంనగర్, నారాయణపేట జిల్లాల్లో యూరియా కోసం అన్నదాతలు కనబడిన ఎరువుల దుకాణం చుట్టూ తిరిగే పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం ఎరువుల కొరత లేకుండా ముందుస్తుగానే జిల్లాలకు తరలించింది. గత పాలకుల అనుభవాలను దృష్టిలో పెట్టుకొని వానాకాలంలో కొంత ఇబ్బందులైనా, యాసంగి పంటకు ఎలాంటి సమస్యలు రాకుండా వ్యవసాయ శాఖ అధికారులను అప్రమత్తం చేసింది. ఎరువులు బహిరంగ మార్కెట్ కు తరలించకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. .

వ్యాపారుల ఇష్టారాజ్యం

ఎరువుల కృత్రిమ కొరతకు వ్యవసాయాధికారులు ఎప్పటికప్పడు తనిఖీలు చేయకపోవడమే ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఈ సీజన్కు 9.80 లక్షల టన్నుల యూరియా, 1.50 లక్ష టన్నుల డీఏపీ, 7 లక్షల టన్నుల కాంప్లెక్స్ , 70వేల టన్నుల ఎంఓపీ, 60 వేల టన్నుల ఎరువులు అవసరమవుతాయని వ్యవసాయ శాఖ అంచనా వేసి 4.98 లక్షల టన్నుల యూరియా, 1.26 లక్షల టన్నుల డీఏపీ , 4.66 లక్షల టన్నుల క్లాంప్లెక్స్, 28 వేల టన్నుల ఎంఓపీ, 22 వేల టన్నుల ఎరువులు సరఫరా చేసి అన్నదాతలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టింది. కానీ, ఎరువుల దుకాణాల యాజమానులు ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తూ ఇష్టానుసారంగా అమ్మకాలు చేస్తున్నారని అన్నదాతలు ఆరోపిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం రాయితీతో రూ.266 ధర నిర్ణయించగా, వ్యాపారులు రూ.350తో బ్లాక్మార్కెట్లో దర్జాగా అమ్మకాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వం మార్క్ ఫెడ్ ద్వారా 903 ప్రాథమిక సహకార సంఘాలు, 416 ఆగ్రోస్ రైతు సేవా కేంద్రాలు, 55 సేవా కేంద్రాల ద్వారా రైతులకు ఎరువుల సరఫరా చేస్తోంది.

రశీదులు ఇవ్వని దుకాణదారులు

రైతులు తమకు కావాల్సిన ఎరువులు కొనుగోలు చేస్తే దుకాణాల యాజమానులు దానికి సంబందించి రశీదు ఖచ్చితంగా ఇవ్వాలి. కానీ అధిక ధరలకు ఎరువులను విక్రయిస్తుండడంతో వ్యాపారులు రశీదు ఇవ్వకుండా రైతులు మబ్యపెడుతున్నారని రైతు సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. అదే విధంగా రైతులకు ఎరువులు, యూరియా విక్రయించే సమయంలో సదరు వ్యాపారులు రైతుల వేలిముద్రలు నమోదు చేయాల్సి ఉంటుంది. ఎరువుల వ్యాపారులు ఆయా నిబంధనలను పాటించడం లేదు. ఇప్పటికైనా వ్యవసాయ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు ఎరువుల దుకాణాలపై దాడులు కొనసాగిస్తూ, ఎరువులను బ్లాక్ మార్కెట్ కు తరలించకుండా చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.

Next Story