- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఉచిత విద్య ఆశలపై నీళ్లు.. కేజీబీవీల్లో పాఠ్యపుస్తకాల కొరత
విద్యా సంవత్సరం ప్రారంభమై రెండు నెలలవుతున్నా.. కస్తూర్బాలో చదివే విద్యార్థినులకు ఇంకా పూర్తిస్థాయిలో పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్స్ అందలేదు.

దిశ, తెలంగాణ బ్యూరో: విద్యాసంవత్సరం ప్రారంభమై రెండు నెలలవుతున్నా.. కస్తూర్బాలో చదివే విద్యార్థినులకు ఇంకా పూర్తిస్థాయిలో పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్స్ అందలేదు. దీంతో స్టూడెంట్స్ ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రంలో 495 కేజీబీవీలు ఉన్నాయి. కస్తూర్బాల్లో ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు పాఠశాల విద్యా బోధన, మరికొన్ని కస్తూర్బాల్లో ఇంటర్ వరకు విద్యార్థులకు చదువు చెప్తున్నారు. అయితే సకాలంలో పాఠ్యపుస్తకాలు అందకపోవడంతో విద్యార్థినులు ఇబ్బందులు పడుతున్నారు. పుస్తకాలు లేకుండా క్లాసులు వినడం వల్ల ఉపాధ్యాయులు చెప్పే పాఠాలపై దృష్టి పెట్టలేకపోతున్నామని, పూర్తిస్థాయిలో అర్థం చేసుకోలేకపోతున్నామని చెబుతున్నారు. అయితే పుస్తకాల కొరతను అధిగమించేందుకు అధికారులు, టీచర్లు పాత పుస్తకాలు ఇస్తున్నా.. అనుకున్న స్థాయిలో ఫలితం ఉండడం లేదు.
నాలుగు వేల మందికి..
పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్స్ కోసం కస్తూర్బాల్లో సుమారు నాలుగు వేల మంది విద్యార్థినులు ఎదురుచూస్తున్నట్లు అధికారివర్గాల సమాచారం. గతంలో కేజీబీవీల్లోని సీట్ల భర్తీకి విద్యాశాఖాధికారులు, టీచర్లు ఇంటింటికి వెళ్లాల్సి వచ్చేది. డ్రాపౌట్స్ తోపాటు బడుగు, బలహీన వర్గాలకు చెందిన బాలికలకు ప్రవేశాలు కల్పించేవారు. కొన్ని సార్లు సీట్లు భర్తీ కాకుంటే.. చుట్టుపక్కల జిల్లాల విద్యార్థినులను సైతం చేర్చుకునేవారు. అయితే ఈ ఏడాది పరిస్థితి మారింది. ఆరు నుంచి పదో తరగతి వరకు ఉచిత వసతితో కూడిన విద్యా భోధన అమలు చేస్తుండడంతో కేజీబీవీల్లో తమ పిల్లలను చేర్పించేందుకు తల్లిదండ్రులు పోటీ పడుతున్నారు. అడ్మిషన్లు పెరగడంతోనే కొంత సమస్య వచ్చిందని అధికారులు చెబుతున్నారు. ప్రతీ ఏటా జులై, ఆగస్టు వరకు పుస్తకాలు పూర్తిస్థాయిలో అందుతాయని, బోధనలో ఎలాంటి ఆటంకాలు ఎదురు కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని పేర్కొంటున్నారు.
సమస్యను పరిష్కరించాలి..
కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు, ఇతర ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు సకాలంలో అందకపోవడం ఒక సాధారణ సమస్యగా మారిందని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపిస్తున్నాయి. సకాలంలో నిధుల విడుదల చేయకపోవడం, టెండర్ల ప్రక్రియలో జాప్యం, లాజిస్టిక్స్ సమస్యలు వంటివి దీనికి కారణంగా చెబుతున్నారు. పాఠ్యపుస్తకాల ముద్రణ, సరఫరా కోసం ప్రభుత్వ ప్రక్రియలు, నిధుల విడుదలలో జాప్యం చేస్తున్నారని పేర్కొంటున్నారు. ముద్రణ సంస్థలకు సకాలంలో బిల్లులు చెల్లించకపోవడం కూడా దీనికి ఒక కారణంగా చెబుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని, కేజీబీవీల్లో విద్యార్థినులకు పూర్తిస్థాయిలో పుస్తకాలు, యూనిఫామ్స్ అందేలా చర్యలు తీసుకోవాలని విద్యార్థిసంఘాలు కోరుతున్నాయి.






