- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇకపై ప్రత్యేక ఫర్టిలిటీ ఓపీ క్లినిక్‌లు : మంత్రి దామోదర రాజనర్సింహ
రాష్ట్రంలోని ప్రభుత్వ హాస్పిటళ్లలో సంతాన సాఫల్య వైద్య సేవలను విస్తరించాలని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అధికారులను ఆదేశించారు.

- ఫర్టిలిటీ సేవలను విస్తరించాలి
- అనైతిక చర్యలకు పాల్పడే ఫర్టిలిటీ సెంటర్లపై చర్యలు తీసుకునాలి
- సంతాన సాఫల్య సేవల విస్తరణపై మంత్రి దామోదర్ రాజనర్సిహ సమీక్ష
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని ప్రభుత్వ హాస్పిటళ్లలో సంతాన సాఫల్య వైద్య సేవలను విస్తరించాలని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. ఇకపై ప్రభుత్వ గైనకాలజిస్టులతో ప్రత్యేక ఫర్టిలిటీ ఓపీ క్లినిక్‌లు నిర్వహించాలని సూచించారు. మరోవైపు, ప్రైవేట్ ఫర్టిలిటీ సెంటర్లలో నిబంధనల అమలుపై కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. ప్రతి నెల తప్పనిసరిగా తనిఖీలు నిర్వహించి నిబంధనలు ఉల్లంఘిస్తున్న సెంటర్లపై, అనైతిక చర్యలకు పాల్పడే సెంటర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ప్రభుత్వ హాస్పిటల్స్‌లో సంతాన సాఫల్య వైద్య సేవల విస్తరణ, ప్రైవేట్ ఫర్టిలిటీ సెంటర్ల నియంత్రణపై ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో మంత్రి శుక్రవారం, సెక్రటేరియట్‌లో సమీక్ష చేశారు. గాంధీ, పెట్లబుర్జులో హాస్పిటళ్లలో 2024లో ప్రారంభించిన ఐవీఎఫ్ సెంటర్ల పనితీరుపై మంత్రి ఆరా తీశారు. ఈ రెండు సెంటర్లు సత్ఫలితాలు ఇస్తున్నాయని అధికారులు మంత్రికి వివరించారు. రెండు సెంటర్లలో కలిపి ఇప్పటివరకూ సుమారు 37,300 మంది పేషెంట్లకు ఫర్టిలిటీ వైద్య సేవలు అందించామని తెలిపారు. ఈ సెంటర్లలో ఐవీఎఫ్ చేయించుకున్న 23 మందికి ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయిందని అధికారులు వెల్లడించారు. మొత్తం 510 మంది పేషెంట్లకు ఐయూఐ చేశామని, మరో 490 జంటలకు ఐవీఎఫ్ చికిత్స కొనసాగుతోందన్నారు. జిల్లాల్లోనూ ఫర్టిలిటీ వైద్య సేవలు విస్తరించడంపై అధికారులకు మంత్రి దిశానిర్దేశం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ హాస్పిటళ్లలో ఎంతో అనుభవం, నైపుణ్యం కలిగిన గైనకాలజిస్టులు పనిచేస్తున్నారని మంత్రి గుర్తు చేశారు. వారి అనుభవం, నైపుణ్యం అవసరమైన పేషెంట్లకు ఉపయోగపడేలా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు.
మెటర్నల్ సర్వీసులకే పరిమితం కావద్దు
గైనకాలజిస్టులను మెటర్నల్ సర్వీసులకే పరిమితం చేయకుండా, వారి ఆసక్తిని బట్టి వారంలో కనీసం ఒకరోజు ఫర్టిలిటి ఓపీ క్లినిక్ నిర్వహించాలని మంత్రి అధికారులకు సూచించారు. ఇన్‌ఫర్టిలిటీ సమస్యలకు కారణాలపై యువతకు అవగాహన కల్పించే కార్యక్రమాలు కూడా చేపట్టాలన్నారు. గాంధీ, పెట్లబుర్జు తరహాలోనే జిల్లాల్లోనూ దశలవారీగా ఐవీఎఫ్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నట్టు మంత్రి వెల్లడించారు. ఇందుకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఉన్న ఫర్టిలిటీ సెంటర్ల వివరాలు, ఆయా సెంటర్ల కార్యకలాపాలు, అధికారులు చేపట్టిన తనిఖీల వివరాలను హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ సంగీత సత్యనారాయణ మంత్రికి వివరించారు. రాష్ట్రంలో మొత్తం 464 ఫర్టిలిటీ సెంటర్లు ఉన్నాయని, ఇందులో 60 సెంటర్లకు నోటిసులు ఇచ్చామని వెల్లడించారు. తీవ్ర ఉల్లంఘనలకు పాల్పడిన 2 సెంటర్ల లైసెన్స్‌లను పర్మినెంట్‌గా రద్దు చేశామని, మరో 9 సెంటర్ల లైసెన్స్‌లను సస్పెండ్ చేశామని తెలిపారు. ప్రైవేట్ ఫర్టిలిటీ సెంటర్లలో పారదర్శకత, ప్రమాణాల అమలుపై కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సృష్టి ఫర్టిలిటీ సెంటర్‌లో జరిగినటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠినంగా వ్యవహరించాలని సూచించారు. నెలకు కనీసం ఒక్కసారైన ప్రతి ఫర్టిలిటీ సెంటర్‌లో తనిఖీలు చేయాలని ఆదేశించారు. నిబంధనలు అతిక్రమించినా, అనైతిక చర్యలకు పాల్పడినా, పేషెంట్లను అడ్డగోలుగా దోపిడీకి గురి చేసినా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. పేషెంట్లకు ఇస్తున్న మెడిసిన్, ఇంజక్షన్లు, వాటి తయారీ కంపెనీలు, ఎంఆర్‌పీ తదితర అంశాలను కూడా క్షుణ్ణంగా పరిశీలించాలని మంత్రి సూచించారు. ప్రైవేటు సెంటర్ల నుంచి ప్రతి రిపోర్టులను తీసుకోవాలని, పోర్టల్‌లో వివరాలు అప్‌లోడ్ చేయని సెంటర్లపై చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. ఈ సమావేశంలో ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టినా జడ్ చొంగ్తు, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ సంగీత సత్యనారాయణ, అసిస్టెంట్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ అండ్ సరోగసి స్టేట్ సూపర్‌వైజరీ బోర్డు సభ్యులు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.






