- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, సిద్దిపేట ప్రతినిధి: గజ్వేల్ కాషాయ దళంలో వర్గ విభేదాలు రచ్చకెక్కాయి. పార్టీ పదవుల్లో సరైన గుర్తింపు లేదని.. ఓ వర్గం ఆరోపణలు .. పార్టీ లైన్ దాటుతున్నారని మరో వర్గం ప్రత్యారోపణలు అధిష్టానానికి ఫిర్యాదులు.. షోకాజ్ నోటీసులు.. చివరికి పార్టీ అంతర్గత వ్యవహారాలను బహిర్గతం చేస్తారని నేతల ఆక్షేపణలతో కాషాయ దళంలో వర్గ విభేదాలు బట్టబయలు కావడంతో రాజకీయం వేడెక్కింది. వివరాల్లోకి వెళ్లితే.. సిద్దిపేట జిల్లాలో కమలం పార్టీ బలోపేతం చేయడమే లక్ష్యంగా బీజేపీ నాయకులు ఇటీవల పార్టీ జిల్లా, మండల, పార్టీ అనుబంధ మోర్చా లకు కమిటీలను బీజేపీ జిల్లా అధ్యక్షుడు భైరి శంకర్ ముదిరాజ్ ప్రకటించారు.
పార్టీ పదవుల్లో కష్టపడి పని చేసిన కార్యకర్తలకు సరైన గుర్తింపు ఇవ్వడం లేదని ఆరోపిస్తూ గజ్వేల్ నియోజక వర్గానికి చెందిన కుడిక్యాల రాములు, బండారి మహేష్, దారం గురువా రెడ్డి లు గజ్వేల్ నియోజకవర్గ స్థాయిలో 68 మందితో ప్రత్యేక నియోజక వర్గ కమిటీని ఏర్పాటు చేసి కమిటీ వివరాలను రాష్ట్ర కమిటీకి పంపినట్లు మీడియాకు ప్రెస్ నోట్ విడుదల చేశారు. అనధికారిక కమిటీ ఏర్పాటు ను మరో వర్గం నాయకులు రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతమ్‌రావుకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ కన్వీనర్ రవీందర్ విశ్వనాథ్ అనధికారిక చట్టవిరుద్ధమైన కార్యకలాపాలను తక్షణమే నిలిపివేయాలని కుడిక్యాల రాములు, బండారి మహేష్, దారం గురువా రెడ్డి ని హెచ్చరించి షోకాజు నోటీసులు జారీ చేశారు. ఈ విషయమై బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్ ముదిరాజ్ స్పందిస్తూ జిల్లా కమిటీ అనుమతి లేకుండా ఎలాంటి కమిటీలను ప్రకటించరాదని, నియోజకవర్గ కమిటీ పేరుతో ఏర్పాటైన కమిటీలకు పార్టీతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.
ఈ విషయంపై స్పందించిన కుడిక్యాల రాములు, బండారి మహేష్, దారం గురువా రెడ్డిలు బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచి వచ్చిన వివరణ కోరిన లేఖ పూర్తిగా పార్టీ అంతర్గత వ్యవహారం అన్నారు. రాష్ట్ర కమిటీ లేఖను వక్రీకరించి తప్పుడు ప్రచారం చేయడం సరికాదని సదరు నాయకులు ఆక్షేపించారు. పార్టీ పేరుతో పదవులు అనుభవిస్తూ, పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా పనిచేసిన వారి వ్యవహారాలపై పూర్తి వివరాలతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తామని బీజేపీ జిల్లా అధ్యక్షుడి పై బహిరంగ ఆరోపణలు గుప్పించడంతో కమల దళంలోని వర్గ విభేదాలు బట్టబయలు అయ్యాయి. గజ్వేల్ కషాయ దళంలో పార్టీ పదవుల విషయంలో నేతల మధ్య విభేదాలకు అధిష్ఠానం ఏ విధమైన ముగింపు పలుకుతుందో చూడాలి మరీ.






