కౌలు రైతుల కన్నీటి గోస.. వెంటాడుతోన్న ఎరువుల కష్టాలు

by Kema Shiva Kumar |   (  Updated:2025-07-09 01:45:36  IST  )

రాష్ట్రంలో రైతులకు ఎరువుల కష్టాలు వెంటాడుతున్నాయి.

కౌలు రైతుల కన్నీటి గోస.. వెంటాడుతోన్న ఎరువుల కష్టాలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో రైతులకు ఎరువుల కష్టాలు వెంటాడుతున్నాయి. ప్రధానంగా సన్న, చిన్నకారు, కౌలు రైతులకు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. కేంద్రం సకాలంలో రాష్ట్రానికి ఇవ్వాల్సిన కోటా సరఫరా చేయకపోవడంతో సమస్యలు ఉత్పన్నమవుతున్నట్లు తెలుస్తున్నది. ఇదే అదనుగా ఫర్టిలైజర్ దుకాణాల యజమానులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. అధిక ధరకు విక్రయిస్తున్నారని రైతులు వాపోతున్నారు. స్టాక్ రాగానే భూస్వాములు, పెద్ద రైతులకు కాస్త ఎక్కువ ధరతో ఎరువులు ఇచ్చేస్తున్న దుకాణాదారులు.. చిన్న, సన్నకారు, కౌలు రైతులను ఇబ్బందులు పెడుతున్నారనే చర్చ జరుగుతున్నది. అంతేకాకుండా షాపుల్లో స్టాక్ ఉంచకుండా గోదాముల్లో దాచి బ్లాక్ దందా సాగిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ప్రస్తుతం బస్తా డీఏపీ రూ. 1350 కాగా, రూ. 1500 లకు, బస్తా యూరియా రూ. 266 కాగా రూ. 380 లకు అమ్మకాలు చేస్తున్నట్లు తెలుస్తున్నది. రైతులు ప్రశ్నిస్తే.. సరిపడా స్టాక్ రావడం లేదని, వాటినే అమ్ముతున్నామని చెబుతున్నట్టు సమాచారం. ఇష్టముంటే తీసుకోవాలని, లేదంటే ఇతరులకు ఇచ్చేస్తామని హెచ్చరిస్తున్నట్లు తెలిసింది. దీంతో చేసేదేమి లేక కౌలు, చిన్న, సన్నకారులు రైతులు ఆర్థికంగా భారమైనా అధిక ధరలకు ఎరువులు కొనుగోలు చేయాల్సి వస్తున్నది.

కేంద్రం నుంచి సరఫరా కాని పూర్తిస్థాయి కోటా..

ఈ పంట కాలంలో సుమారు 1.32 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేస్తారని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఈ సీజ‌న్‌కు సంబంధించి కేంద్రం నుంచి మూడు నెల‌ల్లో సుమారు 5 ల‌క్షల మెట్రిక్ ట‌న్నుల‌ ఎరువులు రాష్ట్రానికి రావాల్సి ఉన్నది. ఇందులో 3.07 ల‌క్షల మెట్రిక్ ట‌న్నులు మాత్రమే వచ్చింది. జులై నెలకు సంబంధించి 63 వేల మెట్రిక్ ట‌న్నులు దేశీయంగా ఉత్పత్తి అయిన యూరియా, 97 వేల మెట్రిక్ ట‌న్నుల విదేశాల నుంచి దిగుమ‌తి చేసుకున్న యూరియా రాష్ట్రానికి స‌ర‌ఫ‌రా చేయాల్సి ఉండ‌గా, ఇప్పటి వ‌ర‌కు కేవ‌లం 29 వేల మెట్రిక్ ట‌న్నుల యూరియా మాత్రమే వచ్చింది. ఈ వానాకాలం పంటల సాగుకు రాష్ట్రానికి 9.80 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను కేంద్ర ప్రభుత్వం కేటాయించినా.. సకాలంలో సరఫరా చేయకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

యూరియా కొరత లేకుండా చర్యలు చేపట్టాలి

రాష్ట్రంలో యూరియా కొరత లేకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలి. రాష్ట్రానికి ఎరువుల సరఫరాలో కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతున్నట్లు కనిపిస్తున్నది. రాష్ట్ర రైతుల అవసరాలను గుర్తించి కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ లు స్పందించాలి. కేంద్రం పూర్తిస్థాయిలో యూరియా సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలి. - శేర్ నర్సారెడ్డి, రైతు ఐక్యవేదిక అధ్యక్షుడు

Next Story