TG Excise: మందుబాబులకు బిగ్ షాక్.. భారీగా పెరగనున్న ఆ బీర్ల ధరలు!

by Kema Shiva Kumar |

రాష్ట్రంలో కేఎఫ్ బీర్ల ధరలు పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది.

TG Excise: మందుబాబులకు బిగ్ షాక్.. భారీగా పెరగనున్న ఆ బీర్ల ధరలు!
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో కేఎఫ్ బీర్ల ధరలు పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది. ఈ మేరకు యునైటెడ్ బ్రూవరీస్ ప్రభుత్వానికి ప్రతిపాదనలు చేయగా.. ప్రభుత్వం సైతం అందుకు సుముఖత వ్యక్తం చేసినట్టు ఎక్సైజ్ శాఖ వర్గాల సమాచారం. సమ్మర్‌లో రాష్ట్రవ్యాప్తంగా బీర్ల డిమాండ్ పెరిగే చాన్స్ ఉన్నది. ఉత్తర తెలంగాణతో పాటు గ్రేటర్ హైదరాబాద్‌లోనూ బీర్లకు డిమాండ్ అధికంగా ఉంటుంది. అందుకే ఈ వేసవిలో డిమాండ్‌కు తగ్గట్టు బీర్లు సరఫరా చేసి రాష్ర్ట ఖజానాను పెంచే దిశగా ఎక్సైజ్ శాఖ ఫోకస్ పెట్టింది.

రూ.20-25 పెరిగే M

యునైటెడ్ బ్రూవరీస్‌కి చెందిన కింగ్ ఫిషర్ బీర్లపై ఒక్కో బాటిల్‌పై ధర రూ.20-25 పెరిగే అవకాశం ఉందని ఎక్సైజ్ అధికారులు భావిస్తున్నారు. కానీ, రేట్ల పెంపు విషయంలో రిటైర్డ్ జస్టిస్ నేతృత్వంలోని కమిటీ నిర్ణయం ఫైనల్ కాలేదని అధికారిక వర్గాల సమాచారం. యునైటెడ్ బ్రూవరీస్ ఆశించిన స్థాయిలో ప్రభుత్వం నుంచి స్పందన కరువైందని, తెలంగాణ బివరెజేస్ కార్పొరేషన్ లిమిటెడ్‌ (టీజీబీసీఎల్) ధరలు 2019 నుంచి పెంచడం లేదని పేర్కొంటూ యూబీ సంస్థ తయారీ నిలిపివేస్తున్నట్టు తొలుత ప్రకటించింది. మరల దిగొచ్చి సరఫరా చేస్తామని ప్రకటించింది. ఈ క్రమంలోనే యూబీ బీర్లపై ధరలు పెంపునకు ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసినట్టు తెలుస్తున్నది. యూబీ సంస్థ 33 శాతం ధరలు పెంచాలని డిమాండ్ చేస్తుండగా.. ప్రభుత్వం మాత్రం 10-15 శాతం మాత్రమే పెంచేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది.

డిమాండ్‌కు తగ్గట్టు సరఫరా..

రాష్ట్రంలో ప్రస్తుతం నెలకు గరిష్ఠంగా 70 లక్షల కేసుల బీర్లు ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంది. కానీ, టెక్నికల్ సమస్యల కారణంగా గరిష్ఠంగా 90 శాతం మాత్రమే ఉత్పత్తి అవుతున్నట్టు తెలుస్తున్నది. రాష్ట్రంలో మొత్తం 6 బివరేజెస్లు ఉన్నాయి. వీటన్నింటి ద్వారా 70 లక్షల కేసులను మాత్రమే గరిష్ఠంగా తయారు చేయొచ్చు. వీటి ఉత్పత్తికి రెండు షిఫ్టుల్లో 16 గంటల పాటు పనిచేయాల్సి ఉంటుంది. వేసవిలో డిమాండ్ పెరుగనుండటంతో దానిని దృష్టిలో ఉంచుకుని మూడు షిఫ్టుల్లో బీర్ల ఉత్పత్తికి ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. అంతా అనుకున్నట్టు జరిగితే మూడో షిఫ్ట్ చేసేందుకు మిషనరీ సైతం సిద్ధంగా ఉన్నట్లు బీర్ల కంపెనీల యాజమాన్యాలు తెలుపుతున్నాయి. బీర్ల రేట్ల పెంపులోనూ ప్రభుత్వం సుముఖంగా ఉండటంతో మూడో షిఫ్టుతో ఆదాయం వస్తుందని కంపెనీలు లెక్కలు వేస్తున్నాయి.

168 రకాల బీర్లు

ప్రస్తుతం రాష్ట్రంలో 168 బీర్ల రకాలు అందుబాటులో ఉన్నట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. B-9 కంపెనీకి చెందిన 9 రకాలు, యూబీ కంపెనీకి చెందిన 67 రకాల బీర్లు, క్రౌన్‌లో 8 రకాలు, కాస్ట్లేలో 9 రకాలు అందుబాటులో ఉన్నాయన్నారు. అంతేకాకుండా, 6 లోకల్ కంపెనీల బీర్లు, 7 నాన్‌లోకల్‌కు చెందిన కంపెనీల బీర్లు ఎక్సైజ్ శాఖ పరిధిలో ఉన్నాయని పేర్కొన్నారు.లోకల్ కంపెనీలకు చెందిన బీర్లలో 32 రకాలు, నాన్ లోకల్ కంపెనీలకు చెందిన బీర్లలో 13 రకాలు అందుబాటులో ఉన్నట్లు అధికారులు తెలిపారు. రాష్ర్ట వ్యాప్తంగా సరఫరా అవుతున్న బీర్లలో 72శాతం బీర్లు యూబీ సంస్థకు చెందినవే ఉన్నాయి. నెలకు సరఫరా అయ్యే 70 లక్షల కేసుల్లో 35 లక్షలు కింగ్ ఫిషర్ బీర్లే ఉన్నాయి. ఇక ఆ తర్వాతి స్థానాల్లో ఉన్న నాకౌట్, బడ్వయిజర్, హేవార్డ్స్.. 23 లక్షల కేసులు సరఫరా అవుతున్నాయి. కాజ్ వన్ 7 లక్షలు, ఖజురహో 5 లక్షలు సరఫరా అవుతున్నాయి.

- 2023-24లో మొత్తం బీర్ల అమ్మకాలు 547.95 లక్షల కేసులు ఉండగా.. యునైటెడ్ బ్రూవరీస్ కంపెనీ సేల్స్ 382.73లక్షల కేసులుగా ఉన్నాయి.

- 2024-25లో మొత్తం బీర్ల సేల్స్ 413 లక్షల కేసులు ఉండగా.. యునైటెడ్ బ్రూవరీస్ కంపెనీ సేల్స్ 275.22 లక్షల కేసులుగా నమోదయ్యాయి.

ఎన్నికలు వస్తే ఎక్సైజ్ ఆదాయం పెరిగినట్లే..

రాష్ర్టంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు రేవంత్ సర్కార్ సన్నాహలు చేస్తుంది. ఈనెల 15న పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ వస్తుందని మంత్రులు బహిరంగంగా పేర్కొంటున్నారు. పంచాయతీ, పరిషత్, మున్సిపాలిటీ ఎన్నికలు వేసవిలో జరిగితే బీర్లు జోరుగా అమ్ముడుపోనున్నాయి. దీంతో ఈ సమ్మర్లో ఎక్సైజ్ శాఖకు భారీ ఆదాయం సమకూరినట్లే అని కంపెనీలు అంచనా వేస్తున్నాయి. గత డిసెంబర్ 31, జనవరి 1 (న్యూ ఇయర్) వేడుకలకు రాష్ట్ర ఎక్సయిజ్ శాఖకు రూ. 1000 కోట్ల ఆదాయం సమకూరినట్లుగా ఎక్సైజ్ శాఖ నివేదిక స్పష్టంచేసింది.

Next Story