- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రపంచ దేశాలతో తెలంగాణ రాష్ట్రం పోటీ పడాలి: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క
ప్రపంచ దేశాలతో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో పోటీ పడే విధంగా ఎదగాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు.

దిశ, షాద్ నగర్: ప్రపంచ దేశాలతో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో పోటీ పడే విధంగా ఎదగాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. రంగారెడ్డి జిల్లా మొగలిగిద్ద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 150 సంవత్సరాల ఉత్సవాలకు శుక్రవారం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో భట్టి విక్రమార్క మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం సర్వతో ముఖంగా ఎదగాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్యం, ఉపాధి పై ప్రత్యేక దృష్టిని పెట్టిందని తెలిపారు. రాష్ట్రంలో పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలనే సంకల్పంతో అత్యాధునిక సౌకర్యాలతో రూ. 22 వేల 500 కోట్ల రూపాయలతో 100 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలలను నిర్మిస్తున్నామని తెలిపారు.
ప్రతి ఒక్క అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక్కొక్క పాఠశాలను 25 ఎకరాల ప్రాంగణంలో రూ.200 కోట్ల రూపాయలతో అత్యాధునిక సౌకర్యాలతో రూపకల్పన చేసి నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేసి పరిశ్రమల యజమాన్యాలకు అవసరమైన విధంగా నిరుద్యోగ యువతకు శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు యూనిఫాం, పుస్తకాలు, సన్న బియ్యంతో మధ్యాహ్న భోజనాన్ని అందిస్తున్నామని, దేవుడు సహకరిస్తే ఆర్థిక పరిస్థితి బాగుపడితే ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ఉదయం అల్పాహారాన్ని అందిస్తామని అన్నారు. ఇప్పటికే కొన్ని పాఠశాలలో పైలెట్ ప్రాజెక్టుగా మొదలుపెట్టామని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 40% డైట్ చార్జీలను, 200 శాతం కాస్మోటిక్ చార్జీలను పెంచామని తెలిపారు.
ప్రతి నియోజకవర్గం,జిల్లా కేంద్రాలలో అత్యాధునిక వసతులతో వైద్యశాలలను ఏర్పాటు చేస్తున్నామని, విద్య, వైద్యం ప్రజలకు అందుబాటులో ఉంటే రాష్ట్రం అద్భుతంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. రాష్ట్రంలో ఉన్న మహిళలందరినీ మహాలక్ష్మి లుగా గౌరవించుకోవాలని అర్హులైన ప్రతి మహిళకు నాణ్యమైన ఇందిరమ్మ చీరలను అందించామని తెలిపారు. రాష్ట్రంలో ఉన్న మహిళా గ్రూపులకు రూ. 27 వేలకోట్ల వడ్డీరేని రుణాలను పంపిణీ చేశామని ఇది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ నిబద్ధత అని బట్టి విక్రమార్క అన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేసి లక్ష్మీదేవి పల్లి రిజర్వాయర్ తో సాగు, తాగు నీళ్లు అందించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి, క్యాబినెట్ మంత్రులు దృఢమైన నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. మొగలిగిద్ద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 150 సంవత్సరాల వార్షికోత్సవ ప్రారంభోత్సవంలో గత సంవత్సరం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని పాఠశాల అభివృద్ధి కోసం కేటాయించిన రూ. 10 కోట్ల తో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, అలాగే పాఠశాలలో హైదరాబాద్ స్టేట్ ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు పేర బూర్గుల మెమోరియల్ ఏర్పాటు చేయాలని కోరారు.
బూర్గుల తీసుకువచ్చిన చట్టాలను ఇక్కడ ప్రదర్శన చేస్తే నేటి సమాజానికి తెలియజేసిన వారమవుతామని అన్నారు. అలాగే పాఠశాలలో గ్రంథాలయం ఏర్పాటుకు ప్రతిపాదనలను పంపిస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి తో మాట్లాడి నిధులను మంజూరి చేయిస్తానని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అన్నారు. అంతకుముందు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ గత ప్రధాన మంత్రులు జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ తీసుకువచ్చిన పంచవర్ష ప్రణాళికలతో నేడు దేశం అన్ని రంగాలలో అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని అన్నారు. చరిత్ర ఎప్పుడు ప్రస్తుతానికి కులమానమని, భవిష్యత్తుకు మార్గదర్శకమని మొగిలిగిద్ద పాఠశాల 150వ వార్షికోత్సవంలో పాల్గొనడం ఆనందంగా ఉందని తెలిపారు. విద్యతోనే వ్యక్తికి, కుటుంబానికి సమాజంలో పేరు వస్తుందని, నేడు తల్లిదండ్రులు తమ పిల్లలకు స్థిర చరాస్తుల కంటే విద్యను అందించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు.
అనంతరం షాద్ నగర్ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ హైదరాబాద్ స్టేట్ ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి, ఉత్తరప్రదేశ్ మాజీ గవర్నర్ సత్యనారాయణ రెడ్డి వంటి ఇద్దరు మహామహులు విద్యను అభ్యసించిన గొప్ప పాఠశాల మొగిలిగిద్ద పాఠశాలని అన్నారు. ఇలాంటి చారిత్రాత్మక పాఠశాలను గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో మొగుడికిద్ద గ్రామాన్ని దత్తత తీసుకొని దరిద్రం పట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఎమ్మెల్యేగా విజయం సాధించిన అనంతరం పాఠశాల సందర్శనకు వస్తే కనీసం విద్యార్థులకు, ఉపాధ్యాయులకు అవసరమైన మౌలిక వసతులు సైతం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
స్థానిక నాయకులతో కలిసి పాఠశాలలో మౌలిక వసతులను కల్పించడం జరిగిందని అన్నారు. పాఠశాల 150వ వార్షికోత్సవాలలో పాల్గొన్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాఠశాల నూతన భవన నిర్మాణం కోసం, గ్రామంలో రహదారుల అభివృద్ధి కోసం భారీగా నిధులను మంజూరు చేశారని వీర్లపల్లి శంకర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మొగిలిగిద్ద గ్రామ సర్పంచ్ ఎశమోని కృష్ణయ్య, పాఠశాల పూర్వ విద్యార్థి ఉస్మానియా, సెంట్రల్ యూనివర్సిటీ విశ్రాంత ప్రొఫెసర్, పౌర హక్కుల సంఘం నాయకుడు హరగోపాల్, విద్యాశాఖ జైన్ డైరెక్టర్ సోమిరెడ్డి, రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి, డీఈవో సుశింద్రరావు, షాద్ నగర్ ఆర్డీవో సరిత, ఫరుఖ్ నగర్ తహసిల్దార్ నాగయ్య, ఎంఈఓ మనోహర్, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ బండారి సంతోషి,పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శేఖర్ రెడ్డి, గ్రామస్తులు, మహిళా సంఘాలు, పూర్వ విద్యార్థులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
కస్తూరిబా పాఠశాలను పరిశీలించిన మంత్రులు..
మొగిలిగిద్ద ప్రభుత్వ పాఠశాల 150 వసంతాల కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ శుక్రవారం అకస్మాత్తుగా మొగలిగిద్ద కస్తూరిబా గాంధీ బాలికల వసతిగృహాన్ని సందర్శించారు. పాఠశాలలో, వసతి గృహంలో సౌకర్యాలను విద్యార్థినీలను అడిగి మంత్రులు తెలుసుకున్నారు. విద్యార్థినీలతో కలిసి మంత్రులు వసతి గృహంలోనే మధ్యాహ్న భోజనం చేశారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విద్యార్థినీలతో మాట్లాడుతూ పాఠశాల ఎలా ఉంది, భోజన వసతులు ఎలా ఉంది అంటూ విద్యార్థులకు అందుతున్న వసతులను అడిగి తెలుసుకున్నారు. లక్ష్యంతో ప్రస్తుతం పాఠశాలలో చదువుకుంటున్నారు, పెద్దయ్యాక ఏం చేయాలనుకుంటున్నారు, ఆ కోరికను సాధించేందుకు ఎలాంటి ప్రణాళికలు మీ వద్ద ఉన్నాయి అంటూ మంత్రులు విద్యార్థినిలను అడిగి తెలుసుకున్నారు. వసతి గృహంలో బోధన, బోధ నేతర అంశాలపై సిబ్బందిని ప్రశ్నించి పలు విషయాలను మంత్రులు ఆరా తీశారు.






