డ్రగ్స్ మాఫియా ఉగ్రవాదుల కంటే ప్రమాదకరం : డీజీపీ సీవీ ఆనంద్‌

by Naga Rani Yarlagadda |

రాష్ట్రంలో మాదకద్రవ్యాల డ్రగ్స్ మహమ్మారిని కూకటివేళ్లతో పెకిలించడమే లక్ష్యంగా పోలీస్ శాఖ పనిచేస్తోందన్నారు.

డ్రగ్స్ మాఫియా ఉగ్రవాదుల కంటే ప్రమాదకరం : డీజీపీ సీవీ ఆనంద్‌
X
  • 2029 నాటికి డ్రగ్స్ రహిత తెలంగాణే లక్ష్యం
  • హోంగార్డు నుంచి డీజీపీ వరకు ఇది అందరి బాధ్యత

దిశ,తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో మాదకద్రవ్యాల డ్రగ్స్ మహమ్మారిని కూకటివేళ్లతో పెకిలించడమే లక్ష్యంగా పోలీస్ శాఖ పనిచేస్తోందని, 2029 డిసెంబర్ నాటికి తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రం గా తీర్చిదిద్దుతామని డీజీపీ సి.వి. ఆనంద్ స్పష్టం చేశారు. మత్తు మందుల అక్రమ రవాణా, విక్రయాలకు పాల్పడే వారిని అత్యంత ప్రమాదకర నేరస్థులుగా పరిగణిస్తామని హెచ్చరించారు. సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించిన ఆయన.. మణుగూరులో నూతన పోలీస్ స్టేషన్‌ను ప్రారంభించారు. అనంతరం ఆరో బెటాలియన్‌ను సందర్శించి, సాయంత్రం జిల్లా పోలీసు అధికారులతో క్రైమ్ రివ్యూ సమావేశం నిర్వహించారు.

పదేళ్ల నిరీక్షణ ఫలించింది..

మణుగూరు పోలీస్ స్టేషన్ భవనం 2016లో మంజూరైనప్పటికీ, వివిధ కారణాలతో జాప్యం జరిగి దాదాపు 10 ఏళ్ల తర్వాత నేడు పూర్తయింది. ఎస్‌సీసీఎల్, జిల్లా యంత్రాంగం, ప్రజాప్రతినిధులు స్థానిక ప్రజల సహకారంతో ఈ నిర్మాణం పూర్తి కావడం పట్ల డీజీపీ హర్షం వ్యక్తం చేశారు. ప్రజల సహకారంతో నిర్మించిన ఈ స్టేషన్‌ను ప్రజలకే అంకితం చేస్తున్నాం. పోలీసింగ్‌లో సాంకేతికతను జోడించి వేగవంతమైన, పారదర్శకమైన సేవలు అందించడమే మా ప్రాధాన్యత అని ఆయన పేర్కొన్నారు. భావితరాలను డ్రగ్స్ బారిన పడకుండా కాపాడటంలో తల్లిదండ్రులు, విద్యాసంస్థలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

డ్రగ్స్ మాఫియాపై ఈగల్ పంజా..

డ్రగ్స్ సరఫరా చేసే నెట్‌వర్క్‌ను ఛేదించేందుకు ఈగల్ విభాగం దేశవ్యాప్తంగా నిఘా పెట్టింది. ఈ మధ్యలో డ్రగ్స్ మూలాలు వెలికితీసేందుకు, నిందితులను అరెస్ట్ చేసేందుకు థాయిలాండ్ వెళ్లేందుకు కూడా ఈగల్ బృందాలకు అనుమతి లభించింది అని వెల్లడించారు. సరిహద్దు జిల్లాలు కావడంతో భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మంలలో డ్రగ్స్ నియంత్రణ రాష్ట్రానికే అత్యంత కీలకమని ఆయన విశ్లేషించారు. బస్ స్టాండ్లు, చెక్‌పోస్టులు, రైల్వే స్టేషన్లలో డాగ్ స్క్వాడ్‌లతో తనిఖీలను ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు.

దర్యాప్తు వేగవంతం.. కన్విక్షన్ రేటు పెరగాలి..

క్రైమ్ రివ్యూ సమావేశంలో జిల్లా పోలీసుల పనితీరును డీజీపీ అభినందించారు. కేసుల దర్యాప్తును వేగవంతం చేసి నిందితులకు శిక్షలు పడేలా కన్విక్షన్ రేటు చూడాలన్నారు. సీసీటీఎన్‌ఎస్ లో పూర్తి స్థాయిలో డేటా అప్‌లోడ్ చేయాలని, సైబర్ నేరాలు, మహిళల భద్రత, రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఆరో బెటాలియన్ పరిశీలన సందర్భంగా రాష్ట్ర విపత్తు స్పందన దళం పనితీరుపై పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమాలలో పాల్వంచ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్, మల్టీజోన్1 ఐజీ చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ అంకిత్, ఎస్పీ రోహిత్ రాజ్, బెటాలియన్ కమాండెంట్ పి.సి.వి. రమణ, అసిస్టెంట్ కమాండెంట్లు హెచ్. అబ్దుల్ రషీద్, కె. శంకర్, మరియదాసు, రమణయ్య ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Next Story