- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మోండా మార్కెట్‌లో ఉద్రిక్త పరిస్థితి: రణరంగంగా మారిన పోలీస్ స్టేషన్ పరిసరాలు
సికింద్రాబాద్‌లోని మోండా మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం భారీ ఉద్రిక్తత చోటుచేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: సికింద్రాబాద్‌లోని మోండా మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం భారీ ఉద్రిక్తత చోటుచేసుకుంది. జీహెచ్‌ఎంసీ (GHMC) అధికారులు చేపట్టిన కూల్చివేతల కార్యక్రమం రణరంగాన్ని తలపించింది. మోండా మార్కెట్ ప్రాంతంలో అక్రమ నిర్మాణాల పేరిట కొన్ని షాపులను కూల్చివేయడానికి జీహెచ్‌ఎంసీ అధికారులు జేసీబీలతో రంగంలోకి దిగారు. ముందస్తు సమాచారం లేకుండా తమ ఉపాధిని దెబ్బతీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ స్థానిక వ్యాపారులు అధికారులను అడ్డుకున్నారు. వ్యాపారులు అధికారులతో వాగ్వాదానికి దిగడమే కాకుండా, ఆగ్రహంతో జేసీబీలపైకి దూసుకెళ్లారు. పోలీసుల సమక్షంలోనే అధికారులపై దాడికి యత్నించడంతో పరిస్థితి అదుపు తప్పింది. వ్యాపారుల ఆగ్రహాన్ని చూసి భయభ్రాంతులకు గురైన జీహెచ్‌ఎంసీ సిబ్బంది అక్కడి నుండి పరుగులు తీశారు.
పోలీస్ స్టేషన్ ముట్టడి..
అంతటితో ఆగకుండా, తమకు న్యాయం చేయాలంటూ వందలాది మంది వ్యాపారులు మోండా మార్కెట్ పోలీస్ స్టేషన్‌ను ముట్టడించారు. ఏళ్ల తరబడి ఇక్కడే వ్యాపారాలు చేసుకుంటున్నామని, నోటీసులు ఇవ్వకుండా షాపులు కూల్చడం అన్యాయమని వారు నినదించారు. స్టేషన్ ముందు బైఠాయించి ఆందోళన చేయడంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ పూర్తిగా నిలిచిపోయింది. ప్రస్తుతం పోలీసులు రంగ ప్రవేశం చేసి వ్యాపారులతో చర్చలు జరుపుతున్నారు. అదనపు బలగాలను మోహరించి పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.






