మాతా-శిశు సేవల్లో తెలంగాణ టాప్.. కేంద్రం నుంచి రూ.200 కోట్ల అదనపు నిధులు

by Ramesh Naini |

మాతా-శిశు ఆరోగ్య సేవల్లో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అత్యుత్తమ పనితీరు కనబరిచిన రాష్ట్రాల్లో ఒకటిగా నిలిచింది.

మాతా-శిశు సేవల్లో తెలంగాణ టాప్.. కేంద్రం నుంచి రూ.200 కోట్ల అదనపు నిధులు
X

దిశ, తెలంగాణ బ్యూరో: మాతా-శిశు ఆరోగ్య సేవల్లో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అత్యుత్తమ పనితీరు కనబరిచిన రాష్ట్రాల్లో ఒకటిగా నిలిచింది. రాష్ట్రంలో గర్భిణులు, బాలింతలు, నవజాత శిశువులకు అందుతున్న నాణ్యమైన వైద్య సేవలను, సాధించిన ప్రగతి పూర్వక ఫలితాలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ప్రత్యేక ప్రోత్సాహకాన్ని ప్రకటించింది. నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్.హెచ్.ఎం) కింద రూ.200 కోట్ల అదనపు నిధులను మంజూరు చేస్తూ కేంద్ర ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిధులతో రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో మాతా-శిశు సంరక్షణ వ్యవస్థలను మరింత బలోపేతం చేయనున్నారు.

అత్యాధునిక సదుపాయాల కల్పన..

కేంద్రం నుంచి అందిన అదనపు నిధులను రాష్ట్ర వ్యాప్తంగా మాతా-శిశు సంరక్షణ సేవలను విస్తరించేందుకు ప్రణాళికాబద్ధంగా ఖర్చు చేయనున్నారు. ఇందులో భాగంగా ఎంపిక చేసిన ప్రభుత్వ హాస్పిటళ్లలో నవజాత శిశు సంరక్షణ విభాగాల విస్తరణ, లేబర్ రూములు, ఆపరేషన్ థియేటర్లను జాతీయ నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా ఆధునికీకరించనున్నారు. అదేవిధంగా సహజ ప్రసవాలను ప్రోత్సహించేందుకు మిడ్‌వైఫరీ-లెడ్ కేర్ యూనిట్లు, తక్కువ బరువుతో పుట్టిన పిల్లల సంరక్షణకు కంగారూ మదర్ కేర్ (కేఎంసీ) వార్డులు, లాక్టేషన్ మేనేజ్‌మెంట్ యూనిట్ల ఏర్పాటును వేగవంతం చేయనున్నారు.

లక్ష్యం.. మాతృ, శిశు మరణాల నివారణే..

అధిక ప్రసవాలు జరిగే ప్రాంతీయ, జిల్లా ఆసుపత్రుల్లో తల్లి, గర్భస్థ శిశువు ఆరోగ్యాన్ని అత్యాధునిక పరికరాలతో పర్యవేక్షించే హైటెక్ వ్యవస్థలను ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆరోగ్య సంస్థ లన్నింటినీ ఇండియన్ పబ్లిక్ హెల్త్ స్టాండర్డ్స్ (ఐపీహెచ్ఎస్)కు అనుగుణంగా తీర్చిదిద్ది, ప్రతిష్టాత్మక నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ (ఎన్కాస్) సర్టిఫికేషన్ పొందేలా మౌలిక వసతులు కల్పించనున్నారు. ఈ వ్యూహాత్మక చర్యలు రాష్ట్రంలో మాతృ మరణాల రేటు (ఎంఎంఆర్), నవజాత శిశు మరణాల రేటు (ఎన్ఎంఆర్)ను మరింత తగ్గించడంతో పాటు పేదలకు కార్పొరేట్ స్థాయి ఉచిత వైద్యం అందించడంలో కీలక పాత్ర పోషించనున్నాయి.

వైద్యుల సమిష్టి కృషికి దక్కిన గౌరవం: కమిషనర్

కేంద్ర ప్రభుత్వ గుర్తింపుపై హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ డా. సంగీత సత్యనారాయణ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. "మాతా-శిశు సంరక్షణలో తెలంగాణ సాధించిన జాతీయ స్థాయి గుర్తింపు.. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ, క్షేత్రస్థాయి సిబ్బంది, వైద్యుల సమిష్టి కృషికి దక్కిన గౌరవం. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో సైతం గర్భిణులకు ముందస్తు పరీక్షలు, పౌష్టికాహారం అందించడం వల్లనే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరిగింది. కేంద్ర ప్రభుత్వం కేటాయించిన రూ.200 కోట్ల అదనపు నిధుల్లోని ప్రతి రూపాయిని అత్యంత పారదర్శకంగా, సద్వినియోగం చేస్తాం. మౌలిక వసతుల కొరత ఉన్న ఆసుపత్రులను గుర్తించి ప్రాధాన్యత క్రమంలో ఆధునీకరిస్తాం. తల్లీ, బిడ్డల క్షేమమే లక్ష్యంగా అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన వైద్య సేవలను తెలంగాణలోని ప్రతి పేద కుటుంబానికి అందుబాటులోకి తీసుకరావడానికి కట్టుబడి ఉన్నాం" అని స్పష్టం చేశారు.

Next Story