విచారణలతో బీఆర్ఎస్‌ ఉక్కిరిబిక్కిరి.. ముఖ్య నేతల వరుస సమావేశాలు

by Kema Shiva Kumar |   (  Updated:2025-08-01 02:04:24  IST  )

రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారం కోల్పోయినప్పటి నుంచి ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఫాంహౌస్‌కే పరిమితమయ్యారు.

విచారణలతో బీఆర్ఎస్‌ ఉక్కిరిబిక్కిరి.. ముఖ్య నేతల వరుస సమావేశాలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారం కోల్పోయినప్పటి నుంచి ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఫాంహౌస్‌కే పరిమితమయ్యారు. 20 నెలలుగా ప్రజల్లోకి రాని ఆయన నిత్యం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డిని పిలిపించుకొని మాట్లాడుతున్నారు. గురువారం సైతం ముగ్గురు నేతలు మరోసారి ఫాంహౌస్‌కు వెళ్లారు. ప్రతిసారీ రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, సమస్యలపై చర్చిస్తున్నట్లు వినిపిస్తున్నా.. ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన పలు విచారణలపైనే వీరి మధ్య డిస్కషన్ నడుస్తున్నట్టు తెలుస్తున్నది. తాజాగా.. కాళేశ్వరం నివేదిక, గొర్రెల స్కామ్‌లపై సీరియస్‌గా చర్చించినట్టు సమాచారం. వాటి నుంచి ఎలా బయట పడాలనే దానిపైనే ఇందులో చర్చించినట్టు తెలిసింది.

కేసీఆర్‌తో సహా నేతల్లో టెన్షన్!

కేసులకు, అరెస్టులకు తాము భయపడేది లేదంటూ బీఆర్ఎస్ నేతలు నిత్యం చెబుతున్నారు. కానీ కాళేశ్వరంపై విచారణ పూర్తవడం, నివేదిక సైతం ప్రభుత్వానికి అందడంతో ప్రస్తుతం కేసీఆర్‌తో పాటు కీలక నేతల్లో టెన్షన్ ఎక్కువైనట్టు తెలుస్తోంది. కమిషన్ నివేదికలో ఏముంది? భవిష్యత్తులో కాంగ్రెస్ ఎలా స్పందించబోతున్నది? అనే విషయంపైనే తాజాగా వారు చర్చించినట్లు సమాచారం. వాటి నుంచి ఎలా బయటపడాలని సమాలోచనలు చేశారని టాక్. అలాగే.. గొర్రెల స్కామ్ కేసులోనూ ఈడీ దూకుడు పెంచడంతో దీనిపైనా ప్రధానంగా డిస్కషన్ చేసినట్టు సమాచారం.

ఎమ్మెల్యేల అనర్హత తీర్పుపై అసంతృప్తి

పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో గురువారం సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. కోర్టు తీర్పు తమకు పాజిటివ్‌గా వస్తుందని బీఆర్ఎస్ నేతలంతా భావించారు. వారిపై అనర్హత వేటు పడుతుందని అనుకున్నారు. కానీ.. సుప్రీంకోర్టు మాత్రం బంతిని మళ్లీ స్పీకర్ చేతుల్లోకి నెట్టడంతో అంతా అసంతృప్తికి గురయ్యారు. పార్టీ అధినేత కేసీఆర్ సైతం ఈ విషయంలో నిరాశకు గురయ్యారని తెలిసింది. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడాలని అంతలా సుప్రీంకోర్టు వరకు వెళ్లినా ఫలితం రాకపోవడంతో ఆయన ఒకింత అసహనానికి గురైనట్టు సమాచారం. సుప్రీంకోర్టు తీర్పును ఆహ్వానిస్తున్నామని బయటకు చెబుతున్నప్పటికీ.. లోలోపల మాత్రం చాలా వరకూ అసంతృప్తితో ఉన్నారనేది పార్టీ శ్రేణుల మధ్య జరుగుతున్న డిస్కషన్. ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడి ఉప ఎన్నికలు వస్తాయని అనుకున్నా పరిస్థితి మొదటికే వచ్చిందని నిరాశలో ఉండిపోయారని తెలిసింది.

బనకచర్లపై పోరుబాట ఎక్కడ?

తెలంగాణకు అన్యాయం చేసేందుకే ఏపీ ప్రభుత్వం బనకచర్ల ప్రాజెక్టును నిర్మిస్తున్నదని బీఆర్ఎస్ నేతలు పదేపదే చెబుతూ వస్తున్నారు. దీనిపై ఇటీవల కీలక నేతలతో భేటీ అయిన సందర్భంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సైతం బనకచర్లను అడ్డుకోవాల్సిందే.. అవసరమైతే ఉద్యమాలు చేయాల్సిందేనంటూ పిలుపునిచ్చారని ప్రకటనలు ఇచ్చారు. అవసరమైతే న్యాయపరంగానూ కొట్లాడాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. కానీ.. ఈ నిర్ణయం తీసుకొని వారాలు అవుతున్నా ఇప్పటివరకు బనకచర్లపై పార్టీ పరంగా అడుగు ముందుకు పడలేదు. కేవలం బీఆర్ఎస్వీ నేతలతో మాత్రమే కాలేజీల్లో అవగాహన కల్పించేందుకు సిద్ధమయ్యారు. అందులో భాగంగానే నేటి నుంచి బీఆర్ఎస్వీ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల వారీగా కాలేజీల్లో తిరగనుంది. స్టూడెంట్లకు సదస్సుల ద్వారా బనకచర్లపై అవగాహన కల్పించనున్నారు. అంతే తప్పితే పార్టీ పరంగా ఎలాంటి కార్యాచరణా ప్రకటించలేదు.

బీసీ రిజర్వేషన్లపై పార్టీ స్టాండ్ ఏంటో?

బీసీ రిజర్వేషన్లపై బీఆర్ఎస్‌లో క్లారిటీ లేకుండా పోయింది. ఎంత సేపూ పార్టీలోని బీసీ నేతలే సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్నారే తప్ప గులాబీ పార్టీ అధినేత కేసీఆర్ నోటి నుంచి మాత్రం ఇప్పటి వరకు రిజర్వేషన్ మాట కూడా రాలేదు. ఈనెల 8న కరీంనగర్‌లో బీసీ గర్జన నిర్వహించాలని బీఆర్ఎస్ నిర్ణయం తీసుకున్నది. ఈ సభకు పార్టీ తరఫున కేసీఆర్ హాజరవుతారా? లేదా? అన్న క్లారిటీ లేదు. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒక్కరే హాజరై.. మిగతా బీసీ నేతలు వస్తారా అనేది సైతం తెలియకుండా ఉంది. రిజర్వేషన్ అంశాన్ని కేసీఆర్ అంత సీరియస్‌గా తీసుకోలేదన్న చర్చ బీసీ నేతల మధ్య జరుగుతున్నది.

Next Story