TG EAPCET: ప్రశాంతంగా టీజీ ఎప్‌సెట్-2026.. తొలి రోజే 93% హాజరు

by Ramesh Naini |

రాష్ట్రంలో అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన టీజీ ఎప్‌సెట్ మొదటి రోజు పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి.

TG EAPCET: ప్రశాంతంగా టీజీ ఎప్‌సెట్-2026.. తొలి రోజే 93% హాజరు
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన టీజీ ఎప్‌సెట్ మొదటి రోజు పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. రెండు సెషన్లలో జరిగిన ఈ పరీక్షలకు మొత్తం 93.35 శాతం హాజరు నమోదైనట్లు టీజీ ఎప్‌సెట్ కన్వీనర్ ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ ఉన్నత విద్యా మండలి తరపున జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ హైదరాబాద్ (జేఎన్టీయూహెచ్) ఈ పరీక్షలను నిర్వహిస్తోంది. 2026-27 విద్యా సంవత్సరానికి గాను అగ్రికల్చర్, ఫార్మసీ స్ట్రీమ్ అభ్యర్థులకు మొదటి రోజు పరీక్షలు జరిగాయి. మే 4వ తేదీన రెండు సెషన్లలో జరిగిన ఈ పరీక్షలకు అభ్యర్థులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. మొదటి సెషన్ ఉదయం 9 నుంచి 12 గంటల వరకు జరిగిన ఈ సెషన్‌కు మొత్తం 30,333 మంది అభ్యర్థులు నమోదు చేసుకోగా, 28,046 మంది (92.46 శాతం) పరీక్షకు హాజరయ్యారు. 2,287 మంది గైర్హాజరయ్యారు. రెండో సెషన్ మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరిగింది. ఈ సెషన్‌కు 30,253 మంది అభ్యర్థులు నమోదు చేసుకోగా, 28,241 మంది (93.35%) హాజరయ్యారు. 2,012 మంది పరీక్షకు హాజరుకాలేదు.

సోమవారం పరీక్షల సరళిని ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ వి. బాలకిష్టా రెడ్డి, జేఎన్టీయూహెచ్ వైస్ ఛాన్సలర్, ఈఏపీసెట్ చైర్మన్ ప్రొఫెసర్ టి. కిషన్ కుమార్ రెడ్డి, కన్వీనర్ ప్రొఫెసర్ కె. విజయ్ కుమార్ రెడ్డి తదితరులు పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యా మండలి సెక్రటరీ ప్రొఫెసర్ శ్రీరామ్ వెంకటేష్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కె. వెంకటేశ్వరరావు కూడా పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించగా, మహబూబ్‌నగర్ జోన్‌లో అత్యధికంగా 96.4 శాతం హాజరు నమోదైంది. ఆదిలాబాద్ (98 శాతం), నిజామాబాద్ (95.5 శాతం), సిద్ధిపేట (96 శాతం) మంది విద్యార్థులు హాజరయ్యారు.

Next Story