- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అడుగంటుతున్న ఆశలు: సాగు, తాగునీటిపై సంక్షోభం నీడ.. ఈ గండం గట్టెక్కేనా!
తెలంగాణ జలాశయాల్లో నీరు అడుగంటి డెడ్ స్టోరేజీకి చేరుతోంది. సాగు, తాగునీరు విద్యుత్ ఉత్పత్తిపై నీలినీడలు కమ్ముకున్నాయి.

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలోని ప్రధాన, మధ్య తరహా ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు క్రమంగా తగ్గిపోతున్నాయి. దాంతో వ్యవసాయం, తాగునీటి సరఫరా, విద్యుత్ ఉత్పత్తిపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా రబీ పంట కాలం చివరిదశలో ఉన్నందున జలాశయాల్లో నీటి మట్టం డెడ్ స్టోరేజీ స్థాయికి చేరువవుతుండటం రైతులను తీవ్రంగా కలవరపెడుతున్నది. ఇప్పటికే కొన్ని చిన్న, మధ్య తరహా ప్రాజెక్టుల్లో నీటి లభ్యత ప్రమాదకర స్థాయికి పడిపోవడంతో సాగు నీటి సరఫరా కొనసాగుతుందా? లేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటివరకు ప్రాజెక్టుల్లో ఉన్న నిల్వల వినియోగం అధికంగా ఉండటం వల్ల నీటి మట్టం వేగంగా పడిపోతున్నది. ముఖ్యంగా సాగు, తాగునీటి అవసరాలు పెరగడం వంటి కారణాల వల్ల నిల్వలపై ఒత్తిడి మరింత ఎక్కువైంది. కొన్ని ప్రాజెక్టుల్లో కనిష్ట స్థాయికి నీరు చేరుకోవడంతో ‘డెడ్ స్టోరేజీ’ పరిస్థితి ఏర్పడే అవకాశం ఉన్నదని అధికారులు చెబుతున్నారు. ఇదే సమయంలో అంతర్రాష్ట్ర జల వినియోగంపై వివాదాలు ముదురుతూ, ఏపీ నీటి వినియోగంపైనా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. మాన్సూన్ ఆలస్యమైతే లేదా తక్కువ వర్షపాతం నమోదైతే పరిస్థితి మరింత విషమించే ప్రమాదం ఉన్న నేపథ్యంలో, తాగునీటి భద్రత కూడా ప్రశ్నార్థకంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నీటి వినియోగంపై కట్టుదిట్టమైన నియంత్రణలు, రియల్ టైమ్ మానిటరింగ్, అత్యవసర నిర్వహణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
డెడ్‌స్టోరేజీ దిశగా..
రాష్ట్రంలోని ప్రధాన జలాశయాల్లో నీటి మట్టాలు గణనీయంగా పడిపోతున్నాయి. కీలక ప్రాజెక్టులు డెడ్ స్టోరేజీకి చేరుకుంటున్నాయి. కృష్ణా, గోదావరి నదీ పరివాహక ప్రాంతాల్లోని ప్రధాన ప్రాజెక్టుల్లో ఈ పరిస్థితి స్పష్టంగా కనిపిస్తున్నది. శ్రీశైలం ప్రాజెక్టు 215.81 టీఎంసీల సామర్థ్యానికి గాను ప్రస్తుతం కేవలం 43.75 టీఎంసీలు మాత్రమే నిల్వ ఉండటం ఆందోళన కలిగించే అంశం. అదే విధంగా నాగార్జునసాగర్ 312.05 టీఎంసీల కెపాసిటీ కాగా.. 176.06 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి. ఇక, ఉత్తర తెలంగాణకు కీలకమైన శ్రీరాంసాగర్ ప్రాజెక్టు 80.50 టీఎంసీలలో కేవలం 28.85 టీఎంసీలు మాత్రమే నిల్వ ఉంది. నిజాంసాగర్‌లో 17.80 టీఎంసీలకు గాను 9.54 టీఎంసీలు, సింగూర్‌లో 29.91 టీఎంసీలకు గాను 7.46 టీఎంసీలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. జూరాల వంటి ప్రాజెక్టుల్లోనూ 9.66 టీఎంసీల సామర్థ్యానికి గాను కేవలం 4.71 టీఎంసీలు మాత్రమే మిగిలి ఉన్నాయి. సాగునీటి అవసరాలు అధికమవడంతో, ప్రాజెక్టుల నుంచి భారీగా నీటి విడుదల కొనసాగుతుండటం ఆందోళన కలిగిస్తున్నది. గోదావరి డెల్టా వ్యవస్థ ద్వారా ఇప్పటివరకు 4,881.11 టీఎంసీల వినియోగం నమోదైంది. కృష్ణా డెల్టాలో కూడా ప్రధాన కాలువల ద్వారా పెద్ద ఎత్తున నీటి విడుదలలు కొనసాగుతున్నాయి. రబీ పంటల చివరి దశలో డెల్టా ప్రాంతాల్లో నీటి అవసరం ఎక్కువగా ఉండటంతో శ్రీశైలం, నాగార్జునసాగర్ వంటి జలాశయాల నుంచి విడుదల పెరిగాయి. ఈ కారణంగా ఆ ప్రాజెక్టుల్లో నిల్వలు వేగంగా తగ్గుతున్నాయి.
తాగునీటి అవసరాలపై ప్రశ్నార్థకం
నగరాలు, పట్టణాలకు నీటి సరఫరా చేసే ప్రధాన ప్రాజెక్టుల్లో నిల్వలు తగ్గిపోవడం మరింత ఆందోళన కలిగిస్తున్నది. సింగూర్, నిజాంసాగర్ వంటి జలాశయాలు తాగునీటి అవసరాలకు కీలకం కాగా.. వీటిలో నీటి నిల్వలు గణనీయంగా తగ్గిపోయాయి. రాబోయే రోజుల్లో సరఫరాలో అంతరాయాలు ఏర్పడే అవకాశమున్నదని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం సాగునీటి అవసరాలు ఎక్కువగా ఉండటంతో, అందుబాటులో ఉన్న నీటిని అన్ని రంగాలకు సమానంగా పంపిణీ చేయడం సవాలుగా మారింది. వేసవి దృష్ట్యా తాగునీటికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. రాబోయే నెలల్లో తాగునీటి భద్రతపై స్పష్టమైన ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయి. ఈ పరిస్థితి కారణంగా హైడల్ విద్యుత్ ఉత్పత్తిపై కూడా ప్రభావం చూపనుంది. ముఖ్యంగా శ్రీశైలం వంటి ప్రధాన హైడల్ ప్రాజెక్టుల్లో నీటి లభ్యత తగ్గిపోవడంతో విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం క్షీణించే పరిస్థితి కనిపిస్తున్నది. నీటి స్థాయి తగ్గిన కొద్దీ టర్బైన్ల ద్వారా విడుదల చేసే నీటి వరిమాణం తగ్గిపోతుంది. దీంతో ఉత్పత్తి తగ్గడమే కాకుండా, కొన్ని సందర్భాల్లో పూర్తిగా నిలిపివేయాల్సిన పరిస్థితి కూడా తలెత్తవచ్చు. మాన్సూన్ వరకు అందుబాటులో ఉన్న నీటిని జాగ్రత్తగా వినియోగించాల్సిన అవసరం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో అన్ని విభాగాల సమన్వయంతో నీటి నిర్వహణపై దృష్టి పెట్టారు.ఇదే క్రమంలో ఇటీవల నీటి పారుదల శాఖ మంత్రి సైతం ఇదే అంశంపై ఉన్నతాధికారులతో సమీక్షించారు. వేసవి దృష్ట్యా సాగు, నీరు కొరత రాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో అంతర్రాష్ట్ర జల వినియోగంపై కొత్త చర్చ మొదలైంది. ముఖ్యంగా ఏపీ వైపు నుంచి జరుగుతున్న అదనపు నీటి వినియోగాన్ని కట్టడి చేయాల్సిన అవసరం ఉన్నదని నిపుణులు సూచిస్తున్నారు. ఈ సమయంలో భాగస్వామ్య నదీ జలాలను ఒప్పందాల ప్రకారం వినియోగించకపోతే, పరిస్థితి మరింత విషమించే ప్రమాదం ఉన్నదని అంటున్నారు.






