Kishan Reddy: తెలంగాణ యువతకు ఉద్యోగాలు రావడం ఇష్టం లేదా? రాహుల్‍కు కిషన్ రెడ్డి ప్రశ్న

by Prasad Jukanti |

భారత్–అమెరికా వాణిజ్య ఒప్పందంపై రాహుల్ గాంధీ వ్యాఖ్యలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. టెక్స్టైల్ ఎగుమతులు, తెలంగాణలో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్, పత్తి రైతుల ఎంఎస్‍పీ అంశాలపై వచ్చిన విమర్శలపై స్పందించారు.

Kishan Reddy: తెలంగాణ యువతకు ఉద్యోగాలు రావడం ఇష్టం లేదా? రాహుల్‍కు కిషన్ రెడ్డి ప్రశ్న
X

దిశ, డైనమిక్ బ్యూరో: భారత్–అమెరికా వాణిజ్య ఒప్పందంపై లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఇటీవల చేసిన వ్యాఖ్యలు రైతులు, ఎగుమతి దారుల్లో అనవసర భయాందోళనలు కలిగించేందుకు చేసిన కుటిల ప్రయత్నమేనని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) విమర్శించారు. నెగిటివ్ రాజకీయాల ద్వారా దేశ పురోగతిని వెనక్కి లాగేందుకు రాహుల్ కుట్రలు పన్నుతున్నారని దుయ్యబట్టారు. వాస్తవాలకు విరుద్ధంగా అన్నదాతలు, ఎగుమతిదారులను తప్పుదోవ పట్టించేందుకు రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేస్తున్న దుష్ప్రచారాన్ని ప్రజలు అంగీకరించరన్నారు. ఇప్పటివరకు వరుసగా 100 ఎన్నికల్లో పరాజయాల తర్వాత రాహుల్ గాంధీ నిరాశ, నిస్పృహలతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నారని ప్రధానమంత్రి నరేంద్రమోడీపై ఉన్న వ్యతిరేకతను దేశంపై వ్యతిరేకతగా మలచుకున్నారని విమర్శించారు. అందుకే 11 ఏళ్లుగా దేశం సాధిస్తున్న ప్రగతిని చూసి జీర్ణించుకోలేక, అధికారం దక్కదన్న అసహనంతో దేశంలో అన్నదాతలను, ఎగుమతిదారులను రెచ్చగొట్టేందుకు విఫలయత్నం చేస్తున్నారు. వీటిని కూడా ప్రజలు తిప్పికొడతారన్నారు. ఈ మేరకు ఆయన తన సోషల్ మీడియా ఖాతాలో ఇవాళ పోస్టు చేశారు.

తెలంగాణ యువతకు ఉద్యోగాలు రావడం ఇష్టం లేదా?:

ప్రస్తుతం భారత్ రూ.4 లక్షల కోట్ల విలువైన వస్త్రాలను ఎగుమతి చేస్తోందని 38 అభివృద్ధి చెందిన దేశాల పరిధిలోని 9 స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు (FTAs) ద్వారా రూ.45 లక్షల కోట్ల విలువైన టెక్స్‌టైల్ మార్కెట్‌కు అవకాశాలు ఏర్పడ్డాయని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 7 మెగా టెక్స్టైల్ పార్కులను అభివృద్ధి చేస్తోందని ఇందులో ఒకటి తెలంగాణలోని వరంగల్‌లో కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్‌ పేరుతో డెవలప్ అవుతోందన్నారు. అమెరికా, ఇతర దేశాలతో కుదురుతున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల కారణంగా ఎగుమతులు గణనీయంగా పెరిగి, వేల సంఖ్యలో ఉద్యోగాల కల్పన జరుగుతుందని దీని వల్ల తెలంగాణకు కూడా పెద్ద మొత్తంలో లబ్ధిచేకూరనుందన్నారు. తెలంగాణ అభివృద్ధి చెందడం, ఇక్కడి యువతకు ఉద్యోగాలు రావడం రాహుల్ గాంధీకి ఇష్టం లేదా? అని ప్రశ్నిచారు.

పత్తి రైతులకు ఆందోళన అక్కర్లేదు:

రాహుల్ గాంధీ ఒకవైపు వస్త్ర పరిశ్రమ ఎగుమతిదారులను, మరోవైపు పత్తి డిమాండ్ తగ్గుతుందని రైతులను భయపెట్టేందుకు, వారిని ఆందోళనకు గురిచేసేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. భారత వస్త్ర పరిశ్రమ రంగంలో విస్తారమైన వృద్ధి అవకాశాలు ఉన్నందున భారత పత్తికి డిమాండ్ నిరంతరం పెరుగుతుందని దీని ద్వారా రైతుల ఆదాయం కూడా పెరుగుతుందన్నారు. అందువల్ల భారతీయ పత్తి రైతులు ఏమాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. 2004 నుండి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో దేశ ప్రయోజనాలకు విరుద్ధంగా అనేక అంశాల్లో రాజీపడిన సంగతి మనందరికీ తెలుసని 2013లో బాలీలో జరిగిన ప్రపంచ వాణిజ్య సంస్థ (WTO) మంత్రివర్గ సమావేశంలో ధాన్యం, పత్తిపై కనీస మద్దతు ధర (MSP) వ్యవస్థను 2017 నాటికి రద్దు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం అంగీకరించిందన్నారు.

అందుకు కాంగ్రెస్ సిగ్గుపడాలి:

నరేంద్ర మోడీ నేతృత్వంలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే ‘ఆహార భద్రత’ను దృష్టిలో ఉంచుకుని.. అభివృద్ధి చెందుతున్న దేశాల పబ్లిక్ స్టాక్‌హోల్డింగ్ కార్యక్రమాలను WTO సవాలు చేయకూడదని ఒప్పందం కుదిరిందని పేర్కొన్నారు. దేశ అన్నదాతల విషయంలో అన్యాయంగా వ్యవహరించినందుకు.. కాంగ్రెస్ పార్టీ సిగ్గుపడాలన్నారు. డాక్టర్ ఎమ్మెస్ స్వామినాథన్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన జాతీయ రైతు సంఘం (NCF) సిఫారసులను అమలు చేసే ప్రసక్తే లేదని.. 2013లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం స్పష్టం చేసిందన్నారు. ఉత్పత్తి వ్యయం కంటే కనీసం 50% ఎక్కువగా MSP ఉండాలని స్వామినాథన్ కమిటీ సూచిస్తే దీన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అంగీకరించలేదని విమర్శించారు. అనంతరం, నరేంద్రమోడీ ప్రభుత్వం ఉత్పత్తి వ్యయాన్ని పరిగణనలోకి తీసుకుని MSP నిర్ణయించే విధానాన్ని అమలు చేసిందని రైతుకు అయ్యే ఉత్పత్తి వ్యయానికి రెట్టింపు ఆదాయం అందించే లక్ష్యంతో కేంద్రం పనిచేస్తోందన్నారు. .

Next Story