గ్రీన్ ఎనర్జీలో దేశంలోనే తెలంగాణ టాప్

by Muthe.Rajitha |

పర్యావరణహిత రవాణా వ్యవస్థను ప్రోత్సహించడంలో తెలంగాణ మరో మైలురాయిని అందుకుంది.

గ్రీన్ ఎనర్జీలో దేశంలోనే తెలంగాణ టాప్
X

దిశ, తెలంగాణ బ్యూరో : పర్యావరణహిత రవాణా వ్యవస్థను ప్రోత్సహించడంలో తెలంగాణ మరో మైలురాయిని అందుకుంది. సిటీ విత్ బెస్ట్ గ్రీన్ ట్రాన్స్ పోర్ట్ ఇనీషియేటివ్ అవార్డు హైదరాబాదుకు లభించింది. ఈ అవార్డు స్థిరమైన నగర రవాణా (సస్టైనబిలిటీ అర్బన్ మొబిలిటీ), ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) వినియోగాన్ని విస్తృతంగా ప్రోత్సహించడంలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన కృషికి గుర్తింపుగా అందించారు. ఈ అవార్డు నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ (ఎన్ క్యాప్) కింద అమలైన ఈ- మొబిలిటీ, ఈవీ ఛార్జింగ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టు విజయవంతంగా పూర్తి చేసినందుకు గాను రాష్ట్ర రిన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీజీ రెడ్కో)కి లభించింది. ఆదివారం ఢిల్లీలో జరిగే ఓ కార్యక్రమంలో ఈ అవార్డును కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ చేతుల మీదుగా రెడ్కో ఎండీ అందుకోనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేసే టీజీ రెడ్కో, రాష్ట్ర ఈవీ ఛార్జింగ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ స్టేట్ నోడల్ ఏజెన్సీ... సింగిల్ విండో క్లియరెన్స్ ఏజెన్సీగా పనిచేస్తోంది. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, టీజీఎస్ఆర్టీసీ, డిస్కమ్‌లతో సమన్వయంతో రాష్ట్రవ్యాప్తంగా పటిష్టమైన ఛార్జింగ్‌ మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయడంలో టీజీరెడ్కో కీలక పాత్ర పోషించింది.

హైదరాబాద్... గ్రీన్ ఎనర్జీ రవాణాకు మోడల్ నగరం...

టీజీరెడ్కో కృషి ఫలితంగా ఈవీ ఛార్జింగ్ వినియోగం గత తొమ్మిది నెలల్లో 329% పెరిగింది. పట్టణ రవాణాలో ఎలక్ట్రిక్ మరియు నాన్-మోటరైజ్డ్ ట్రాన్స్‌పోర్ట్ వైపు 14.9% వాహనాలు ఈవీ విధానంలోకి మారాయి. 2030 నాటికి 6,000, 2035 నాటికి 12,000 ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని రెడ్కో లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఈ ప్రాజెక్టులు తెలంగాణ ఈవీ అండ్ ఎనర్జీ స్టోరేజీ పాలసీ (2020-2030), క్లీన్ ఎనర్జీ పాలసీ (2025) ఆధారంగా కొనసాగనున్నాయి.

గ్రీన్ ఎనర్జీ సాధనలో రాష్ట్రంలో ముందంజ

- టీజీ రెడ్కో వీసీ అండ్ ఎండీ వి అనిల

రాష్ట్రానికి ఈ అవార్డు దక్కడం గ్రీన్ ఎనర్జీ ట్రాన్స్ పోర్ట్ ను ప్రోత్సహించడంలో మన ప్రభుత్వ నిబద్దతకు నిదర్శనమని టీజీరెడ్కో వీసీ అండ్ ఎండీ వి. అనిల తెలిపారు. రాష్ట్రంలో పర్యావరణహిత రవాణా వ్యవస్థను అభివృద్ధి చేయడంలో టీజీ రెడ్కో ఇదే తరహాలో ముందుకు సాగుతుందన్నారు. రెడ్కో ఇంతటి గుర్తింపు సాధించినందుకు సీఎం రేవంత్ రెడ్డి, డిఫ్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రెడ్కో చైర్మన్ డా. ఏ. శరత్ కు ఆమె ధన్యవాదాలు తెలిపారు. గ్రీన్ ఎనర్జీలో దేశంలో తెలంగాణ మరింత ముందుండేలా టీజీ రెడ్కో మరింత అంకితభావంతో పనిచేస్తుందని ఆమె పేర్కొన్నారు.

రాష్ట్రంలో టీజీ రెడ్కో సాధించిన మైలు రాళ్లు...

* రాష్ట్రవ్యాప్తంగా 1,000కి పైగా ఈవీ ఛార్జింగ్‌ స్టేషన్లు ఏర్పాటు. వాటిలో 150 టీజీ రెడ్కో నేరుగా ఏర్పాటు చేసింది.

* రూ.35 కోట్ల ప్రాజెక్టును ఎన్ క్యాప్ నిధులతో చేపట్టారు. ఫలితంగా రాష్ట్ర ఖజానాపై భారం లేకుండా అమలు.

* ప్రతి నెలా 552 టన్నుల కర్బన ఉద్గారాలు, 5.57 కిలోల పీఎం2.5 ఉద్గారాల తగ్గింపు.

* రెడ్కో పరిధిలో 37కి పైగా ఛార్జ్ పాయింట్ ఆపరేటర్లు, 16,000 మంది వినియోగదారులు టీజీఈవీ యాప్‌లో నమోదు.

* ప్రత్యేక ఈవీ టారిఫ్ (ఎల్టీ-IX) ప్రవేశపెట్టి చవకైన ఛార్జింగ్ సౌకర్యం.

* టెక్నికల్ సపోర్ట్, మెయింటెనెన్స్ రంగాల్లో కొత్త ఉద్యోగావకాశాల సృష్టి.

Next Story