- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అభ్యర్థుల్లో టెన్షన్.. టెన్షన్..!
పోలింగ్‌కు సమయం దగ్గర పడడంతో అభ్యర్థుల్లో టెన్షన్ కనిపిస్తోంది. సర్పంచ్, వార్డు మెంబర్ అభ్యర్థుల్లో మెల్లగా కలవరం మొదలైంది.

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : పోలింగ్‌కు సమయం దగ్గర పడడంతో అభ్యర్థుల్లో టెన్షన్ కనిపిస్తోంది. సర్పంచ్, వార్డు మెంబర్ అభ్యర్థుల్లో మెల్లగా కలవరం మొదలైంది. ప్రచారానికి సుమారు వారం రోజులు మాత్రమే గడువు ఇవ్వడంతో గ్రామాల్లో ప్రచారం ముమ్మరం చేశారు. వారికి కేటాయించిన గుర్తులతో ఇంటింటికి తిరుగుతూ తలుపులు తడుతున్నారు. ఓటర్లను కలుస్తూ తమకు మద్దతుగా నిలవాలని వేడుకుంటున్నారు. ఎంత మంది పోటీలో ఉన్నా.. తమకే ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు రిజర్వ్ చేసిన సర్పంచ్ స్థానాల్లో బరిలో నిలిచిన మహిళా అభ్యర్థుల భర్తలకు డబుల్ టెన్షన్ పట్టుకుంది. ఎన్నికల్లో భార్యను సర్పంచ్ గా గెలిపించుకోవడం ఒక టాస్క్ అయితే, తను కూడా వార్డు మెంబర్ గా గెలిచి, గెలిచిన మిగతా మెజార్టీ వార్డు సభ్యుల మద్దతును కూడగట్టి ఉపసర్పంచ్ కావడం మరో మహాపెద్ద టాస్క్ గా మారింది. అటు భార్య గెలుపు కోసం ఇటు తన గెలుపునకు ఓట్లడగంతో పాటు, ఉప సర్పంచ్ కావడానికి మద్ధతు కోసం పోటీలో ఉన్న తన ప్యానల్ అభ్యర్థుల ఎన్నికల ఖర్చులను కూడా తానే భరించాల్సి వస్తోంది. ఖర్చు చేసేది తమ డబ్బుల కాకపోవడంతో పోటీలో ఉన్న వార్డు అభ్యర్థులు తమకు అనుకూలంగా ఉన్న ఓటర్లకు, తమ తరఫున ప్రచారం చేస్తున్న వారందరికీ మందు, విందు ఖర్చుల బాధ్యత అంతా సర్పంచ్ అభ్యర్థి, ఉప సర్పంచ్ అభ్యర్థికే అప్పజెపుతున్నారు. దీంతో ఎన్నికల్లో పోలింగ్ జరిగే నాటికి అయ్యే ఖర్చు అంచానా వేసిందానికన్నా రెండు మూడింతలయ్యేలా ఉందని వాపోతున్నారు. పోటీ ఎక్కువగా ఉన్న గ్రామాల్లోనైతే ఈ ఖర్చు తడిసిమోపెడయ్యేలా ఉందని పలువురు సర్పంచ్ అభ్యర్థుల భర్తలు వాపోతున్నారు.
ఒకటిన్నర ఎకరం పొలం అమ్మేసిన అభ్యర్థి..
బాల్కొండ నియోజకవర్గంలోని ఓ మేజర్ గ్రామ పంచాయతీకి సర్పంచ్ గా పోటీ చేస్తున్న ఓ అభ్యర్థి ఎన్నికల్లో గెలవడం, సర్పంచ్ సీటును దక్కించుకోవడాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. తనతో పాటు పాలక వర్గం అంతా తన చెప్పుచేతల్లో ఉండాలనే కసితో తనకు నమ్మకమైన వారినే తన ప్యానలో అభ్యర్థులుగా పెట్టుకుని అందరి ఖర్చును తానే భరిస్తున్నారు.
ఉపసర్పంచ్ పదవిని చేజారిపోకుండా తంటాలు..
స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీ వార్డు సభ్యులను ఎలాగైనా గెలిపించుకుని సర్పంచ్ తో పాటు, ఉప సర్పంచ్ పదవిని కూడా ఎట్టి పరిస్థితుల్లో చేజార్చుకోవద్దని ఆలోచన చేస్తున్నారు. పాలకవర్గంలో తీసుకునే నిర్ణయాల్లో ఎవరూ తమను వ్యతిరేకించే అవకాశం లేకుండా చేసుకునేందుకు అంతా తమ వారే పాలక వర్గంలో ఉండే విధంగా ప్లాన్ చేసుకున్నాడు. ఇప్పటికే గ్రామ పంచాయతీలో బాకీ ఉన్న ఇళ్ల టాక్స్ లన్నీ ఆయనే అందరి తరఫున చెల్లించేశారు.
ఎన్నికల ఖర్చుల కోసం తలా కొంత ముట్టజేత..
ఎన్నికల ఖర్చుల కోసం తలా రూ.30వేలు అడ్వాన్సుగా కూడా ఇచ్చినట్లు గ్రామంలో ప్రచారం జరుగుతోంది. ఓటర్లకు తాగిపించే మధ్యం సీసాలన్నీ సర్పంచ్ అభ్‌యర్థి ఇంటినుంచే వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో గెలిచిన తరువాత ఏ ఒక్క వార్డు మెంబర్ తనకు వ్యతిరేకం చేయకుండా ఉండేందుకు అందరి చేత బాండ్ పేపర్ రాయించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.
భార్య సర్పంచ్ అయితే.. భర్త ఉప సర్పంచ్ దక్కించుకోవాల్సిందే..
మహిళ అభ్యర్థులు పోటీ చేస్తున్న గ్రామ పంచాయతీల్లో సర్పంచులుగా మహిళలు గెలిస్తే, ఎట్టి పరిస్థితుల్లోనూ వారి భర్తలు వార్డు సభ్యులుగా గెలిచి, ఉపసర్పంచ్ కావాల్సిందేనని, లేదంటే ఐదేళ్లూ సర్పంచ్ సీటులో ఉన్న మహిళకు పాలక వర్గంలోని ఉపసర్పంచ్ సహా మిగతా సభ్‌యులు చుక్కలు చూపిస్తారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో జరిగిన అనుభవాల దృష్ట్యా మహిళ సర్పంచ్ ఉన్న చోట ఆమె భర్తనే ఉపసర్పంచ్ గా ఉంటే సర్పంచ్ సీట్ సేఫ్ కస్టడీలో ఉన్నట్లుంటుందనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.
ఉప సర్పంచ్ పోస్టుకు యమ డిమాండ్..
అవసరమైతే వివిధ వ్యక్తిగత సహేతుకమైన కారణాలు చూపుతూ సర్పంచ్ చేత సెలవు పెట్టించి, ఉపసర్పంచ్ ఇంచార్జి సర్పంచ్ గా యాక్టివ్ రోల్ పోషించే అవకాశం కూడా ఉండటంతో ఉపసర్పంచ్ కు డిమాండ్ పెరిగింది. దీంతో పాటు అభివృద్ధి పనుల కోసం ఖర్చు చేసే పంచాయతీ నిధులు, ప్రభుత్వ నిధులు ఖర్చు చేయాలంటే సర్పంచ్ సంతకంతో పాటు, ఉపసర్పంచ్ సంతకం కూడా అవసరం కావడంతో సర్పంచ్ కు ఉపసర్పంచ్ సహకారం తప్పనిసరైంది. అందుకే ఉపసర్పంచ్ పదవిని గతంలో ఎన్నడూ లేనంత ప్రాధాన్యత గత పాలకవర్గం నుండి రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. ఇప్పుడు సర్పంచ్ తో పాటు ఉపసర్పంచ్ కు కూడా కమిషన్ల రూపేణా భారీగా సంపాదించుకునే అవకాశాలుండటంతో ఉపసర్పంచ్ పదవి హాట్ కేక్ గా మారింది.






