- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పదేళ్ల నిరీక్షణకు తెర.. వినియోగంలోకి నీలోఫర్‌లో ధర్మశాల భవనం.. అధికారులపై ఆరోగ్య మంత్రి గుస్సా
హైదరాబాద్‌లోని నీలోఫర్ ఆసుపత్రిలో దశాబ్ద కాలంగా నిరుపయోగంగా ఉన్న రోగుల సహాయకుల ధర్మశాల భవనాన్ని రోగుల సహాయకుల కోసం కేటాయించాలని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు.

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్‌లోని (Nilofar Hospital) నీలోఫర్ ఆసుపత్రిలో దశాబ్ద కాలంగా నిరుపయోగంగా ఉన్న రోగుల సహాయకుల ధర్మశాల భవనాన్ని రోగుల సహాయకుల కోసం కేటాయించాలని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ (Health Minister Damodar Rajanarsimha) ఆదేశించారు. ఇన్నాళ్లుగా ఇంత పెద్ద భవనాన్ని ఎందుకు నిరుపయోగంగా ఉంచారంటూ సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉస్మానియా మెడికల్ కాలేజీ లోని అనుబంద 10 టీచింగ్ అసుపత్రులలో వైద్య సేవల బలోపేతంపై వైద్య శాఖ ఉన్నతాధికారులతో వరసగా సమీక్షలు నిర్వహించారు. ఉస్మానియా మెడికల్ కాలేజీకి అనుబంధ కాలేజీ నిలోఫర్ ఆసుపత్రిలో ఓపీ, ఐపీ, రోగులకు అందిస్తున్న సేవలు, ఎక్విప్‌మెంట్ ఉపయోగం, రిపేర్లు, డాక్టర్లు, నర్సింగ్ స్టాప్, ఇతర సిబ్బంది, రోగులకు కనీస సౌకర్యాలు, మౌలిక సదుపాయాల కల్పనపై సుదీర్ఘంగా చర్చిస్తూ వస్తున్నారు. ఈ సందర్భంగానే శుక్రవారం నీలోఫర్ హాస్పిటల్ లో రోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆయన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వివిధ దూర ప్రాంతాల నుంచి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుండి ఆసుపత్రికి వచ్చే నిరుపేద కుటుంబాలకు చెందిన రోగుల సహాయకులు ఆస్పత్రి బయట చెట్ల కింద, ఆసుపత్రి రోడ్డు పక్కన ఎదురు చూపులు చూస్తూ నిలువ నీడ లేక పడుతున్న తీరును చర్చించారు. మానవత్వంతో వారిని అక్కున చేర్చుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఆసుపత్రిలో అన్ని భవనాల పరిస్థితిపై ఆరా తీశారు, నీలోఫర్ ఆసుపత్రి స్థలంలో రోగుల సహాయకుల కోసం జీహెచ్ఎంసీ వారి సహకారంతో పదేళ్ళ క్రితం నిర్మించిన భవనం నిరుపయోగంగా ఉన్న సమాచారాన్ని మంత్రి తెలుసుకున్నారు. ఇన్నాళ్లుగా ఇంత పెద్ద భవనం (జీ+3 భవనం, 72 గదులు) వృథాగా ఉండటమేంటని మండిపడ్డారు. అధికారుల మధ్య సమన్వయం, నిర్లక్ష్యం కారణంగా గత పదేళ్ళుగా ధర్మశాల భవనాన్ని రోగుల సహాయకులకు కేటాయించకుండా నిరుపయోగంగా ఉంచడంపై మంత్రి అధికారులపై గుస్సా అయ్యారు. వెంటనే నీలోఫర్ ఆసుపత్రిలో ధర్మశాల భవనాన్ని రోగుల సహయకులకు కేటాయించాలని అధికారులను ఆదేశించారు. మంత్రి ఆదేశాల మేరకు వైద్య, ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టినా జెడ్. చోంగ్తూ ఆధ్వర్యంలో నీలోఫర్ ఆసుపత్రి డెవలప్‌మెంట్ సోసైటీ సమావేశం నిర్వహించారు.
రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, వైద్య మౌలిక సదుపాయాల సంస్థ ఎండీ ఫణీంద్ర రెడ్డి, డీఎంఈ ఎ.నరేంద్రకుమార్, జీహెచ్‌ఎంసీ జోనల్ కమిషనర్ అనురాగ్ జయంతి, ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. విజయ్‌కుమార్ ఓ నిర్ణయానికి వచ్చారు. దీంతో గత పదేళ్లుగా జీహెచ్‌ఎంసీ అధీనంలో ఉపయోగించకుండా ఉన్న భవనం ఇప్పుడు రోగుల సహాయకుల కోసం వినియోగించబడనుంది. ఈ నిర్ణయంతో నిలోఫర్ ఆసుపత్రికి వచ్చే రోగుల సహాయకులు సౌకర్యవంతమైన వసతి పొందే అవకాశం లభించనుంది. సమీక్ష సందర్భంగా మంత్రికి వచ్చిన ఆలోచన కారణంగా రోగులు వెంట వచ్చే అటెండర్లకు ఉపయోగకరమైన నిర్ణయంగా మారింది. అధికారుల తీరు ఏ విధంగా ఉంటుందో చెప్పేందుకు నీలోఫర్ హాస్పిటల్ ఘటన ఓ ఉదాహరణ అయితే... ప్రజాప్రతినిధి సక్రమంగా స్పందిస్తే ఎంత మేలు జరుగుతుందో తెలియజెప్పేందుకు మంత్రి దామోదర రాజనర్సింహ చక్కని ఉదాహరణగా నిలిచారు.






