జల సంచాయ్ జన భాగీదారీ 1.0 ర్యాంకింగ్స్‌లో తెలంగాణ‌కు అగ్రస్థానం

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-09-25 16:35:32  IST  )

వ‌ర్షపు నీటి సంర‌క్షణ‌లో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానం సాధించి, ఆద‌ర్శంగా నిలిచింది.

జల సంచాయ్ జన భాగీదారీ 1.0 ర్యాంకింగ్స్‌లో తెలంగాణ‌కు అగ్రస్థానం
X
  • ప‌నుల జాత‌ర‌, ఉపాధి హామీ ప‌నుల్లో వర్షపు నీటి సంరక్షణకు అధిక ప్రాధాన్యత
  • ఫ‌లితంగా తొలి స్థానంలో తెలంగాణ‌, ఉత్తమ రాష్ట్ర అవార్డు
  • దేశానికే తెలంగాణ ఆద‌ర్శంగా నిల‌వ‌డం ప‌ట్ల మంత్రి సీత‌క్క హ‌ర్షం
  • అధికారుల‌ను అభినందించిన మంత్రి సీతక్క

దిశ, తెలంగాణ బ్యూరో: వ‌ర్షపు నీటి సంర‌క్షణ‌లో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానం సాధించి, ఆద‌ర్శంగా నిలిచింది. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ప్రకటించిన జల సంచాయ్ జన భాగీదారీ 1.0 ర్యాంకింగ్‌ల ప్రకారం, దేశ‌వ్యాప్తంగా చేపట్టిన వర్షపు నీటి సంరక్షణ పనుల్లో తెలంగాణ ఈ ఘనతను అందుకుంది. ఈ జాబితాలో ఛత్తీస్‌గఢ్ రెండవ స్థానంలో, రాజస్థాన్ మూడవ స్థానంలో నిలిచాయి.

అద్భుత ప్రగతితో 5.2 లక్షలకు పైగా పనులు

2024-25 సంవ‌త్స‌రంలో రాష్ట్ర‌వ్యాప్తంగా మొత్తం 5,20,362 వర్షపు నీటి సంరక్షణ పనులను చేపట్టిన తెలంగాణ, ఈ రంగంలో దేశంలోనే అత్యధిక పనులు చేసిన రాష్ట్రంగా రికార్డు సృష్టించింది. చెక్‌డ్యామ్‌లు, ఇంకుడు గుంతలు, సోక్ పిట్స్, రూఫ్‌టాప్ రైన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్, బోర్‌వెల్ రీఛార్జ్, ఫార్మ్ పాండ్స్ వంటి పలు రకాల పనులను రాష్ట్రం విజయవంతంగా పూర్తి చేసింది. ఉత్తరప్రదేశ్‌, బీహార్‌ వంటి పెద్ద రాష్ట్రాలు సైతం చేయలేకపోయిన పనులను ప్రజల భాగస్వామ్యంతో తెలంగాణ చేసి చూపించడం విశేషం.

సీఎం మార్గనిర్దేశం, మంత్రి సీతక్క పర్యవేక్షణతోనే సాధ్యం

పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో, వివిధ శాఖలు, స్వచ్ఛంద సంస్థలు, వ్యక్తుల సహకారంతో చేపట్టిన ఈ ఉద్యమానికి సీఎం మార్గనిర్దేశనంతో పాటు పంచాయ‌తీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డా. ద‌న‌స‌రి అనసూయ‌ సీతక్క ప్రత్యేక పర్యవేక్షణ ప్రధాన బలంగా నిలిచాయి. ప్ర‌జా ప్ర‌భుత్వం చేప‌ట్టిన ప‌నుల జాత‌ర మరియు ఉపాధి హ‌మీ ప‌నుల్లో నీటి సంరక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వడం వల్లే ఈ అగ్ర‌స్థానం సాధ్యమైందని అధికారులు తెలిపారు.

8 జిల్లాలకు ప్రత్యేక నగదు రివార్డులు

"జల సంచాయ్ జన భాగీదారీ 1.0" లో దేశ వ్యాప్తంగా 67 జిల్లాలను ఎంపిక చేయగా, తెలంగాణ రాష్ట్రానికి చెందిన 8 జిల్లాలకు ప్రత్యేక గుర్తింపు లభించింది. ఇందులో రూ. 2 కోట్ల రివార్డు విభాగంలో ఆదిలాబాద్, నల్గొండ, మంచిర్యాల రూ.1 కోటి రివార్డు విభాగంలో వరంగల్, నిర్మల్, జనగాం, రూ. 25 లక్షల రివార్డు విభాగంలో భద్రాద్రి, మహబూబ్‌నగర్ జిల్లాలకు కేంద్ర జ‌ల‌శ‌క్తి మంత్రిత్వ శాఖ క్యాష్ రివార్డులను ప్రకటించింది. ఈ విజయం పట్ల మంత్రి సీతక్క హర్షం వ్యక్తం చేస్తూ, ఈ ఘ‌న‌త సాధించడంలో కీల‌క పాత్ర పోషించిన ప్రిన్సిపల్ సెక్రటరీ ఎన్. శ్రీధర్, డైరెక్టర్ జీ. సృజన, జిల్లా క‌లెక్ట‌ర్లు, ఇతర అధికారులను అభినందించారు. భూగర్భ జలాల పెంపుదల, వర్షపు నీటి సమర్థ వినియోగం, ప్రజల భాగస్వామ్యం అనే మూడు ప్రధాన లక్ష్యాలతో సాగిన ఈ ఉద్యమం దేశానికి తెలంగాణ ఇచ్చిన మరో గొప్ప సందేశం అవుతుందని ఆమె పేర్కొన్నారు.

Next Story