మే 18 నుండి 23 వ‌ర‌కు రాష్ట్ర వ్యాప్తంగా పర్యాటక వారోత్సవాలు

by Naga Rani Yarlagadda |

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మక 'ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక'లో భాగంగా మే 18 నుంచి 23 వరకు తెలంగాణ వ్యాప్తంగా పర్యాటక వారోత్సవాలను నిర్వహించనున్నారు.

మే 18 నుండి 23 వ‌ర‌కు రాష్ట్ర వ్యాప్తంగా పర్యాటక వారోత్సవాలు
X
  • బ్రోచర్‌ను ఆవిష్కరించిన పర్యాటక మంత్రి జూపల్లి కృష్ణారావు
  • 23 న పర్యాటక సదస్సు (టూరిజం కాన్క్లేవ్) - 2026

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మక 'ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక'లో భాగంగా మే 18 నుంచి 23 వరకు తెలంగాణ వ్యాప్తంగా పర్యాటక వారోత్సవాలను నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన ప్రత్యేక బ్రోచర్‌ను సచివాలయంలో పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పర్యాటక, భాషా సాంస్కృతిక, పురావస్తు శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వాణి ప్రసాద్, పర్యాటక శాఖ డైరెక్టర్ లక్ష్మణ్ రంజిత్ నాయక్ పాల్గొన్నారు. అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవాన్ని పురస్కరించుకుని మే 18న హైదరాబాద్‌లోని స్టేట్ మ్యూజియంలో మంత్రి జూపల్లి ఈ పర్యాటక వారోత్సవాలను ఘ‌నంగా ప్రారంభించనున్నారు.

పర్యాటక రంగానికి అపారమైన అవకాశాలు

ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. తెలంగాణలో పర్యాటక రంగానికి ఉన్న అపారమైన అవకాశాలను ప్రపంచానికి చాటిచెప్పేందుకు ఈ వారోత్సవాలు దోహదపడతాయని పేర్కొన్నారు. రాష్ట్రంలోని చారిత్రక వారసత్వ సంపద, సంస్కృతి, ఎకో-టూరిజం ప్రదేశాలను ప్రమోట్ చేయడంతో పాటు, పర్యాటక రంగం ద్వారా లభించే ఉపాధి అవకాశాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని చెప్పారు. భాషా సాంస్కృతిక శాఖ, పురావస్తు (హెరిటేజ్) శాఖ, నిథమ్ సంస్థల సమన్వయంతో పర్యాటక శాఖ ఈ ఉత్సవాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోందని తెలిపారు. వారోత్సవాల్లో భాగంగా హెరిటేజ్ వాక్‌లు, పర్యాటక అవగాహన సదస్సులు, ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో స్వచ్ఛత కార్యక్రమాలు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్లతో సమావేశాలు, జిల్లా స్థాయిల్లో ప్రత్యేక ప్రచార కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు వివరించారు.

విదేశీయులను ఆకర్షిస్తున్న ప్రాంతాలు

ప్రపంచ ప్రసిద్ధ రామప్ప దేవాలయం, నాగార్జునసాగర్, బుద్ధవనం, ఆలంపూర్ జోగులాంబ ఆలయం, లక్నవరం చెరువు, బొగత జలపాతం, పైగా సమాధులు, రేమండ్స్ టూంబ్స్, గన్‌ఫౌండ్రీ, ఖజానా బిల్డింగ్, పానగల్ మ్యూజియంతో పాటు వరంగల్‌లోని చారిత్రక కట్టడాలు స్వదేశీ, విదేశీ పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయని కొనియాడారు. కార్యాచరణ ప్రణాళికలో భాగంగా హైదరాబాద్‌లోని రవీంద్రభారతితో పాటు అన్ని జిల్లా కేంద్రాల్లో తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలు ప్రతిబింబించేలా జానపద క‌ళా ప్రదర్శనలు, పేరిణి, శాస్త్రీయ నృత్యాలు, సాహిత్య కార్యక్రమాలు, సంగీత కచేరీలు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు.

పర్యాటక సదస్సు

మే 23న హైదరాబాద్‌లో "డెస్టినేషన్ తెలంగాణ‌: స్ట్రాటజీస్ ఫర్ ది నెక్ట్స్ ఫ్రంటియర్ ఆఫ్ టూరిజం" అనే ఇతివృత్తంతో 'పర్యాటక సదస్సు (టూరిజం కాన్క్లేవ్) - 2026' నిర్వహించనున్నట్లు మంత్రి వెల్లడించారు. ఈ సదస్సులో పర్యాటక రంగ భాగస్వాములు, హాస్పిటాలిటీ నిపుణులు, విధాన నిర్ణేతలు పాల్గొని తెలంగాణను దేశంలోనే అగ్రగామి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన భవిష్యత్తు వ్యూహాలపై చర్చించనున్నారని వివరించారు.

Next Story