Congress vs BRS: స్టేట్ పాలిటిక్స్ ఢిల్లీకి షిఫ్ట్.. ఓవైపు సీఎం రేవంత్.. మరోవైపు కేటీఆర్!

by Prasad Jukanti |

తెలంగాణలో తాజా రాజకీయ పరిణామాలు ఉత్కంఠ రేపుతున్నాయి.

Congress vs BRS:  స్టేట్ పాలిటిక్స్ ఢిల్లీకి షిఫ్ట్.. ఓవైపు సీఎం రేవంత్.. మరోవైపు కేటీఆర్!
X

దిశ, డైనమిక్ బ్యూరో : తెలంగాణ రాజకీయాలు మరోసారి ఢిల్లీకి చేరాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఇప్పటికే ఢిల్లీకి చేరుకోగా ఇవాళ సీఎల్పీ మీటింగ్ సమావేశం అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) సైతం ఢిల్లీకి పయనమవుతున్నారు. ఇలా ఇద్దరు నేతలు ఢిల్లీ బాట (Delhi Tour) పట్టడంతో తెలంగాణ పాలిటిక్స్ హస్తినకు చేరాయి. సీఎం ఇవాళ సాయంత్రం ఢిల్లీకి బయలుదేరి వెళ్లి ఏఐసీసీ టాప్ లీటర్లు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్‌తో భేటీ కానున్నట్లు సమాచారం. రాష్ట్రంలో నిర్వహించిన కులగణన, ఎస్సీ వర్గీకరణ వివరాలను వివరించబోతున్నట్లు తెలుస్తోంది. సీఎంతో పాటు డిప్యూటీ సీఎం, పీసీసీ చీఫ్ కూడా వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలు, టీ కాంగ్రెస్‌ (Congress) లో ఎమ్మెల్యేల రహస్య భేటీ, పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో సుప్రీంకోర్టు నిర్ణయం.. తదితర అంశాలతోపాటు త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలలు, మంత్రివర్గ విస్తరణ జరగాల్సిన నేపథ్యంలో సీఎం టూర్ ప్రాధాన్యం సంతరించుకుంది.

కేటీఆర్ టూర్‌పై ఉత్కంఠ..

పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో బీఆర్ఎస్ లీగల్ ఫైట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈకేసు సుప్రీంకోర్టులో ఫిబ్రవరి 10కి వాయిదా పడింది. ఎమ్మెల్యేలకు నోటీసులు వెళ్లిన నేపథ్యంలో ఇవాళ కేటీఆర్ ఢిల్లీ పర్యటన ఆసస్తిని రేపుతున్నది. ఈ కేసులో అక్కడ న్యాయనిపుణులతో చర్చించేందుకు ఆయన ఢిల్లీ వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ పర్యటనలో భాగంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, నితిన్ గడ్కరీలను కలిసి పలు సమస్యలను వారి దృష్టికి తీసుకువెళ్లబోతున్నట్లు తెలుస్తోంది. కేటీఆర్ కేంద్రమంత్రులతో భేటీ వెనుక మతలబు ఏంటనే చర్చ మొదలైంది.

సీఎల్పీ భేటీ..

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సీఎల్పీ (CLP meeting) సమావేశం మొదలైంది. హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి కేంద్రంలో జరుగుతున్న ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, దీపా దాస్‌ మున్షీ, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌, మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఇటీవల ప్రారంభించిన ప్రతిష్టాత్మక పథకాలు, నిర్ణయాలతోపాటు బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ అంశాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడం, స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్యాచరణపై సీఎం దిశానిర్దేశం చేస్తున్నట్టు సమాచారం. అలాగే బీసీ, ఎస్సీ వర్గీకరణపై రెండు బహిరంగ సభలు పెట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ సభలకు రాహుల్ గాంధీ, ఖర్గేను ఆహ్వానించాలని నిర్ణయించినట్లు సమాచారం.

ఆ 10 మంది ఎమ్మెల్యేలు దూరం..

కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సీఎల్పీ సమావేశానికి పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలు దూరంగా ఉన్నారు. ప్రస్తుతం పార్టీ ఫిరాయింపుల అంశం సుప్రీంకోర్టు పరిధిలో ఉండటం, శాసనసభ కార్యదర్శి నుంచి నోటీసులు వచ్చిన నేపథ్యంలో వివాదాన్ని మరింత జఠిలం చేసుకోకుండా సీఎల్పీ సమావేశానికి హాజరుకావడం మంచిది కాదనే అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

Next Story