గ్రామాల్లో ప్రత్యేకంగా బాల పంచాయతీలు

by Naga Rani Yarlagadda |

రాష్ట్రంలో మహిళలు, చిన్నారుల భద్రత పట్ల విస్తృత అవగాహన కల్పించడమే లక్ష్యంగా తెలంగాణ ఉమెన్ సేఫ్టీ వింగ్ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల క్యాంపెయిన్ పేరిట ప్రత్యేక కార్యక్రమాలను ప్రారంభించింది.

గ్రామాల్లో ప్రత్యేకంగా బాల పంచాయతీలు
X
  • మహిళలు, చిన్నారుల భద్రతపై అవగాహన
  • ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా 99రోజుల క్యాంపెయిన్
  • మహిళా భద్రతా విభాగం డీజీ చారు సిన్హా

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో మహిళలు, చిన్నారుల భద్రత పట్ల విస్తృత అవగాహన కల్పించడమే లక్ష్యంగా తెలంగాణ ఉమెన్ సేఫ్టీ వింగ్ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల క్యాంపెయిన్ పేరిట ప్రత్యేక కార్యక్రమాలను ప్రారంభించింది. ఈ ప్రచారంలో భాగంగా తొలి ఆరు రోజుల్లోనే రాష్ట్రవ్యాప్తంగా 1.55 లక్షల మందికి పైగా చేరువైనట్లు మహిళా భద్రతా విభాగం డైరెక్టర్ జనరల్ డీజీ చారు సిన్హా సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. మహిళా భద్రతా యంత్రాంగాన్ని ప్రజలకు మరింత చేరువ చేయడంతో పాటు, పోలీసులకు ప్రజలకు మధ్య సమన్వయం పెంచే దిశగా ఈ కార్యక్రమాలను రూపొందించినట్లు ఆమె తెలిపారు.

1,704 అవగాహన సదస్సులు.. బాల పంచాయతీలు

ఏప్రిల్ 27 నుంచి మే 2వ తేదీ వరకు మొదటి 6 రోజులు రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో మొత్తం 1,704 అవగాహన సదస్సులు నిర్వహించారు. ఈ కార్యక్రమాల ద్వారా విద్యార్థులు, ఉద్యోగులు, స్థానిక ప్రజలు కలుపుకుని మొత్తం 1,55,638 మందికి భద్రతా చర్యలు, చట్టపరమైన హక్కులు, ఫిర్యాదుల విధానంపై అవగాహన కల్పించారు. పల్లెలు, పట్టణాలు అన్న తేడా లేకుండా అన్ని వర్గాల ప్రజలను ఇందులో భాగస్వాములను చేశారు. ఆరో రోజున అత్యధిక సంఖ్యలో ప్రజలకు చేరువైనట్లు ఈ ప్రచారం ద్వారా భద్రతా సేవలపై ప్రజల్లో మరింత నమ్మకం పెరిగింది. ఈ క్యాంపెయిన్‌లో ప్రధానంగా చిన్నారుల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇందుకోసం క్షేత్రస్థాయిలో బాల పంచాయతీలను ఏర్పాటు చేశారు. మొదటి ఆరు రోజుల్లో ఆరు గ్రామాల్లో వీటిని ప్రారంభించారు. వరంగల్ జిల్లాలోని తీగరాజుపల్లి, ఉప్పర్‌పల్లి.. మేడ్చల్ జిల్లాలోని అన్నోజుగూడ, సికండ్లాపూర్.. వికారాబాద్ జిల్లాలోని మదనపల్లి, నవాబ్‌పేట్ గ్రామాల్లో రోజుకొకటి చొప్పున ఈ బాల పంచాయతీలను ఏర్పాటు చేశారు. పిల్లల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందించడం, వారి హక్కులు, విద్య, ఆరోగ్యం, భద్రతపై అవగాహన కల్పించడం ఈ పంచాయతీల ముఖ్య ఉద్దేశం. భద్రతకు సంబంధించిన సమస్యలపై వారు స్వేచ్ఛగా మాట్లాడే వేదికగా ఇవి పనిచేస్తాయి. ఉపాధ్యాయులు, పోలీసులు, గ్రామ పెద్దల సహకారంతో పిల్లలకు సురక్షితమైన, స్నేహపూర్వక వాతావరణం కల్పించేందుకు ఇవి దోహదపడతాయి.

600 మంది పోలీసు సిబ్బందికి ముందుస్తు శిక్షణ

ఈ 99 రోజుల కార్యక్రమాలను ఎలాంటి లోపాలు లేకుండా సమర్థవంతంగా అమలు చేసేందుకు పోలీసు సిబ్బందికి ముందుగానే ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్స్ పేరిట ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఏప్రిల్ 17 నుంచి 25 వరకు మేడ్చల్‌లోని పోలీస్ ట్రైనింగ్ కాలేజ్ లో మూడు బ్యాచ్‌లుగా ఈ శిక్షణ నిర్వహించారు. షీ టీమ్స్, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట, భరోసా కేంద్రాలు, సీడీఈడబ్ల్యూ విభాగాలకు చెందిన సుమారు 600 మంది సిబ్బంది ఇందులో పాల్గొన్నారు. వీరికి లింగ వివక్ష, హింస రకాలు, సైబర్ ముప్పులు, ఫిర్యాదులు స్వీకరించే విధానంపై ప్రామాణిక శిక్షణ ఇచ్చారు. నిర్దేశించిన 99 రోజుల పాటు ఈ అవగాహన కార్యక్రమాలు నిరంతరాయంగా కొనసాగుతాయని డీజీ చారు సిన్హా స్పష్టం చేశారు.

Next Story