- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రవాణాశాఖలో ప్రభుత్వ నిర్లక్ష్యం.. ఆర్టీవోలు లేక సేవలకు అంతరాయం
రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం సమాకూర్చే విభాగాల్లో రవాణాశాఖ కీలకం. అయినా ఈ డిపార్ట్‌మెంట్ పట్ల ప్రభుత్వం చిన్నచూపు చూపిస్తోందనే విమర్శలున్నాయి.

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం సమాకూర్చే విభాగాల్లో రవాణాశాఖ కీలకం. అయినా ఈ డిపార్ట్‌మెంట్ పట్ల ప్రభుత్వం చిన్నచూపు చూపిస్తోందనే విమర్శలున్నాయి. ఈ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను ఫిలప్ చేయడంలో సర్కారు నిర్లక్ష్యం వహిస్తోంది. ఆర్టీవోలు లేక పూర్తి స్థాయిలో సేవలందక వాహనదారులు అనేక ఇబ్బందులు పడుతున్నారు.
ఆర్టీవోలకు అదనపు బాధ్యతలు
రాష్ట్ర వ్యాప్తంగా 12 ఆర్టీవో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటిల్లో ప్రస్తుతం ఎంవీఐలకు ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు. ఒక్కొక్కరికి 3 నుంచి 4 అదనపు బాధ్యతలు ఇవ్వడంతో ప్రజలకు పూర్తి స్థాయిలో సేవలందడం లేదు. దీంతో అక్కడ విధులు నిర్వహించే అధికారులు, సిబ్బందిపైనే ఎక్కువగా పని భారం పడుతోంది. పనులు టైంకు కాకపోవడంతో కొంత మంది రాజకీయ నాయకులతో ఒత్తిడి చేయిస్తున్నారు. ఆయా కార్యాలయాల్లో అర్హత ఉన్న ఎంప్లాయిస్‌కు ప్రమోషన్లు కల్పిస్తే పని భారం తగ్గుతుందనే అభిప్రాయం ఉంది.
వారానికి రెండు మూడు రోజులే..
అదనపు బాధ్యతలు ఇవ్వడంలో ఆర్టీవోలు వారానికి రెండు, మూడు రోజులే విధుల్లో ఉంటున్నారనే విమర్శలున్నాయి. ఇప్పటి వరకు వేల సంఖ్యలో ఫైళ్లు పెండింగ్‌లో ఉన్నాయి. పనులు త్వరగా చేయాలని కింది స్థాయి సిబ్బందిపై వాహనదారులు ఒత్తిడి తెస్తున్నారు. గతేడాది నవంబర్‌లో ఇద్దరు డీటీసీలను జేటీసీలుగా, ఐదుగురు ఆర్టీవోలను డీటీసీలుగా ప్రభుత్వం ప్రమోషన్లు కల్పించింది. అప్పటి నుంచి ఖాళీలు అయినా ఫిలప్ చేయడం లేదు. ఉద్యోగ విరమణ పొందిన వారి స్థానంలో ఎవరికీ పదోన్నతులు ఇవ్వడం లేదు. సికింద్రాబాద్, బండ్లగూడ, ఉప్పల్, కామారెడ్డి, మంచిర్యాల, ఖమ్మం, కొత్తగూడెం ఆర్డీవో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వరంగల్ డీటీసీ సైతం అదనపు బాధ్యతల్లోనే ఉన్నారు.
కొత్త జిల్లాల్లో పరిస్థితి మరీ దారుణం
ఆదిలాబాద్, కరీంనగర్, మహబూబ్‌నగర్, నల్లగొండ, నిజామాబాద్, సంగారెడ్డి జిల్లాలకు ఆర్టీవో పోస్టు మంజూరు చేయలేదు. జగిత్యాల, జనగామ, మెదక్, నాగర్‌కర్నూల్, రాజన్నసిరిసిల్ల, వనపర్తి, ములుగు, నారాయణపేట జిల్లాల సంగతే మరిచిపోయారని స్థానికులు ఆరోపిస్తున్నారు. జిల్లాలు ఏర్పాటు చేసిన ప్రభుత్వాలు ఎంవీఐలకు ఇన్‌చార్జిలుగా బాధ్యతలు అప్పగించాయి. ఏ శాఖలోనూ లేని విధంగా ప్రభుత్వం రాష్ట్ర ట్రాన్స్‌పోర్టు అథారిటీలో ఉద్యోగుల పదోన్నతుల కోసం ఉన్నతాధికారులతో కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ వద్ద ఉద్యోగుల పూర్తి వివరాలున్నాయి. ప్రమోషన్ల విషయంలో కమిటీ తీసుకున్న నిర్ణయం ప్రకారమే ప్రభుత్వం ముందుకెళ్తుంది. మరి ఈ కమిటీ ఐదేళ్లుగా ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీపై ఎందుకు శ్రద్ధ చూపడం లేదని ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.






