తూకంలోనూ రైతులకు మోసం.. అధికారుల మొక్కుబడి తనిఖీలే కారణమా?

by Jakkula.Mamatha |

మండల కేంద్రమైన కొల్చారం లోని సత్య సాయి ఆగ్రో ఇండస్ట్రీస్‌లో పౌరసరఫరాల శాఖ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల తనిఖీలో సుమారు 75,749 బస్తాల ధాన్యం మాయం కావడం పై సర్వత్రా చర్చ జరుగుతుంది.

తూకంలోనూ రైతులకు మోసం.. అధికారుల మొక్కుబడి తనిఖీలే  కారణమా?
X

దిశ, కొల్చారం: మండల కేంద్రమైన కొల్చారం లోని సత్య సాయి ఆగ్రో ఇండస్ట్రీస్‌లో పౌరసరఫరాల శాఖ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల తనిఖీలో సుమారు 75,749 బస్తాల ధాన్యం మాయం కావడం పై సర్వత్రా చర్చ జరుగుతుంది. ఏ రైతును కదిలించినా సత్యసాయి రైస్ మిల్ యాజమాన్యం నిరంకుశ వైఖరి బహిర్గతమవుతుంది. మిల్లుకు ధాన్యం వెళ్తే ఒక్కో లారీల్లో 6 నుంచి 10 క్వింటాళ్ల ధాన్యం తరుగు వచ్చేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత సీజన్లో సంగాయిపేట వరిగుంతం గ్రామాలకు చెందిన రైతులు రంగంపేటలో తూకం వేసుకొని ధాన్యం లోడును సత్య సాయి ఆగ్రో ఇండస్ట్రీస్ రైస్ మిల్లుకు తీసుకెళ్లగా తూకంలో భారీ తేడా రావడంతో రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేయడంతో పాటు జిల్లా స్థాయి అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని రైతులు చెబుతున్నారు.

అధికారుల అండదండలతోనే..

పౌరసరఫరాల శాఖ జిల్లా స్థాయి అధికారుల, సుమారు గత 20 సంవత్సరాలుగా జిల్లాలో తహసీల్దార్ స్థాయి నుంచి జిల్లా స్థాయి అధికారిగా ఎదిగి పౌరసరఫరాల శాఖను పర్యవేక్షించే ఆ జిల్లా స్థాయి అధికారి అండదండలతోనే రైస్ మిల్లు యాజమాన్యం పెద్ద ఎత్తున కుంభకోణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. మిల్లు యాజమాన్యం వైఖరి పై పలుమార్లు రైతులు మెదక్- హైదరాబాద్ జాతీయ రహదారిపై ఆందోళన చేయడం ప్రతి ఏటా ప్రతి సీజన్లో పరిపాటిగా మారింది. అయినప్పటికీ జిల్లా స్థాయి అధికారులు సకాలంలో స్పందించకపోవడంతో మిల్లు యాజమాన్యం ఆగడాలకు అంతు లేకుండా పోయింది. రెవెన్యూ, పౌరసరఫరాలు, తూనికలు కొలతల శాఖల అధికారుల అండదండలు ఉండడంతో తమను ఎవరు ఏమీ చేయలేరన్న ధీమాతో మిల్లు యాజమాన్యం ఏకంగా సుమారు రూ.7.17 కోట్ల విలువ గల 75,749 బస్తాల ధాన్యం (3029.960 మెట్రిక్ టన్నులు) అక్రమంగా ఇతర ప్రాంతాలకు తరలించి విక్రయించినట్లు తెలుస్తుంది.

ఒకే సీజన్ కు సంబంధించి..

ఈ సీజన్ కు సంబంధించి మాత్రమే 75 వేల బస్తాలు మాయం కాగా 2022 -23 యాసంగి సీజన్ నుంచి సీఎంఆర్ బకాయిలు ఉన్నట్లు తెలుస్తుంది. అప్పటి నుంచి గత యాసంగి సీజన్ వరకు పూర్తి స్థాయిలో విచారణ జరిపితే మరింత కుంభకోణం వెలుగు చూసే అవకాశం ఉంది. అధికారులు లోతుగా విచారణ జరిపితే మరిన్ని అక్రమాలు బయటపడతాయి.

Next Story