- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TG Govt.: 90 రోజుల యాక్షన్ ప్లాన్.. ఇక క్షేత్రస్థాయిలోనే సీఎం, మంత్రులు!
తెలంగాణలో అసెంబ్లీ సమావేశాల అనంతరం సీఎం, మంత్రులు 90 రోజుల పాటు క్షేత్రస్థాయిలో పర్యటించేలా ప్రభుత్వం భారీ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది.

దిశ, తెలంగాణ బ్యూరో: అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే ప్రభుత్వం ప్రజాక్షేత్రంలోకి వెళ్లేందుకు సిద్ధమవుతోంది. సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికార యంత్రాంగం మొత్తం గ్రామాలు, పట్టణాల్లో పర్యటించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి, సాధ్యమైన వాటికి వెంటనే పరిష్కారం చూపాలని భావిస్తున్నారు. అందుకోసం ప్రతి డిపార్ట్‌మెంట్ వారీగా ఏయే కార్యక్రమాలు చేపట్టవచ్చనే నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం అన్ని శాఖలను అప్రమత్తం చేసినట్లు తెలిసింది.
3 నెలల పాటు ప్రజాక్షేత్రంలోనే..
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మార్చి 16న మొదలై మార్చి 30న ముగియనున్నాయి. ఆ తర్వాత రెండు, మూడు రోజుల విరామంతో క్షేత్రస్థాయి కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఆ కార్యక్రమానికి ఇంకా పేరు నిర్ధారించలేదు కానీ, వరుసగా 90 రోజుల పాటు వివిధ కార్యక్రమాలను రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రోగ్రామ్ సందర్భంగా సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించనున్నారు. సమస్యలను గుర్తించి, తక్కువ నిధులతో పరిష్కారమయ్యే పనులకు వెంటనే నిధులు మంజూరు చేయనున్నారు.
పరిష్కారానికి ప్రత్యేక వింగ్
క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రజల వద్దకు వెళ్లడం ద్వారా ఒక సానుకూల వాతావరణం ఏర్పడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. దీనివల్ల ప్రజలు, ప్రభుత్వం మధ్య ఉన్న దూరం తొలగిపోనుంది. గ్రామాల్లో పారిశుద్ధ్యం, పచ్చదనం, తాగునీటి సరఫరా, స్కూల్ రిపేర్లు, అంగన్‌వాడీల్లో వసతులు, విద్యుత్ సమస్యలపై ఫోకస్ పెట్టనున్నారు. వ్యక్తిగత వినతులైన పెన్షన్, రేషన్ కార్డు, ధరణి సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక వింగ్‌ను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు.
యాక్షన్ ప్లాన్ తయారీ
90 రోజుల యాక్షన్ ప్లాన్ కోసం నివేదికలు ఇవ్వాలని అన్ని శాఖల సెక్రెటరీలను ఆదేశించారు. మార్చి మొదటి వారంలో సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా వీటిని పరిశీలించి షెడ్యూల్‌ను ఖరారు చేయనున్నారు. స్కూల్స్ రీఓపెన్ అయ్యేలోపు ఈ ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ కోసం యత్నం
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు వెళ్లేముందు ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను తొలగించి, ‘ఫీల్ గుడ్ ఫ్యాక్టర్’ తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. వర్షాకాలం తర్వాతే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, 3 కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది.
ముందుగానే రైతుభరోసా?
క్షేత్రస్థాయి పర్యటనలు ప్రారంభం కాకముందే యాసంగి రైతుభరోసా నిధులను విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనివల్ల ప్రజల్లోకి వెళ్లినప్పుడు సానుకూల స్పందన ఉంటుందని, లేనిపక్షంలో నిధుల కోసం ప్రజలు ప్రశ్నించే అవకాశం ఉంటుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.






