పాస్‌పోర్ట్ వెరిఫికేషన్‌లో తెలంగాణ టాప్.. ఢిల్లీలో జాతీయ అవార్డు అందుకోనున్న డీజీపీ

by Ramesh Naini |

కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలంగాణ పోలీసులను జాతీయ స్థాయి ప్రతిష్టాత్మక పురస్కారానికి ఎంపిక చేసింది.

పాస్‌పోర్ట్ వెరిఫికేషన్‌లో తెలంగాణ టాప్.. ఢిల్లీలో జాతీయ అవార్డు అందుకోనున్న డీజీపీ
X

దిశ, తెలంగాణ బ్యూరో: పాస్‌పోర్ట్ దరఖాస్తుల పరిశీలన, పోలీసు ధ్రువీకరణ ప్రక్రియలో తెలంగాణ పోలీస్ ప్రజలకు వేగంగా, పారదర్శకంగా సేవలు అందించినందుకు గాను కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలంగాణ పోలీసులను జాతీయ స్థాయి ప్రతిష్టాత్మక పురస్కారానికి ఎంపిక చేసింది. 2025 26 సంవత్సరానికి గాను ఈ విభాగంలో ఉత్తమ సేవలందించిన రాష్ట్రంగా గుర్తిస్తూ ఇన్‌స్టిట్యూషనల్ పెర్ఫార్మెన్స్ అవార్డును కేంద్రం ప్రకటించింది.

19న ఢిల్లీలో అవార్డు ప్రదానం

ఈ అవార్డు ఎంపికకు సంబంధించి విదేశాంగ శాఖ జాయింట్ సెక్రటరీ, చీఫ్ పాస్‌పోర్ట్ ఆఫీసర్ బి.ఎస్. ముబారక్ రాష్ట్ర డీజీపీ సి.వి.ఆనంద్‌కు అధికారికంగా లేఖ పంపారు. ప్రతి ఏటా జూన్ నెలలో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే పాస్‌పోర్ట్ సేవా దివస్, పాస్‌పోర్ట్ అధికారుల సదస్సు ఈ ఏడాది జూన్ 18, 19 తేదీల్లో న్యూఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ భవన్‌లో జరగనుంది. జూన్ 19న జరిగే ప్రధాన కార్యక్రమంలో కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్ చేతుల మీదుగా డీజీపీ సి.వి. ఆనంద్ ఈ జాతీయ అవార్డును అందుకోనున్నారు. అంతేకాకుండా, ఈ కార్యక్రమంలో జరిగే హై లెవల్ సెగ్మెంట్ సమావేశానికి ప్రత్యేకంగా హాజరుకావాల్సిందిగా డీజీపీకి కేంద్రం ఆహ్వానం పలకడం విశేషం.

సాంకేతికత.. వేగవంతమైన సేవల వల్లే: డీజీపీ

ఈ జాతీయ స్థాయి గుర్తింపుపై డీజీపీ సి.వి. ఆనంద్ హర్షం వ్యక్తం చేశారు. పాస్‌పోర్ట్ జారీ ప్రక్రియలో పోలీసు ధ్రువీకరణ అనేది కీలకమైన అంకమని, ఈ విభాగంలో తెలంగాణ పోలీసులు సాంకేతికతను జోడించి పని చేయడం వల్లే ఈ అవార్డు వరించిందని స్పష్టం చేశారు. దరఖాస్తుదారులకు ఎక్కడా ఎలాంటి ఇబ్బంది, జాప్యం కలగకుండా పారదర్శకంగా, వేగవంతమైన సేవలు అందించామని తెలిపారు. ప్రజా కేంద్రిత దృక్పథంతో నిరంతరం శ్రమిస్తున్న పోలీసు అధికారుల వృత్తిపరమైన నైపుణ్యానికి, సేవా నిబద్ధతకు ఈ పురస్కారం నిదర్శనమని ఆయన కొనియాడారు. ఈ జాతీయ అవార్డు స్ఫూర్తితో భవిష్యత్తులో ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించే దిశగా అడుగులు వేస్తామని ఆయన పేర్కొన్నారు.

Next Story