- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కౌలు రైతుకు గుర్తింపు కరువు.. హక్కుల కోసం ఉద్యమబాట!
తెలంగాణలో కౌలు రైతుల గుర్తింపు కోసం రైతు సంఘాల పోరాటానికి సిద్ధం అవుతున్నాయి. చంపారన్ ఉద్యమ స్ఫూర్తితో 1950 కౌలు చట్టం సవరణ, కొత్త వ్యవసాయ చట్టాల అమలు, రైతు భరోసా పథకం కౌలుదారులకు వర్తింపజేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: కౌలు రైతులను గుర్తించాలంటూ ప్రజాసంఘాలు ఉద్యమబాటకు సిద్ధమవుతున్నాయి. మేనిఫెస్టోలో చెప్పిన విధంగా రైతులతో సమానంగా సంక్షేమ పథకాలు అందించాలని డిమాండ్ చేస్తున్నాయి. కౌలురైతులకు ప్రభుత్వ సాయం అందకపోవడానికి ప్రధాన కారణం వారి వద్ద పత్రాలు లేకపోవడమే. తమ భూములు ఎక్కడ పోతాయోనన్న భయంతో యజమానులు పత్రాలు ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు. పట్టాదారులను భయపెడుతున్న పాత చట్టాలను ప్రభుత్వం రద్దు చేయడం లేదు. కౌలుదారులకు మేలు చేసే కొత్త చట్టాలను అమలు చేయకపోవడంతో ఇలాంటి పరిస్థితి ఉత్పన్నమవుతున్నది.
‘చంపారన్’ స్ఫూర్తితో..
చంపారన్ సత్యాగ్రహ ఉద్యమం ఎందుకోసం జరిగిందో నేటి తరానికీ పెద్దగా తెలియకపోవచ్చు కానీ ఆ చారిత్రక పోరాటం మొదలైంది కౌలు రైతుల కోసమే. డిమాండ్ లేకున్నా.. వేసే పంటలో తప్పనిసరిగా 25 శాతం ఇండిగో పంట పండించాలన్న నాటి నిబంధనలతో బిహార్ లోని చంపారన్ రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఆ చట్టాన్ని సవరించాలని పోరాడారు. అప్పుడే దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన గాంధీజీ.. 1917 ఏప్రిల్ 10న చంపారన్ సత్యాగ్రహ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. దానికి పది మంది లాయర్లు కూడా తోడవడంతో చట్ట సవరణ సాధ్యమైంది. అయితే ఇప్పుడు చంపారన్ ఉద్యమానికి 75 ఏండ్లు నిండిన సందర్భంగా రైతు సంఘాలు ఈ అంశంపై చర్చిస్తున్నాయి. కౌలుదారు చట్టం-1950ని సవరించడమో.. రద్దు చేయడమో చేయకుండా సాయం అందించడం అసాధ్యమని తెలుస్తున్నది. అందుకే నీతి అయోగ్ సూచించినట్లుగా కొత్త చట్టం చేయాలి. లేదంటే మరో ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలి. కేరళం, ఏపీ, కర్ణాటక రాష్ట్రాల్లో ఎలా చేస్తున్నారో అదైనా అమలు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
పొరుగు రాష్ట్రాల్లో ఇలా..
‘కౌలు రైతులతో మాకేం సంబంధం? అది రైతుకు, వారికి మధ్య జరిగే ఒప్పందం’ అంటూ గతంలో పాలకులు అసెంబ్లీలోనే ప్రకటించారు. రికార్డుల్లో పేరు నమోదైతే తమ భూమి ఎక్కడ పోతుందేమోననే భయం యజమానుల్లో పోతే తప్పా కౌలుదారులకు సాయం అందే పరిస్థితి కనిపించడం లేదు. వాస్తవానికి పట్టాదారులకు ఎలాంటి నష్టం లేకుండా కౌలుదారులను గుర్తించేందుకు ఏపీలో ‘ది క్రాప్ కల్టివేషన్ రైట్స్ యాక్ట్’, కేరళంలో ‘కుటుంబ శ్రీ’ని అమలు చేస్తున్నారు. ఇంకా గ్రూప్ కలెక్టివ్ ఫార్మింగ్ చేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెచ్చిన ‘భూమి అధీకృత సాగుదారు చట్టం–2012’ ప్రకారం కౌలురైతులను గుర్తించే ప్రక్రియ ఉన్నది. అయితే దీనిపై అవగాహన కల్పించకపోవడంతో తాము కౌలుకు ఇచ్చినట్టు చెప్పేందుకు యజమానులు భయపడుతున్నారు. రాష్ట్రంలో 36 శాతంగా ఉన్న కౌలురైతులకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం అన్యాయం చేసింది. కౌలు రైతులకు కూడా రైతు భరోసా ఇస్తామని మేనిపెస్టోలో చెప్పిన కాంగ్రెస్.. ఆచరణలో విస్మరించింది. ఈ నేపథ్యంలో కౌలు రైతుల సమస్యపై అవగాహన కల్పిస్తూ.. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేలా ప్రచార, ఆందోళనా కార్యక్రమాలకు రైతు స్వరాజ్య వేదిక సిద్ధమవుతున్నది. తెలంగాణలోనూ భూ అధీకృత సాగుదారుల చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నది.
చట్టమున్నా.. అమలేది?
భూమి అధీకృత సాగుదారు చట్టం–2012 (ల్యాండ్ లైసెన్స్ కల్టివేటర్స్ యాక్ట్) ప్రకారం 2012, 2013లో ఆరు లక్షల మంది కౌలుదారులు గుర్తింపు కార్డులు పొంది ప్రభుత్వ సాయం, బ్యాంకుల నుంచి రుణాలు అందుకున్నారు. ఈ చట్టం ద్వారా పట్టాదారుల అనుమతితో కౌలురైతులకు గుర్తింపు కార్డు ఇస్తారు. ప్రతి మార్చి, ఏప్రిల్ నెలల్లో గ్రామ స్థాయిలోనే గుర్తింపు ప్రక్రియను చేపట్టగా.. రెవెన్యూ రికార్డుల్లో ఎంట్రీ చేయరు. లోన్స్ రిజిస్టర్ లో మాత్రమే రాస్తారు. దీని ద్వారా లోన్ ఎలిజిబుల్ కార్డులను జారీ చేస్తారు. దాని ద్వారా పంట రుణాలు, సబ్సిడీ పథకాలను పొందొచ్చు. ఈ గుర్తింపు కార్డు విలువ ఆ ఏడాదికే పరిమితం. దాని ద్వారా పట్టాదారుడికి కూడా ఎలాంటి సమస్యా ఉండదు. కానీ దీన్ని అమలు చేయడం లేదు.
మహిళా సంఘాలకు చట్టం!
ఉమ్మడి రాష్ట్రంలో మహిళా స్వయం సహాయక గ్రూప్ ల్యాండ్ లీజ్ యాక్ట్ ను రూపొందించారు. దీని ప్రకారం ఒక గ్రూపు ద్వారా కౌలుకు తీసుకొని అదే గ్రూపు సభ్యుల్లో ఒకరు సాగు చేసుకునేవారు. ఒప్పందం గ్రూపు పేరిట ఉండడం వల్ల పట్టాదారుడికి కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. రుణం, సబ్సిడీ వంటివి కూడా గ్రూపులకు అందించేటట్లు తయారు చేశారు. కేవలం ఏడాది కాలపరిమితితో లోన్ ఎలిజిబిలిటీ కార్డులను జారీ చేయడం ద్వారా ఎలాంటి సమస్యా ఉత్పన్నం కాదు. అయితే ఈ చట్టాన్ని అసెంబ్లీ ఆమోదించి రాష్ట్రపతికి పంపినా.. అక్కడ ఏదో కారణంతో నిలిచిపోయింది.
ఎల్ఈసీ చట్టాన్ని అమలు చేయాలి
కౌలు రైతుల సమస్య పరిష్కారానికి వ్యవసాయ కమిషన్ తరపున స్టడీ చేసి ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చాం. ఎల్ఈసీ చట్టాన్ని వ్యవసాయశాఖ ద్వారా అమలు చేయాలని సూచించాం. పాత కౌలుదారుల చట్టాన్ని రద్దు చేసి, నీతి ఆయోగ్ చెప్పినట్టు కొత్త చట్టాన్ని రూపొందిస్తేనే కౌలురైతులకు న్యాయం జరుగుతుంది. చంపారన్ ఉద్యమంలో లాయర్లు ముందుకు రావడం ద్వారానే కౌలురైతులకు న్యాయం జరిగింది. చంపారన్ ఉద్యమ స్ఫూర్తితో రైతుల కోసం బార్ కౌన్సిల్ లో నమోదైన 35 వేల మంది అడ్వకేట్లు ముందుకు రావాలి. ఇది సోషల్ ఇష్యూ. పేదరికం, ఆహారోత్పత్తి, ఆర్ధికాభివృద్ధి వంటి అంశాలతో ముడిపడి ఉందనే కోణంలో చూడాలి. కౌలు రైతులను గుర్తించకపోతే బీడు భూమి పెరుగుతుంది. కల్టివేషన్ కాలమ్ తో పని లేదు. వారికి గుర్తింపు, సాయం మాత్రమే కావాలి.
- భూమి సునీల్, వ్యవసాయ కమిషన్ సభ్యులు






