మావోయిస్టులు మీదున్న కోపం ఉగ్రవాదుల మీద లేదేంటి?.. CPI MLA కూనంనేని కీలక వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |

కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం(NDA Govt)పై సీపీఐ తెలంగాణ(CPI Telangana) కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివ రావు(Kunamneni Sambasiva Rao) కీలక వ్యాఖ్యలు చేశారు.

మావోయిస్టులు మీదున్న కోపం ఉగ్రవాదుల మీద లేదేంటి?.. CPI MLA కూనంనేని కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం(NDA Govt)పై సీపీఐ తెలంగాణ(CPI Telangana) కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివ రావు(Kunamneni Sambasiva Rao) కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆపరేషన్ కగార్(Operation Kagar) పేరుతో ఎంత మంది మావోయిస్టులను చంపారు, చంపుతున్నారు.. అసలు మావోయిస్టుల విషయంలో కేంద్రం పాలసీ ఏంటో స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు. ఆపరేషన్ కగార్‌పై శ్వేత పత్రం విడుదల చేయాలని అడిగారు. కేంద్ర బలగాలతో రాష్ట్ర పోలీసులు ఆపరేషన్ కగార్‌లో పాల్గొన్నారు. ఆపరేషన్ కగార్‌పై రాష్ట్ర ప్రభుత్వ విధానం కూడా స్పష్టం చేయాలని కోరారు. కేంద్రానికి మావోయిస్టులు మీద ఉన్న కోపం, కసి ఉగ్రవాదుల మీద లేదని విమర్శించారు.

మావోయిస్టులతో చర్చలు జరపాలని దేశమంతా గగ్గోలు పెడుతున్నా.. ఎందుకు చర్చలు జరపడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. మావోయిస్టులు ఈ దేశ పౌరులు కాదా? అని ప్రశ్నించారు. కేంద్రం ఉగ్రవాదుల కంటే మావోయిస్టులు అత్యంత ప్రమాదకరమని భావిస్తోందని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) ఏర్పడి ఏడాదిన్నర అవుతుంది. కొత్త సంక్షేమ పథకాల వల్ల ఎంతో కొంత ప్రయోజనం చేకూరుతుంది.. కానీ పాత సంక్షేమ పథకాల పరిస్థితి ఏమిటని అడిగారు. పాత సంక్షేమ పథకాలు అరకొర అమలు చేయడం వల్ల ప్రజల్లో గందరగోళ పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు. నన్ను కోసినా డబ్బులు లేవన్న ముఖ్యమంత్రి కొత్త పథకాలు ఎందుకు ప్రవేశ పెడుతున్నారని అడిగారు. కొత్త పథకాలకు డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చి పెడతారని ప్రశ్నించారు.

గత ప్రభుత్వం చేసిన అప్పుల వల్ల ఈ ప్రభుత్వం ఎట్లా బయట పడుతుందో ప్రజలకు స్పష్టం చేయాలి. కొత్త రేషన్ కార్డులను త్వరితగతిన ఇవ్వాలి. ఎల్ఆర్ఎస్‌ను పూర్తి చేయాలి. బీజేపీ, బీఆర్ఎస్‌కు తాము వ్యతిరేకం.. వాళ్లు అధికారంలోకి రావాలని కోరుకోము అని కీలక వ్యాఖ్యలు చేశారు. అప్పుల సుడిగుండాన్ని సృష్టించిందే బీఆర్ఎస్ అని కుండబద్దలు కొట్టారు. కేంద్రం రాష్ట్రాన్ని బిచ్చమెత్తూకునేలా చేసింది. కేంద్రం తండ్రి పాత్ర పోషించాలి. అమరావతికి గతంలో పిడికెడు మట్టి, చెంబు నీళ్ళు ఇచ్చి మోసం చేసింది. ఇప్పుడు ఏదో కొంత సహాయం చేస్తుంది. అదే విధంగా తెలంగాణకు కూడా సాయం చేయాలని డిమాండ్ చేశారు. అందుకు ఇక్కడున్న కేంద్ర మంత్రులు చొరవ తీసుకోవాలని హితవు పలికారు.

Next Story