TG: 30 ఏళ్ల సర్వీస్.. ‘జీరో’ ప్రమోషన్స్! ఆవేదనలో తెలంగాణ ల్యాబ్ టెక్నీషియన్లు

by Kema Shiva Kumar |

రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖలో ల్యాబ్ టెక్నీషియన్ల తీవ్ర ఆవేదనకు లోనవుతున్నారు.

TG: 30 ఏళ్ల సర్వీస్.. ‘జీరో’ ప్రమోషన్స్! ఆవేదనలో తెలంగాణ ల్యాబ్ టెక్నీషియన్లు
X

దిశ, తెలంగాణ బ్యూరో: వైద్య ఆరోగ్య శాఖలోని ప్రజా ఆరోగ్య సంచాలకుల (డైరెక్టరేట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్) విభాగంలో ల్యాబ్ టెక్నీషియన్ల (ఎల్‌టీ) ప్రమోషన్ల ప్రక్రియ తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతోంది. దశాబ్దాలుగా ప్రజా ఆరోగ్య సేవల్లో కీలకపాత్ర పోషిస్తున్న గ్రేడ్-2 ల్యాబ్ టెక్నీషియన్లకు ఏళ్ల తరబడి ఒక్క ప్రమోషన్ కూడా దక్కకపోవడంతో తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. 1990-95 మధ్య కాలంలో ఉద్యోగాల్లో చేరిన సుమారు 300 మంది ఎల్‌టీలలో ఏకంగా 30 ఏళ్ల సర్వీసు పూర్తయినా కనీసం ఒక్క పదోన్నతికి కూడా నోచుకోకుండానే వందలాది మంది ఉద్యోగ విరమణ పొందుతున్నారు.

అన్ని అర్హతలున్నా..

రాష్ట్రవ్యాప్తంగా వైద్య కళాశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, తెలంగాణ డయాగ్నోస్టిక్స్ హబ్ కేంద్రాల్లో ఎల్‌టీ గ్రేడ్-2 ఉద్యోగులు కీలకమైన రక్త, మూత్ర, ఇతర రోగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. గతంలో జిల్లాస్థాయి పోస్టులుగా ఉన్న ఈ పోస్టులను ఏడు జోనల్ పోస్టులుగా మార్చారు. ప్రస్తుతం ఏడు జోన్ల పరిధిలో గ్రేడ్-1 ఎల్‌టీ పోస్టులు 114 వరకు ఖాళీగా ఉన్నాయి. అలాగే డిగ్రీలో కెమిస్ట్రీ చదివిన ఎల్‌టీలకు జూనియర్ అనలిస్ట్ (జేఏ)లుగా ప్రమోషన్ ఇచ్చే అవకాశం ఉంది. అలా అర్హత కలిగినవారు దాదాపు 200 మందికి పైగా ఉండగా, టీచింగ్ హాస్పిటల్స్‌లో దాదాపు 21 జేఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పోస్టులు అందుబాటులో ఉన్నా, అర్హులైన అభ్యర్థులు సిద్ధంగా ఉన్నా ఉన్నతాధికారుల చొరవ లేకపోవడంతో ప్రమోషన్ల ప్రక్రియ మూలనపడింది.

ప్రోవిజనల్ లిస్ట్‌కే పరిమితం..

చివరి రిక్రూట్‌మెంట్, ప్రమోషన్లు 2020లో జరుగగా, ఆ తర్వాత నాలుగేళ్లు దాటినా మళ్లీ ప్రమోషన్ల ఊసే లేకుండాపోయింది. గతంలో 2022లో ఒకసారి ప్రొవిజనల్ జాబితా విడుదల చేసినా అది ఫైనల్ కాకుండానే నిలిచిపోయింది. తాజాగా 2025లో మరోసారి సీనియారిటీ ప్రొవిజనల్ జాబితా విడుదల చేశారు. ఏడాది తర్వాత 4 జోన్లకు సంబంధించి ఫైనల్ వచ్చినా ప్రమోషన్లు పూర్తి చేయలేదు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 300 మందితో సీనియారిటీ జాబితా ఉన్నప్పటికీ, కేవలం 114 నుంచి 120 మందికి ప్రమోషన్ ఇచ్చే అవకాశం ఉన్నా ఆ దిశగా అడుగులు పడటం లేదు. మరోవైపు 1995లో నిబంధనలకు విరుద్ధంగా ల్యాబ్ అటెండెంట్లుగా (ఎల్‌టీ) నియామకమై, ఆ తర్వాత ఐదేళ్లకు శిక్షణ పూర్తి చేసుకున్న వారి సీనియారిటీ (2001 నాటి నుంచి) కౌంట్ చేయాలా? లేక 1995 నుంచే లెక్కించాలా? అనే వివాదంపై కోర్టు వ్యాజ్యాలు నడుస్తున్నాయి. అయితే సీనియారిటీ వివాదాలపై న్యాయస్థానాలు క్లారిటీ ఇచ్చినప్పటికీ, ప్రమోషన్ల ప్రక్రియపై ఎక్కడా స్టే లేకపోయినా డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ (డీహెచ్) కార్యాలయం చొరవ చూపకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఒక్క ప్రమోషన్ లేకుండానే రిటైర్మెంట్..

ప్రమోషన్ల జాప్యం వల్ల 2020 నుంచి ఇప్పటివరకు ఏకంగా 50 మందికి పైగా సీనియర్ ల్యాబ్ టెక్నీషియన్లు ఒక్క పదోన్నతి కూడా తీసుకోకుండానే రిటైర్ అయిపోయారు. ఇటీవలే వికారాబాద్ జిల్లాకు చెందిన రవీందర్ అనే ఉద్యోగి 33 ఏళ్ల సుదీర్ఘ సర్వీస్ పూర్తి చేసుకుని, కనీసం చివరి రోజైనా ప్రమోషన్ దక్కుతుందేమోనని ఆశపడి తీవ్ర ఆవేదనతో పదవీ విరమణ పొందారు. ప్రతి నెలా ఒకరిద్దరు ఎల్‌టీలు ఇదే రీతిలో నిరాశతో పదవీ విరమణ పొందుతున్నారు. ఇతర విభాగాల్లో హెల్త్ అసిస్టెంట్లు, సీహెచ్‌ఓలు ప్రమోషన్లు పొందుతుంటే, ఎల్‌టీలు మాత్రం నిర్ నిర్లక్ష్యానికి గురవుతున్నారు. సమస్యను గుర్తించి వారికి పదోన్నతులు వచ్చేలా చూడటంలో అధికారులు పట్టించుకోవడం లేదు.

Next Story