ఇంధన పొదుపు దిశగా తెలంగాణ..

by Gantepaka Srikanth |

రాష్ట్రంలో ఇంధన పొదుపు, పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర పునరుత్పాదక ఇంధన అభివృద్ధి సంస్థ (టీజీ రెడ్కో)- అంతర్జాతీయ సంస్థ గ్లోబల్ గ్రీన్ గ్రోత్ ఇన్‌స్టిట్యూట్ (జీజీజీఐ) మధ్య మంగళవారం అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదిరింది.

ఇంధన పొదుపు దిశగా తెలంగాణ..
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ఇంధన పొదుపు, పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర పునరుత్పాదక ఇంధన అభివృద్ధి సంస్థ (టీజీ రెడ్కో)- అంతర్జాతీయ సంస్థ గ్లోబల్ గ్రీన్ గ్రోత్ ఇన్‌స్టిట్యూట్ (జీజీజీఐ) మధ్య మంగళవారం అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదిరింది. సెక్రటేరియేట్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్ సమక్షంలో టీజీ రెడ్కో ఎండీ అనిల వావిళ్ల-జీజీజీఐ ఇండియా ప్రతినిధి సౌమ్య ప్రసాద్ గారానాయక్ ఈ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. స్మార్టీ-బీ(సస్టైనింగ్ అండ్ ప్రమోటింగ్ మార్కెట్ ట్రాన్స్ ఫార్మేషన్ ఫర్ ఎనర్జీ ఎఫీషియన్సీ ఇన్ బిల్డింగ్స్ ఇన్ ఇండియా) అనే అంతర్జాతీయ చొరవలో భాగంగా ఈ భాగస్వామ్యం కొనసాగుతుంది. దీని ద్వారా భవన నిర్మాణ రంగంలో వినూత్న ఆర్థిక నమూనాలు, సాంకేతికతను ప్రవేశపెట్టి ఇంధన వినియోగాన్ని తగ్గించడం ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశ్యం.

డిమాండ్ సైడ్ మేనేజ్‌మెంట్ (డీఎస్ఎం), సస్టైనబుల్ కూలింగ్, గ్రీన్ ఎంఎస్ఎంఈలు, ఈ-మొబిలిటీ రంగాలలో ఉమ్మడి కార్యక్రమాలు చేపట్టనున్నారు. వినూత్న ఆర్థిక నమూనాలు, ఎస్కో పద్ధతుల ద్వారా ప్రాజెక్టులకు నిధుల సమీకరిస్తారు. ఇంధన రంగంలో పనిచేసే సంస్థల సామర్థ్యాన్ని పెంచడానికి ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు, నాలెడ్జ్ షేరింగ్ సెషన్లు నిర్వహిస్తారు. తెలంగాణను తక్కువ కార్బన్ ఉద్గారాల రాష్ట్రంగా మార్చేందుకు జీజీజీఐ తన అంతర్జాతీయ అనుభవాన్ని, సాంకేతిక సహకారాన్ని అందిస్తుంది. ఈ సందర్భంగా నవీన్ మిట్టల్ మాట్లాడుతూ.. ఈ ఒప్పందం ద్వారా రాష్ట్రంలో ఇంధన పొదుపు విధానాలు బలోపేతం అవుతాయని, గ్రీన్ ఇన్వెస్ట్‌మెంట్‌లు, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీజీ రెడ్కో జీఎం జి.ఎస్.వి ప్రసాద్, జీజీజీఐ రీజనల్ ఆఫీసర్ అశోక్ బోనం, నేషనల్ ప్రొడక్టివిటీ కౌన్సిల్ డైరెక్టర్ డి. రజనీకాంత్, క్లైమేట్ పాలసీ ఇనిషియేటివ్ అసోసియేట్ డైరెక్టర్ సార్థక్ ఖురానా తదితరులు పాల్గొన్నారు.

Next Story