రేపటి నుండి టీజీ ఈఏపీసెట్ ఇంజనీరింగ్ పరీక్షలు

by Ajay Maddhiboyina |

రాష్ట్రంలో ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీజీ ఈఏపీసెట్-2026 పరీక్షలు రేపటి నుండి(ఈ నెల 9వ తేదీ) ప్రారంభం కానున్నాయి. పరీక్ష ప్రారంభమైన తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా అభ్యర్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతించరని ఈఏపీసెట్ కన్వీనర్ డా.కె. విజయ్ కుమార్ రెడ్డి గురువారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు.

రేపటి నుండి టీజీ ఈఏపీసెట్ ఇంజనీరింగ్ పరీక్షలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీజీ ఈఏపీసెట్-2026 పరీక్షలు రేపటి నుండి(ఈ నెల 9వ తేదీ) ప్రారంభం కానున్నాయి. పరీక్ష ప్రారంభమైన తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా అభ్యర్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతించరని ఈఏపీసెట్ కన్వీనర్ డా.కె. విజయ్ కుమార్ రెడ్డి గురువారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. పరీక్షకు గంటన్నర ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. ఉదయం సెషన్ కు హాజరయ్యేవారు 7.30 కి, మధ్యాహ్నం సెషన్ వారిని 1.30 కి పరీక్షా హాల్ లోకి అనుమతి ఉంటుందన్నారు. పరీక్ష ముగిసే వరకు బయటకు వెళ్లడానికి అనుమతి ఉండదని పేర్కొన్నారు. ఈ పరీక్షలకు మొత్తం 2,10,766 మంది విద్యార్థులు ఇంజనీరింగ్ స్ట్రీమ్ విభాగంలో దరఖాస్తు చేసుకున్నారు. పరీక్షలు మే 9, 10, 11 తేదీలలో రెండు సెషన్లలో ఉదయం, మధ్యాహ్నం జరుగనున్నాయి. మార్నింగ్ సెషన్ ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం సెషన్ 3 నుండి 6 గంటల వరకు నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 125 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు హాల్ టికెట్, బ్లూ లేదా బ్లాక్ బాల్ పాయింట్ పెన్, ఏదైనా ఒక ఒరిజినల్ గుర్తింపు కార్డును వెంట తెచ్చుకోవాలి. క్యాలిక్యులేటర్లు, లాగ్ టేబుల్స్, సెల్ ఫోన్లు, పేజర్లు, చేతి గడియారాలు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను లోపలికి తీసుకెళ్లేందుకు అనుమతి లేదని జేఎన్టీయూ అధికారులు స్పష్టం చేశారు.

పరీక్ష పూర్తయిన వెంటనే మార్కులు:

పరీక్ష ముగిసిన వెంటనే అభ్యర్థులు సాధించిన మార్కులు కంప్యూటర్ స్క్రీన్‌పై ప్రాథమిక కీ ఆధారంగా మార్కులు డిస్ప్లే అవుతాయి. అయితే, తుది ర్యాంకులను మాత్రం నార్మలైజేషన్ ప్రక్రియ ద్వారా నిర్ణయించిన మార్కుల ఆధారంగా కేటాయిస్తారు. అభ్యర్థులు ముందుగానే తమ పరీక్షా కేంద్రాలను సందర్శించి, హాల్ టికెట్‌లోని సూచనలను క్షుణ్ణంగా చదవాలని కన్వీనర్ విజ్ఞప్తి చేశారు. మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ www.eapcet.tgche.ac.in ను సందర్శించాలని సూచించారు.

Next Story