- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఉద్యోగాల పేరుతో మోసం.. మయన్మార్ చెర నుంచి బయటపడ్డ తెలుగు యువకులు!
విదేశాల్లో మంచి ఉద్యోగాలు ఇప్పిస్తామన్న మోసపూరిత హామీలతో వెళ్లి మయన్మార్ సరిహద్దుల్లో సైబర్ మాఫియా చెరలో చిక్కుకున్న భారతీయ యువకులు సురక్షితంగా బయటపడ్డారు.

దిశ, డైనమిక్ బ్యూరో: విదేశాల్లో మంచి ఉద్యోగాలు ఇప్పిస్తామన్న మోసపూరిత హామీలతో వెళ్లి మయన్మార్ సరిహద్దుల్లో సైబర్ మాఫియా చెరలో చిక్కుకున్న పలువురు భారతీయ యువకులు సురక్షితంగా బయటపడ్డారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తీసుకున్న వేగవంతమైన చర్యలతో బాధితులు సురక్షితంగా భారత్‌కు చేరుకున్నారు.
ఏం జరిగిందంటే..
ఉద్యోగాల పేరుతో ఏజెంట్లు కొంతమంది యువకులను విదేశాలకు తీసుకెళ్లి, అక్కడి నుంచి అక్రమంగా మయన్మార్ సరిహద్దుల్లోని సైబర్ క్రైమ్ కేంద్రాలకు తరలించారు. గదుల్లో బంధించి శారీరకంగా హింసించడమే కాకుండా, బలవంతంగా సైబర్ నేరాలకు పాల్పడేలా ఒత్తిడి చేశారు. వారి దుస్థితిని గమనించిన కుటుంబ సభ్యులు ఈ విషయం కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు దృష్టికి తీసుకువెళ్లారు. బాధితుల గోడు విన్న వెంటనే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు రంగంలోకి దిగారు. కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జయశంకర్‌కు లేఖ రాసి, విదేశాంగ శాఖ ద్వారా మయన్మార్‌లోని యాంగాన్ భారత దౌత్య కార్యాలయాన్ని అప్రమత్తం చేశారు. స్థానిక అధికారులతో సమన్వయం చేస్తూ బాధితుల విముక్తి కోసం నిరంతరంగా పర్యవేక్షణ చేపట్టారు.
వీడియో ద్వారా వేడుకోలు
మయన్మార్‌లో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ యువకులు తమ కష్టాలను వీడియో రూపంలో మంత్రి రామ్మోహన్ నాయుడుకు పంపించారు. దీనికి స్పందించిన మంత్రి ప్రత్యేక చొరవ తీసుకుని, కేంద్ర ప్రభుత్వ యంత్రాంగాన్ని సమన్వయం చేసి బాధితులను మాఫియా చెర నుంచి విడిపించారు. కేంద్ర ప్రభుత్వం చేసిన నిరంతర ప్రయత్నాల ఫలితంగా బాధితులు సురక్షితంగా ఢిల్లీ చేరుకుని, అక్కడి నుంచి తమ స్వస్థలాలకు వెళ్లారు. ఇంటికి చేరుకున్న యువకులు ఆనందం వ్యక్తం చేస్తూ, తమను ఆదుకున్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సహా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.






