తెలంగాణ స్టూడెంట్స్ అలర్ట్.. ఈ-పాస్ అప్లికేషన్లకు చివరి తేదీ మారింది!

by Ramesh Naini |

తెలంగాణ రాష్ట్రంలో 2025-26 విద్యా సంవత్సరానికి గానూ పోస్ట్-మెట్రిక్ స్కాలర్‌షిప్‌ల (ఫ్రెష్, రెన్యూవల్) దరఖాస్తు గడువును ఈ నెల 31వ తేదీ వరకు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

తెలంగాణ స్టూడెంట్స్ అలర్ట్.. ఈ-పాస్ అప్లికేషన్లకు చివరి తేదీ మారింది!
X

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ రాష్ట్రంలో 2025-26 విద్యా సంవత్సరానికి గానూ పోస్ట్-మెట్రిక్ స్కాలర్‌షిప్‌ల (ఫ్రెష్, రెన్యూవల్) దరఖాస్తు గడువును ఈ నెల 31వ తేదీ వరకు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏప్రిల్ 20తో ముగిసిన ఈ గడువును, సాంకేతిక కారణాల వల్ల దరఖాస్తు చేసుకోలేకపోయిన విద్యార్థుల సౌకర్యార్థం మే 31 వరకు పొడిగిస్తున్నట్లు వెల్లడించింది. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీ, దివ్యాంగ విద్యార్థులకు పారదర్శకంగా స్కాలర్‌షిప్‌లు అందించేందుకు ప్రభుత్వం ఈ-పాస్ పోర్టల్‌ను నిర్వహిస్తోంది. గతేడాది 10,89,265 మంది విద్యార్థులు దీంట్లో నమోదు చేసుకోగా, ఈ ఏడాది ఇప్పటివరకు 10,20,688 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. ఇంకా దాదాపు 68,597 మంది విద్యార్థులు చేసుకోలేదని షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ కమిషనర్ తెలిపారు.

కాళోజీ నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం నిర్వహిస్తున్న నర్సింగ్, పారామెడికల్ పీజీ కోర్సుల డేటా ఇంకా ఈ-పాస్ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ కాకపోవడం, ఏప్రిల్ మొదటి వారంలో మీ-సేవ పోర్టల్‌లో సాంకేతిక లోపాలు తలెత్తడం, ఎస్ఎస్‌సీ పోర్టల్ అప్‌డేట్స్ కారణంగా డేటా బదిలీలో ఆలస్యం జరగడం, ఐడెంటిటీ కార్డు, ఆధార్, ఎస్ఎస్‌సీ వివరాల మధ్య సరిపోలిక లేకపోవడం, ఇతర అప్‌డేట్ సమస్యలు తలెత్తడం వంటి కారణాల అందరు విద్యార్థులు దరఖాస్తు చేసుకోలేకపోయారని అధికారులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో అర్హులైన ప్రతి విద్యార్థికీ న్యాయం చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ గడువును పొడిగించింది. విద్యార్థులతో పాటు సంబంధిత కళాశాలల యాజమాన్యాలు, రెగ్యులేటరీ అధికారులు సమన్వయం చేసుకుని మే 31 లోగా డేటా అప్‌లోడ్ ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. అర్హులైన విద్యార్థులందరూ దరఖాస్తు చేసుకునేలా చూడాలని ప్రభుత్వం ఆదేశించింది.

Next Story