TG: ఫారెస్ట్ వైల్డ్ లైఫ్ @ తెలంగాణ.. వెల్లడించిన సర్వే ఆఫ్​ఇండియా

by Kema Shiva Kumar |   (  Updated:2025-04-01 02:05:57  IST  )

రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణంలో 27,688 చదరపు కిలోమీటర్ల మేర అడవి విస్తరించి ఉంది.

TG: ఫారెస్ట్ వైల్డ్ లైఫ్ @ తెలంగాణ.. వెల్లడించిన సర్వే ఆఫ్​ఇండియా
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణంలో 27,688 చదరపు కిలోమీటర్ల మేర అడవి విస్తరించి ఉంది. తెలంగాణలో జీవవైవిధ్యాన్ని కాపాడేందుకు రాష్ట్ర అటవీ శాఖ 12 రక్షిత ప్రాంతాలలో శాంక్చురీలు నిర్వహిస్తోంది. 2 టైగర్ రిజర్వ్‌లు, 3 జాతీయ ఉద్యానవనాలు, 7 వన్యప్రాణుల అభయారణ్యాలు ఉన్నాయి. ఇవి 18.15 లక్షల ఎకరాలలో విస్తరించి ఉన్నాయి. ఇది రాష్ట్ర అడవి ప్రాంతంలో దాదాపు 27శాతం మేర విస్తరించి ఉంది. ఇందులో 365 పక్షి జాతులు, 131 యానిమల్స్‌ ఉన్నాయని సర్వే ఆఫ్ ​ఇండియా ద్వారా ప్రభుత్వం వెల్లడించింది.

ప్రాజెక్ట్ టైగర్..

తెలంగాణలో ఈ అంతరించిపోతున్న బిగ్ క్యాట్‌ను పరిరక్షించేందుకు రెండు టైగర్ రిజర్వ్‌లు ఉన్నాయి. పులుల మనుగడ పునరుత్పత్తికి ఉపయోగపడుతున్నాయి. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ (ఏటీఆర్).. నల్లమల కొండ ప్రాంతాలలో.. నాగర్‌కర్నూల్, నల్లగొండ జిల్లాల్లో విస్తరించి ఉంది. దీని ప్రధాన ప్రాంతం 2,166.37 చదరపు కిలోమీటర్లు ఉండగా, దీని బఫర్ ప్రాంతం 445.02 చదరపు కిలోమీటర్లు. 2006లో సింగిల్ డిజిట్‌కు తగ్గిన టైగర్ జనాభా ఇప్పుడు సరైన నిర్వహణ, రక్షణతో పుంజుకుంటోంది.

కవ్వాల్ టైగర్ రిజర్వ్

892.23 చదరపు కిలోమీటర్ల కోర్ ఏరియా, 1,123.21 చదరపు కిలోమీటర్ల బఫర్ ఏరియాను కలిగి ఉంది. కవాల్ టైగర్ రిజర్వ్‌లో మహారాష్ట్రలోని తడోబా అంధారి టైగర్ రిజర్వ్, ఛత్తీస్‌గఢ్‌లోని ఇంద్రావతి టైగర్ రిజర్వ్‌లకు ఆనుకుని ఉన్న అటవీ ప్రాంతాలు ఉన్నాయి. ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్ (ఏఐటీఈ) 2022 ప్రకారం, కవ్వాల్ టీఆర్​ కోర్, బఫర్ కారిడార్ ప్రాంతాలలో 7 పులులు ఉన్నాయి. తెలంగాణ అటవీ భూ భాగంలో కవ్వాల్‌తో సహా 41 పాంథర్‌ల ఉనికిని కాపాడుతుంది. ఇది మునుపటి కంటే మెరుగుదలలో ఉన్నది.

వన్యప్రాణుల అభయారణ్యాలు, జాతీయ ఉద్యానవనాలు

జాతీయ ఉద్యానవనాలు వన్యప్రాణి జాతులకు నిలయాలుగా మారి గొప్ప జీవవైవిధ్యాన్ని ప్రదర్శిస్తున్నాయి. ఇందులో హైదరాబాద్‌లోని కాసు బ్రహ్మానందరెడ్డి జాతీయ ఉద్యానవనం ఒకటి 1.42 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్నది. ఈ ఉద్యానవనం ఆకుపచ్చ ఒయాసిస్‌గా పేరొందింది. నెమలి, కుందేళ్లు, అడవి పిల్లులు, పక్షులు, సరీసృపాలు వంటి జాతులకు నివాసంగా ఉంటుంది. రంగారెడ్డిలోని మృగవాణి జాతీయ ఉద్యానవనం 3.60 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్నది. ఈ ఉద్యానవనం మచ్చల జింకలతో సహా విభిన్న వన్యప్రాణులకు ప్రసిద్ధి చెందింది. సాంబార్, అడవి పంది, వివిధ రకాల పక్షులు ఉన్నాయి.

అనేక సరీసృపాల అభయారణ్యం మహావీర్

రంగారెడ్డి జిల్లాలో ఉన్న అతిపెద్ద ఉద్యానవనం మహావీర్ హరిణి వనస్థలి జాతీయ ఉద్యానవనం. ఇది 14.59 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. ఇక్కడ కృష్ణ జింకలు, చిరుతలు, అడవి పిల్లులు, చౌసింఘాలకు, అనేక పక్షి, సరీసృపాల జాతులకు అభయారణ్యంగా ఉంది. ఈ జాతీయ ఉద్యానవనాలు వన్యప్రాణి పరిరక్షణలో కీలక భూమికను పోషిస్తున్నాయి. పట్టణ ప్రకృతి దృశ్యాలకు సహజసిద్ధ సౌందర్యాన్ని అందిస్తున్నాయి.

తెలంగాణలోని వన్యప్రాణుల అభయారణ్యాలు, వాటి విస్తీర్ణం (చ.కి.మీ.)..

అభయారణ్యం పేరు - జిల్లా - చ.కిమీ

కవ్వాల్ టైగర్ రిజర్వ్ - మంచిర్యాల, నిర్మల్​ - 892.23

ప్రాణహిత - మంచిర్యాల - 136.02

శివారం మంచిర్యాల -పెద్దపల్లి - 29.81

ఏటూరునాగారం - ములుగు - 803.00

పాకాల మహబూబాబాద్ -వరంగల్​ - 860.20

కిన్నెరసాని - భద్రాద్రి కొత్తగూడెం - 635.40

మంజీర - సంగారెడ్డి - 20.00

పోచారం - మెదక్, కామారెడ్డి - 129.84

అమ్రాబాద్ టైగర్ - నాగర్ కర్నూల్, నల్లగొండ - 2,166.37

మొత్తం వైశాల్యం - 5,672.౮౭

తెలంగాణలోని నేషనల్ పార్కులు

పార్కు - జిల్లా చ.కి.మీ.

కాసు బ్రహ్మానందరెడ్డి పార్కు - హైదరాబాద్​ - 1.42

మృగవాణి - రంగారెడ్డి - 3.60

మహావీర్‌ ​హరిణి వనస్థలి - రంగారెడ్డి - 14.59

మొత్తం విస్తీర్ణం -19.61

Next Story