- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దేశానికే ఆదర్శంగా నిలిచిన యాప్.. యూరియా యాప్ : మంత్రి తుమ్మల
రాష్ట్ర ప్రభుత్వం రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ప్రవేశపెట్టిన ఫెర్టిలైజర్ యాప్ దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నదని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ప్రవేశపెట్టిన ఫెర్టిలైజర్ యాప్ దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నదని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఎరువుల పంపిణీలో పారదర్శకత, సమర్థత, జవాబుదారీతనాన్ని పెంపొందించడంలో ఈ యాప్ కీలక పాత్ర పోషిస్తున్నట్లు చెప్పారు. రైతులకు అవసరమైన సమయంలో, అవసరమైన ప్రాంతంలో ఎరువులు అందుబాటులో ఉండేలా సాంకేతికతను వినియోగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమం ఇతర రాష్ట్రాలకు సైతం ఆదర్శంగా నిలుస్తున్నదని పేర్కొన్నారు. తెలంగాణలో విజయవంతంగా అమలవుతున్న యాప్ పనితీరును పరిశీలించిన అనంతరం, పొరుగు రాష్ట్రాలు సైతం ఇదే తరహాలో ప్రత్యేక యాప్‌లను రూపొందించే దిశగా చర్యలు చేపడుతున్నాయని మంత్రి తెలిపారు. రైతు సంక్షేమం, ఎరువుల పంపిణీలో పారదర్శకత, స్టాక్ నిర్వహణ వంటి అంశాల్లో తెలంగాణ నమూనా దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిందన్నారు. ఈ యాప్‌నకు ఇప్పటికే కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ ప్రశంసలు లభించాయని తెలిపారు.
ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా యాప్ ఆధారిత ఎరువుల పంపిణీ వ్యవస్థను విస్తరించేందుకు కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ సైతం ప్రయత్నాలు చేస్తున్నదని, ఈ వానాకాలం నుండి పలు రాష్ట్రాల్లోని పైలెట్ జిల్లాల్లో కేంద్ర ఎరువుల యాప్ ఎఫ్ఎస్ఏఎస్ (ఫర్టిలైజర్స్ స్కేల్స్ అప్లికేషన్ సిస్టం) అమలుచేసేందుకు నిర్ణయం తీసుకుందన్నారు. జిల్లాల వారీగా డీలర్ల స్టాక్ నిర్ధారణకు షెడ్యూలింగ్ వ్యవస్థ, మండల మ్యాపింగ్ సదుపాయం, మీ సేవ కేంద్రాల ద్వారా, టెలిఫోన్ ద్వారా ఎరువుల బుకింగ్ విధానం, రైతుల సందేహాల నివృత్తి కోసం ప్రత్యేక హెల్ప్‌లైన్ వంటి సౌకర్యాలను అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు. ఈ యాప్ ద్వారా రైతులు తమ ప్రాంతంలోని డీలర్ల వద్ద అందుబాటులో ఉన్న ఎరువుల నిల్వలను ముందుగానే తెలుసుకునే అవకాశం కల్పించామని మంత్రి వివరించారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌కు అవసరమైన యూరియా సరఫరా విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. ఏప్రిల్, మే, జూన్ నెలలకు నెలకు 2 లక్షల మెట్రిక్ టన్నుల చొప్పున మొత్తం 6 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను రాష్ట్రానికి కేటాయించాలని కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి జేపీ నడ్డాకు పలుమార్లు లేఖలు రాశామని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన నిరంతర ప్రయత్నాల ఫలితంగా ఇప్పటివరకు 3.80 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా రాష్ట్రానికి చేరిందన్నారు. మిగిలిన యూరియా కూడా సకాలంలో రాష్ట్రానికి చేరేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఎరువుల సంస్థలతో నిరంతరం సమన్వయం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రత్యేకంగా ఒక నోడల్ అధికారిని నియమించామని చెప్పారు. అదేవిధంగా పోర్టులకు చేరిన యూరియా నిల్వలను రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు త్వరితగతిన తరలించేందుకు ప్రత్యేక అధికారిని నియమించామని తెలిపారు. రైతులకు మేలు జరిగే ప్రతి కార్యక్రమాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయడం, అపోహలు సృష్టించడం, ప్రజలను తప్పుదోవ పట్టించడం ప్రతిపక్షాల వైఖరిగా మారిందన్నారు.






