- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TG BJP: ఎట్టకేలకు వీడిన సస్పెన్స్.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రామచందర్ రావు
బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ రామచందర్‌రావు పేరు ఖరారైంది.

దిశ, వెబ్‌డెస్క్: బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ నారపరాజు రామచందర్ రావు (Naraparaju Ramchander Rao) పేరు ఖరారైంది. ఈ మేరకు ఆయనను నామినేషన్ వేయించాలంటూ పార్టీ అధిష్టానం నుంచి రాష్ట్ర అధినాయకత్వానికి ఆదేశాలు అందాయి. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు రామచందర్ రావు నామినేషన్ దాఖలు చేయనున్నారు. అయితే, ఇవాళ ఉదయం తెలంగాణ (Telangana) బీజేపీ కీలక నేతలకు అధిష్టానం నుంచి సమాచారం వచ్చినట్లుగా తెలుస్తోంది. ఉదయం 11 గంటలకు అధ్యక్ష అభ్యర్థికి అధికారికంగా సమాచారం ఇస్తామని హైకమాండ్ చెప్పినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే పలువురు నేతలు అందుబాటులో ఉండాలని ఫోన్లు కూడా వెళ్లాయి. రాష్ట్ర అధ్యక్ష పదవిపై బీజేపీ అధినాయకత్వం తీవ్ర స్థాయిలో సమాలోచలు చేసింది. బరిలో మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్, నిజామబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్, రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్, మాజీ ఎమ్మెల్సీ రామచందర్‌రావు పేర్లు బలంగా వినిపించాయి. అయితే, అనూహ్యంగా అధ్యక్ష పదవికి రామచందర్ రావు పేరును ఫిక్స్ చేశారు. రాష్ట్రంలో RSSతో పాటు పార్టీలోని సీనియర్ నేతలంతా అధ్యక్ష పదవికి రామచందర్ రావు పేరును సిఫారసు చేసినట్లుగా తెలుస్తోంది.
రామచందర్ రావు పొలిటికల్ కెరీర్ ఇలా..
కాగా, నారపరాజు రామచందర్ రావు 1959 ఏప్రిల్ 27న హైదరాబాద్‌లో జన్మించారు. పాఠశాల విద్యతో పాటు ఇంటర్మీడియట్ పూర్తి అయ్యాక సికింద్రాబాద్ రైల్వే డిగ్రీ కాలేజీలో చేరి స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యారు. 1982-85 ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ కార్యదర్శిగా ఉన్నారు. అదేవిధంగా భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర తొలి కార్యదర్శిగా ఎన్నికయ్యారు. అనంతరం భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ లీగల్ సెల్ జాయింట్ కన్వీనర్‌గా నియమితులయ్యారు.
రామచందర్ రావు 2009లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఎన్నికల్లో మహబూబ్‌నగర్ - రంగారెడ్డి - హైదరాబాద్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మల్కాజ్‌గిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీఆర్ఎస్ అభ్యర్థి చింతల కనకారెడ్డి చేతిలో 2,768 ఓట్ల తేడాతో ఓటమి చెందాడు. అదేవిధంగా 2015లో జరిగిన తెలంగాణ శాసనమండలి ఎన్నికల్లో మహబూబ్‌నగర్ - రంగారెడ్డి - హైదరాబాద్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం నుంచి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీఆర్ఎస్ అభ్యర్థి జి.దేవీప్రసాద్ రావుపై గెలిచి తొలిసారి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు.
అనంతరం 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మల్కాజ్‌గిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీఆర్ఎస్ అభ్యర్థి మైనంపల్లి హన్మంతరావు చేతిలో 73,698 ఓట్ల తేడాతో ఓటమి చెందాడు. 2021లో జరిగిన తెలంగాణ శాసనమండలి ఎన్నికల్లో మహబూబ్‌నగర్ - రంగారెడ్డి - హైదరాబాద్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం నుంచి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణిదేవి చేతిలో ఓడారు. పార్టీ హైకమాండ్ ఆదేశాల మేరకు 2024 జనవరి 8న లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో రామచందర్ రావును మహబూబ్‌నగర్ లోక్‌సభ నియోజకవర్గ ఇన్‌చార్జి బీజేపీ పార్టీ నియమించింది.






