- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TG CMO: ‘సివిల్ సప్లయ్’పై సీఎంవో గరం గరం! కొత్త రేషన్ కార్డుల లిస్ట్ విడుదలపై అసహనం
సివిల్ సప్లయ్ కమిషనరేట్‌పై సీఎంఓ ఆగ్రహంగా ఉన్నట్టు సెక్రటేరియట్ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతున్నది.

దిశ, తెలంగాణ బ్యూరో: సివిల్ సప్లయ్ కమిషనరేట్‌పై సీఎంఓ ఆగ్రహంగా ఉన్నట్టు సెక్రెటేరియట్ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతున్నది. కమిషనరేట్ ఆఫీసర్ల అనాలోచిత నిర్ణయంతో ప్రజల్లో గందరగోళం ఏర్పడటం, విపక్షాలకు అస్త్రంగా మారిందని తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్టు తెలుస్తున్నది. రెండు రోజుల కిందట గ్రామాల్లో కొత్త రేషన్ కార్డుల లబ్ధిదారుల జాబితా బహిర్గతమైంది. ఆ జాబితాలో పేర్లు లేకపోవడంతో దరఖాస్తుదారులు ఆందోళనకు దిగారు. ఇదే విషయంపై బీఆర్ఎస్ అధికార పార్టీని ఇరకాటంలో పెట్టింది. దీంతో ఫారిన్ టూర్లో ఉన్న సీఎం రేవంత్ ఈ విషయంపై అక్కడి నుంచే స్పందించారు. వెంటనే ఈ వివాదానికి ఫుల్‌స్టాప్ పెట్టాలని సంబంధిత ఆఫీసర్లను ఆదేశించినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.
ఓ కీలక ఆఫీసర్ వల్లే వివాదం!
ఈ నెల 26(రిపబ్లిక్ డే) నుంచి రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం చేపట్టాలని ప్రభుత్వం భావించింది. ఆ ప్లాన్ కాస్త సివిల్ సప్లై కమిషనరేట్‌లోని ఓ కీలక అధికారి తీరువల్ల బూడిద పాలైందని సీఎంఓ వర్గాల్లో టాక్. సదరు ఆఫీసరు అనాలోచిత నిర్ణయం వల్లే రేషన్ కార్డుల జారీ ప్రక్రియలో గందరగోళం నెలకొన్నది. సమగ్ర కుటంబ సర్వే ప్రాతిపదికన కొత్త రేషన్ కార్డులను జారీ చేస్తున్నట్టు ఆ కీలక అధికారి నిర్ణయించుకుని, ఈ మేరకు జాబితాను సిద్ధం చేసినట్లు తెలుస్తున్నది. వాస్తవానికి రేషన్ కార్డుల జారీ కోసం ప్రభుత్వం ప్రజాపాలనలో ప్రత్యేకంగా దరఖాస్తులు స్వీకరించింది. ఆ టైంలో దాదాపు 11.50 లక్షల అప్లికేషన్లు వచ్చాయి. కానీ, ఆ దరఖాస్తులను పక్కన పెట్టి, కేవలం కులగణన ఆధారంగా కొత్త రేషన్ కార్డుల జారీకి నిర్ణయం తీసుకోవడం ఏమిటీ? ఇది ఆ కీలక ఆధికారి సొంత నిర్ణయమా? లేక ప్రభుత్వం నిర్ణయమా? అనే చర్చ సెక్రెటేరియట్ వర్గాల్లో జరుగుతున్నది.
గ్రామాలకు జాబితా ఎలా చేరింది?
ఈనెల 21 నుంచి 24 వరకు నిర్వహించే గ్రామసభల్లో రేషన్ కార్డుల లబ్దిదారులను ప్రకటించి, అభ్యంతరాలను తీసుకోవాలని ప్రభుత్వం భావించింది. కానీ, అప్పటికే గ్రామాల్లోకి కొత్త రేషన్ కార్డు లబ్దిదారుల లిస్టు చేరింది. ఆ లిస్టులో పేర్లు లేని వారు ఆందోళనకు దిగారు. ప్రతి గ్రామంలోనూ ఇదే పరిస్థితి నెలకొన్నది. దరఖాస్తులతో సంబంధం లేకుండా ఇష్టానుసారంగా లబ్దిదారులను ఎంపిక చేశారనే ప్రచారం మొదలైంది. అదే టైంలో బీఆర్ఎస్ లీడర్లు ఆ వివాదానికి మరింత ఆజ్యం పోసేందుకు శ్రీకారం చుట్టారు. ‘కులగణన ప్రకారం రేషన్ కార్డులు ఇవ్వడం ఏంటి? అలాంటప్పుడు ప్రజా పాలనలో దరఖాస్తులు ఎందుకు తీసుకున్నట్టు’ అని ప్రశ్నించారు. కాగా, ఇంతకీ గ్రామాల్లోకి లబ్దిదారుల లిస్టు ఎలా చేరిందో ఎవరికీ అంతు చిక్కని ప్రశ్నగా మిగిలిందనే చర్చ ప్రభుత్వ వర్గాల్లో జరుగుతున్నది.
సీఎం చొరవతో వివాదానికి చెక్
రేషన్ కార్డుల వివాదాన్ని పరిష్కరించాల్సిన సివిల్ సప్లై కమిషనరేట్ శనివారం (జనవరి 18)న జారీ చేసిన నోట్ మరింత వివాదాన్ని సృష్టించేలా ఉందనే విమర్శలు వచ్చాయి. ‘కులగణన ఆధారంగా అర్హులకు కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తాం. ప్రజావాణిలో వచ్చిన అప్లికేషన్లను పరిశీలిస్తాం. కొత్త దరఖాస్తులను తీసుకుంటాం’ అని నోట్‌లో ప్రకటించింది. కులగణన ఆధారంగానే రేషన్ కార్డులు ఇస్తామనే విషయాన్ని మరోసారి నొక్కి చెప్పే ప్రయత్నం ఈ నోట్ ద్వారా చేశారని విమర్శలొచ్చాయి. ఈ విషయం కాస్త ఫారిన్ టూర్లో ఉన్న సీఎం రేవంత్ వద్దకు చేరడంతో ఆయన వెంటనే స్పందించారు. గ్రామాల్లో నెలకొన్న గందరగోళ పరిస్థితులపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్పరెన్స్ నిర్వహించారు. రేషన్ కార్డులపై కొనసాగుతోన్న వివాదానికి వెంటనే ఫుల్‌స్టాప్ పెట్టాలని సూచించినట్లు సమాచారం. సీఎం ఆదేశాల మేరకు అందుబాటులో ఉన్న మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు హడావుడిగా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియపై ప్రజలకు క్లారిటీ ఇచ్చారు.






