Jubilee Hills: తప్పెక్కడ జరిగింది? జూబ్లీహిల్స్ ఎగ్జిట్ పోల్స్ పై బీఆర్ఎస్‍లో టెన్షన్

by Prasad Jukanti |   (  Updated:2025-11-12 10:43:59  IST  )

హై టెంపరేషన్ క్రియేట్ చేసిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు సంచలనంగా మారాయి.

Jubilee Hills: తప్పెక్కడ జరిగింది? జూబ్లీహిల్స్ ఎగ్జిట్ పోల్స్ పై బీఆర్ఎస్‍లో టెన్షన్
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాజకీయాల్లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక (Jubilee Hills Bypoll) ఫలితం రాజకీయ వర్గాల్లో టెన్షన్ పెట్టిస్తోంది. పోలింగ్‍కు వారం రోజుల ముందు వరకు బీఆర్ఎస్ వైపు ఆధిక్యతను చూపిన సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ (Exit Polls) వచ్చే సరికి కాంగ్రెస్ వైపు ప్రిడిక్షన్ ఇచ్చాయి. జూబ్లీహిల్స్ సీటు కాంగ్రెస్ దేనని ఇక్కడ 6-8 శాతం ఓట్ల ఆధిక్యంతో హస్తం పార్టీ విజయకేతనం ఎగరవేయబోతోందని దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ అంచనావేయడంతో బీఆర్ఎస్ శ్రేణులు షాక్‍కు గురవుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలన్నా భవిష్యత్‍లో తమ పార్టీకు పునర్ వైభవం రావాలన్నా జూబ్లీహిల్స్ సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవడం అనివార్యం అని భావించిన కారు పార్టీకి ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కలవరపాటుకు గురి చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. దీంతో అసలు తప్పెక్కడ జరిగిది? కాంగ్రెస్‍కు కలిసి వచ్చిన అంశాలేమిటి? తమను దెబ్బ తీసిన విషయాలు ఏమిటనే చర్చ తెలంగాణ భవన్ వర్గాల్లో జోరుగా జరుగుతున్నట్లు తెలుస్తోంది.

గేమ్ చేంజర్‍గా సీఎం రేవంత్ రెడ్డి:

మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో ఏర్పడిన ఉప ఎన్నిక కోసం అందరికంటే ముందే అభ్యర్థిని ప్రకటించి, గల్లీగల్లీకి తిరిగినా బీఆర్ఎస్‍కు (BRS) ఆరంభంలో అంతా సానుకూ వాతావరణమే కనిపించింది. గెలుపు పక్క మెజార్టీపైనే లెక్క అన్నట్లుగా కొన్ని సర్వే సంస్థలు ప్రీపోల్ ఒపీనియన్స్ లో గులాబీ పార్టీ మెజార్టీపై అంచనాలు వేశాయి. కానీ ఎగ్జిట్ పోల్స్ వచ్చే సరికి ఆ వాతావరణం పూర్తిగా తారుమారు అయింది. పోలింగ్ ముగిశాక ఇచ్చిన అంచనాల్లో మెజార్టీ సర్వే సంస్థలు కాంగ్రెస్ (Congress) గెలవబోతున్నట్లు తేల్చాయి. ఈ పరిణామం బీఆర్ఎస్ శ్రేణులను విస్మయానికి గురి చేస్తోంది.

నిజానికి ఈ ఉప ఎన్నిక బీఆర్ఎస్, కాంగ్రెస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ వైపు నుంచి కేటీఆర్, కాంగ్రెస్ వైపు నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుక్షణం వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ఈ క్రమంలో అంతకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వంపై బాకీ కార్డు, ఆరు గ్యారెంటీల విఫలం, నిరుద్యోగం, వంటి సమస్యలను తెరమీదకు తీసుకువస్తూ కాంగ్రెస్‍ను కార్నర్ చేసే ప్రయత్నం చేసింది బీఆర్ఎస్. కానీ ఆఖరి దశలో రంగంలోకి దిగిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రోడ్డు షోలు, బైక్ ర్యాలీలతో పాటు క్షేత్రస్థాయికి ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేయడంలో ఈ ఎన్నికలో గేమ్ చేంజర్ గా మారారనే టాక్ వినిపిస్తోంది. అధికార పార్టీపై ఉన్న వ్యతిరేకతను అధిగమించడంలో, బీఆర్ఎస్ అవకాశాలను భారీగా దెబ్బతీయడంలో రేవంత్ రెడ్డి స్ట్రాటజీ వర్కౌట్ అయిందనే చర్చ జరుగుతోంది. గతంలో మాదిరిగా కేసీఆర్ ఫామ్‍హౌస్ కే పరిమితమై ఒక్కసారి కూడా జూబ్లీహిల్స్ వైపు చూడకపోగా రేవంత్ రెడ్డి మాత్రం వరుస ప్రచారంతో క్యాడర్ లో జోష్ నింపడంతో పాటు ఓటర్లను తమ వైపు మళ్లించుకోగలిగారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

ఆసక్తిగా మారిన పోల్ ఈక్వేషన్స్:

జూబ్లీహిల్స్ లో జరిగింది పేరుకే ఉప ఎన్నిక అయినా ఇక్కడ ప్రధాన పార్టీల మధ్య సాధారణ ఎన్నికల కంటే హై రేంజ్ ఫైటింగ్ నడిచింది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య నువ్వా నేనా అన్నట్లు డైలాగ్ వార్ సాగింది. ప్రచారం చివరి మూడు రోజులు భారీ హైడ్రామానే నడిచింది. స్టేట్ ఫ్యూచర్ పాలిటిక్స్ కు రూట్ మ్యాప్‍గా మారుతాయని భావిస్తున్న జూబ్లీహిల్స్ పోలింగ్ విషయంలోని సమీకరణాలు ఆసక్తిరేపుతున్నాయి. రాష్ట్రంలో బీఆర్ఎస్ బలహీన పడి బీజేపీ బలపడితేనే అది కాంగ్రెస్ కు అనుకూలంగా మారే అవకాశం ఉందని చర్చ చాలా కాలంగా జరుగుతోంది. అలా కాకుండా బీజేపీ వీక్ అయి బీఆర్ఎస్ బలపడితే అది కాంగ్రెస్ కు నష్టం చేకూర్చుతుందనే టాక్ ఉంది. కానీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలోని ఎగ్జిట్ పోల్స్ అంచనాలో మాత్రం బీజేపీ బలహీన పడినా కాంగ్రెస్ దూసుకుపోవడం ఖాయం అనే అంచనాలు వినిపిస్తున్నాయి. బీజేపీ ఓట్ షేర్ చాలా వరకు బీఆర్ఎస్ కు టర్న్ అయిందని ఈ రెండు పార్టీల ఓట్ షేర్ పోగైనా ఇంకా కాంగ్రెస్ వైపే హెడ్జ్ ఉండటం ఆసక్తికర పరిణామం అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అయితే ఎగ్జిట్ పోల్ ఫలితాలే నవంబర్ 14న జరగబోయే కౌంటింగ్ రోజున రిపీట్ అవుతాయని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంటే ఎగ్జిట్ పోల్స్ ఏమి ఎగ్జాట్ పోల్స్ కావని అంతిమ విజయం తమదేనని బీఆర్ఎస్ శ్రేణులు లెక్కలు వేసుకుంటున్నాయి. మొత్తం జూబ్లీహిల్స్ పోరులో వాస్తవంగా పై చేయి ఎవరిది అనేది తేలాలంటే ఎల్లుండి వరకు ఆగాల్సిందే.

Next Story