టెహ్రాన్‌లో కొనసాగుతోన్న ఉద్రిక్తత.. ‘గాంధీ ఆస్పత్రి’పై వైమానిక దాడి

by Kema Shiva Kumar |   (  Updated:2026-03-02 03:42:51  IST  )

టెహ్రాన్‌లోని గాంధీ ఆసుపత్రిపై అమెరికా-ఇజ్రాయెల్ వైమానిక దాడులు జరపడంతో భవనం శిథిలమై అక్కడ భీతావహ వాతావరణ నెలకొంది.

టెహ్రాన్‌లో కొనసాగుతోన్న ఉద్రిక్తత.. ‘గాంధీ ఆస్పత్రి’పై వైమానిక దాడి
X

దిశ, వెబ్‌డెస్క్: ఇరాన్ (Iran) రాజధాని టెహ్రాన్ (Tehran) యుద్ధ జ్వాలలతో అట్టుడుకుతోంది. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణం తర్వాత అమెరికా-ఇజ్రాయెల్ కూటమి చేపట్టిన ‘ఆపరేషన్ రోరింగ్ లయన్’లో భాగంగా సోమవారం తెల్లవారుజామున టెహ్రాన్‌లోని ప్రసిద్ధ గాంధీ ఆసుపత్రి (Gandhi Hospital)పై క్షిపణులు విరుచుకుపడ్డాయి. ఈ దాడితో ఆసుపత్రి ప్రాంగణం ఒక్కసారిగా యుద్ధభూమిని తలపించింది. ఉత్తర టెహ్రాన్‌లోని ఈ భారీ వైద్య సముదాయంపై జరిగిన దాడిలో భవనం గణనీయంగా దెబ్బతింది. బాంబుల తాకిడికి కిటికీలు పగిలిపోయి, వార్డుల నిండా శిథిలాలు పేరుకుపోయాయి. ఆసుపత్రి‌పై అంతస్తుల నుంచి దట్టమైన పొగలు వెలువడటంతో రోగులు ఊపిరాడక ఉక్కిరిబిక్కిరి అయ్యారు.

ప్రాణాలకు తెగించి నర్సుల పోరాటం

ఈ దాడుల్లో హృదయాన్ని కదిలించే దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. ఇరాన్ వార్తా సంస్థలు విడుదల చేసిన వీడియోల ప్రకారం.. బాంబు దాడులు జరుగుతున్నా లెక్కచేయకుండా నర్సులు తమ ప్రాణాలను పణంగా పెట్టి ఇన్సులేటర్లలో ఉన్న నవజాత శిశువులను, ఐసీయూ (ICU)లోని చిన్న పిల్లలను చేతులతో పట్టుకుని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఆసుపత్రి బయట వీధుల్లో రోగులు స్ట్రెచర్లపై, ఆక్సిజన్ సిలిండర్లతో నిస్సహాయ స్థితిలో పడి ఉండటం అక్కడి దారుణ పరిస్థితులకు అద్దం పడుతోంది.

పరస్పర ఆరోపణలు

తాము కేవలం ఇరాన్ ప్రభుత్వ భవనాలను, కమాండ్ సెంటర్లను మాత్రమే లక్ష్యంగా చేసుకున్నామని, పౌరులకు హాని కలిగించడం తమ ఉద్దేశ్యం కాదని ఇజ్రాయెల్ రక్షణ దళం ప్రకటించింది. మరోవైపు ఇది ముమ్మాటికీ పౌర సదుపాయాలపై జరిగిన అమానుష దాడి అని, వైద్యం పొందుతున్న రోగులపై బాంబులు వేయడం అంతర్జాతీయ నిబంధనల ఉల్లంఘన అని ఇరాన్ మీడియా మండిపడుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ కొత్త నాయకత్వంతో చర్చలకు సిద్ధమని సంకేతాలు ఇచ్చినప్పటికీ, క్షేత్రస్థాయిలో దాడులు ఏమాత్రం తగ్గడం లేదు. ఇరాన్ సైతం ప్రతిచర్యగా దుబాయ్, అబుదాబి, ఇజ్రాయెల్‌లోని పలు ప్రాంతాలపై డ్రోన్లతో విరుచుకుపడుతోంది. ప్రస్తుతానికి గాంధీ ఆసుపత్రి ఘటనలో మరణించిన వారి సంఖ్యపై స్పష్టత రావాల్సి ఉంది. యుద్ధ తీవ్రత పెరుగుతుండటంతో టెహ్రాన్ వాసులు ప్రాణభయంతో వలస వెళ్తున్నారు.

ఖమేనీ మృతి.. హైదరాబాద్‌ అర్థరాత్రి వందలాంది మంది రోడ్లపైకి వచ్చి నిరసనలు

Next Story