TG: తెలంగాణలో ఇంధన సెగ.. పెట్రోల్ బంకుల వద్ద ‘నో స్టాక్’ బోర్డులు

by Kema Shiva Kumar |

తెలంగాణలో పెట్రోల్, డీజిల్ కొరతపై నెలకొన్న గందరగోళంపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే స్పష్టతనిచ్చింది.

TG: తెలంగాణలో ఇంధన సెగ.. పెట్రోల్ బంకుల వద్ద ‘నో స్టాక్’ బోర్డులు
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో గత రెండు రోజులుగా పెట్రోల్, డీజిల్​కొరత వేధిస్తున్నది. ఇది నిజంగానే కొరతా? లేక కృతిమమా? అనేది తెలియక వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. భయాందోళనకు గురైన కొందరు పెట్రోల్ కోసం బంకుల వద్దకు చేరుకోవడంతో భారీగా క్యూలైన్లు దర్శనమిస్తున్నాయి. హైదరాబాద్​మహానగరంలో ఇప్పటికే అనేక బంకులు మూతపడ్డాయి. పలు చోట నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. దీంతో వాహనదారుల్లో మరింత టెన్షన్​పెరిగింది. ఎక్కడైతే బంకులు తెరిచి ఉంటున్నాయో అక్కడకు పెద్దఎత్తున వాహనదారులు చేరుకుంటున్నారు. రోడ్డుకు ఒకవైపు పెట్రోల్​కోసం వేచి చూసే వాహనాలతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. దీంతో బుధవారం ఉదయం ఆఫీసులు, కాలేజీలు, స్కూల్స్, షాపింగ్‌, ఇతర పనులకు వెళ్లే వారు తమ గమ్యస్థానం చేరుకోవడానికి గంటల కొద్ది సమయం పట్టింది. నగరంలోని రోడ్లపై వాహనాలు నెమ్మదించాయి. పెట్రోల్​కొరతతో వాహనదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెండ్రోజులుగా తాము క్యూలైన్లలో ఉండాల్సి వచ్చిందని మండిపడుతున్నారు. కొరత ఉందంటూ బంకుల్లో పెట్రోల్ కోసం వాహనదారులు వేచిచూస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో భయాందోళనకు గురై మరికొందరు బంకుల వద్ద బారులు తీరారు. రద్దీ ఎక్కువ కావడంతో కొన్ని చోట్ల బంకులు మూసివేసినట్టు తెలిసింది.

ఆయిల్ కంపెనీల వల్లే..

పెట్రోల్ కొరతపై బంకు యజమానులు అంతర్గతంగా మరో విషయాన్ని చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ఇండియన్, భారత్, హిందుస్థాన్​ఆయిల్​కంపెనీలు ఇప్పటివరకు కొనసాగుతున్న నిబంధనలను మార్చారని, దాని ఫలితమే ఈ సంక్షోభమని వెల్లడించారు. గతంలో పెట్రోలియం డీలర్లు ఒక ట్యాంకర్ పెట్రోల్​తీసుకొన్న తరువాత కొన్ని రోజుల తరువాత డబ్బులు చెల్లించే ఆప్షన్​ఇచ్చేవారని, ఇప్పుడు డబ్బులు మొత్తం చెల్లిస్తేనే అయిల్ ట్యాంకర్ బుకింగ్‌కు ఆప్షన్​ఇస్తున్నారని పేర్కొన్నారు. గతంలో సరఫరా చేసిన ట్యాంకర్ల డబ్బులు కూడా ఇప్పుడు చెల్లించిన తర్వాతనే బుకింగ్ ఆప్షన్ ఇస్తామని, డబ్బులు ఇవ్వకుంటే ట్యాంకర్‌ల సరఫరా లేదని తేల్చిచెప్పినట్లుగా సమాచారం. ఈ నిబంధనలపై పెట్రోలియం డీలర్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేస్తున్నారు. ఒక్కసారిగా అన్ని డబ్బులు తీసుకురాలేమని, తమకు కొంత వెసులుబాటు ఇవ్వాలని కోరుతున్నారు. అదే సమయంలో గతంలోని బకాయిలు కూడా ఇప్పుడే చెల్లించాలంటూ ఒత్తిడి తెవడం సరికాదని వారు అంటున్నారు. దీంతో డీలర్లు ట్యాంకర్లు బుక్​చేసుకోవడంలేదని సమాచారం. అందువల్లే నగరంలో పెట్రోల్​కొరత ఏర్పడిందని విశ్లేషిస్తున్నారు. ఈ విషయం తెలియక ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. గత పది రోజులుగా గ్యాస్​సిలిండర్​సమస్య కొనసాగుతుండగా దానికి అదనంగా పెట్రోల్​సమస్య ఏర్పడటంపై సామాన్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం మాత్రం ఎక్కడా పెట్రోల్​ కొరత లేదని ప్రకటనలు చేస్తున్నది. జాతీయ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ప్రభుత్వ అధికారులు పెట్రోల్​కొరతపై ప్రెస్‌ మీట్‌లు పెట్టి కొరత లేదంటూ వివరణ ఇచ్చారు.

సరఫరా ఇలా..

క్షేత్రస్థాయి పరిస్థితులు ఒక రకంగా ఉండగా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మరో రకంగా చెబుతోంది. హైదరాబాద్​మహానగరంలో 596 పెట్రోల్​బంకులు ఉండగా.. బుధవారం 17,246 కిలో లీటర్ల డిమాండ్ నెలకొన్నది. అయితే, 17,898 కిలోలీటర్ల సరఫరా చేశారు. 652 కిలో లీటర్ల అదనపు నిల్వ మిగిలి ఉన్నది. అదనంగా 16వేల కిలో లీటర్ల ఇంధనం నిల్వ ఉంచడంతో పాటు 1200 అదనపు ట్యాంకర్లను వినియోగిస్తున్నట్టు లెక్కలను వెల్లడించింది.

డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి ఉత్తమ్ సమీక్ష

హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా గ్యాస్, పెట్రోల్, డీజిల్ నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. బుధవారం శాసనమండలి సమావేశపు హాలులో రాష్ట్ర పౌర సరఫరాలు, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావులతో కలిసి గ్యాస్, పెట్రోల్ సరఫరాపై సమీక్షించారు. పెట్రోల్‌పై అపోహలు కలిగించే మాధ్యమాల కథనాలతో ఆందోళన చెందవద్దని వినియోగదారులకు సూచించారు. మరోవైపు విజిలెన్స్​అధికారులు రంగంలోకి దిగారు. పెట్రోలియం డీలర్స్​అసోసియేషన్​ఈ సమస్యపై స్పందించింది. పెట్రోల్​కొరత లేదని, ప్రజలు, వాహనదారులు అనవసరంగా ఆందోళన చెందవద్దంటూ కోరారు. ఎక్కడా కూడా కొరత లేదని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

పెట్రోల్, డీజిల్, ఎల్‌పీజీ కొరత ఉందంటూ జరుగుతున్న ప్రచారాన్ని మంత్రి ఉత్తమ్ ఖండించారు. పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్రతో కలిసి ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ.. మూడు నెలలకు సరిపడా నిల్వలు రాష్ట్రంలో ఉన్నాయని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో జరిగే ప్రచారాన్ని నమ్మవద్దన్నారు. పెద్దఎత్తున పెట్రోల్ వినియోగంతో రోజువారి డిమాండ్ ఒక్కసారిగా 25% పెరిగిందన్నారు. కొన్ని బంకులకు నిర్ణీత సమయానికి ట్యాంకర్లు చేరుకోకపోవడంతో నో స్టాక్ బోర్డులు వెలుస్తున్నాయన్నారు. ఇంధన సరఫరాలో ఎటువంటి ఆటంకాలు లేకుండా ఓజీసీ లైన్‌ను విస్తరించినట్లు తెలిపారు.

కేంద్రం అధికారుల సమీక్ష..

పెట్రోల్, గ్యాస్ కొరతలపై వస్తున్న తప్పుడు సమాచారాన్ని అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర కార్యదర్శి రాష్ట్రాలకు సూచించారు. ఎల్‌పీజీ నిల్వల్లో ఎటువంటి కొరత లేదని కేంద్ర పెట్రోలియం సహజ వాయు మంత్రిత్వ శాఖ కార్యదర్శి నీరజ్ మిట్టల్ స్పష్టంచేశారు. దేశవ్యాప్తంగా ఎల్‌పీజీ, సహజ వాయు, పెట్రోలియం ఉత్పత్తుల లభ్యత, సరఫరా దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్య కార్యదర్శులతో బుధవారం మిట్టల్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణ రావు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఎల్‌పీజీ సిలిండర్లు, పెట్రోల్, డీజిల్ వంటి అవసరమైన ఇంధన పదార్థాల నిరంతర లభ్యత, ఉత్పత్తి, పంపిణీ , సరఫరాపై కార్యదర్శి సమీక్షించారు. పట్టణ ప్రాంతాల్లో 25 రోజులు, గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజుల వ్యవధిలోనే రీఫిల్ బుకింగ్ చేయాలనే నిబంధనలు యథాతథంగా ఉన్నాయని తెలిపారు. ఎల్‌పీజీ నుంచి పైప్ ద్వారా వచ్చే సహజ వాయువు (పీఎన్‌జీ) వైపు మారడం గృహాలకు తక్కువ ఖర్చుతో పాటు సౌకర్యవంతమని అధికారులు తెలిపారు. ఇందుకోసం ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్‌లను (స్టేట్​కంట్రోల్​సెంటర్స్) ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

Next Story