దద్దరిల్లిన ట్యాంక్ బండ్.. అట్టహాసంగా ముగిసిన తెలంగాణ స్టేట్ ఫార్మేషన్ డే సెలబ్రేషన్స్..!

by Satheesh |

రాష్ట్ర అవతరణ దశాబ్ది ముగింపు ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం టాంక్‌బండ్‌పై ఆదివారం సాయంత్రం ఏర్పాటు చేసిన

దద్దరిల్లిన ట్యాంక్ బండ్.. అట్టహాసంగా ముగిసిన తెలంగాణ స్టేట్ ఫార్మేషన్ డే సెలబ్రేషన్స్..!
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర అవతరణ దశాబ్ది ముగింపు ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం టాంక్‌బండ్‌పై ఆదివారం సాయంత్రం ఏర్పాటు చేసిన సాంస్కృతిక కళా ప్రదర్శనలు అంబరాన్నంటాయి. దాదాపు 700 మంది కళాకారులు 17 రకాల సాంస్కృతిక ప్రదర్శనలు ఇచ్చారు. రాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్ చీఫ్ గెస్ట్‌గా హాజరై దాదాపు రెండు గంటల పాటు వేదికపైనే ఉన్నారు. అందెశ్రీ రాసిన జయ జయహే తెలంగాణ లాంగ్ వర్షన్ (13.30 నిమిషాల) గేయాన్ని లాంఛనంగా ఈ వేదిక మీద ఆవిష్కరించారు. ఆ పాట పాడుతున్నంతసేపూ దాదాపు 500 మంది ట్రెయినీ పోలీసులు చేతిలో జాతీయ పతాకాన్ని పట్టుకుని టాంక్‌బండ్ రోడ్డుపై ఒక చివరి నుంచి మరో చివరి వరకు ఫ్లాగ్ మార్చ్ చేశారు. మొత్తం రెండున్నర గంటల పాటు జరిగిన ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి సహా మంత్రులు, అధికారులు వేదిక మీద నుంచి తిలకించారు. ప్రజలు సౌకర్యంగా ఉండేందుకు వీలుగా 16 భారీ ఎల్ఈడీ స్క్రీన్‌లు ఏర్పాటయ్యాయి.

పరేడ్ గ్రౌండ్స్‌లో ఉదయం అధికారికంగా జరిగిన ఫ్లాగ్ మార్చ్, జాతీయ పతాకావిష్కరణ అనంతరం టాంక్‌బండ్‌పై సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి 8.30 గంటల వరకు కంటిన్యూగా అంబరాన్నంటే తీరులో సంబురాలు జరిగాయి. స్వయం సహాయక మహిళా బృందాలు, మెప్మా (పట్టణ పేదరిక నిర్మూలనా విభాగం) మహిళలు ఏర్పాటు చేసిన ఫుడ్ స్టాల్స్, హస్త కళల స్టాల్స్‌ను ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులు సందర్శించారు. టాంక్‌బండ్ వేదిక మీదకు రావడానికి ముందు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు, అధికారులు అక్కడికి సమీపంలో ఉన్న డాక్టర్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గుస్సాడి, కొమ్ముకోయ, పేరిణి, ఒగ్గుడోలు, డప్పుల నృత్యం తదితర కళారూపాలను కళాకారులు ప్రదర్శించారు.

ఉద్యమంకాలం నాటి జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చే పలు గీతాలను, యువతను ఉర్రూతలూగించిన పాటలను, ఉస్మానియా యూనివర్శిటీ విద్యార్థులను ఉత్తేజితులను చేసిన జానపద పాటలను గాయకులు టాంక్‌బండ్ వేదికగా పాడి మరోసారి అప్పటి ఘట్టాలను గుర్తుచేశారు. రాష్ట్ర గీతాన్ని రచించిన అందెశ్రీ, సంగీతం సమకూర్చిన కీరవాణిలను ప్రభుత్వం ఇదే వేదికగా ఘనంగా సన్మానించింది. చివరి నిమిషాల్లో ఆకస్మికంగా వర్షం కురవడంతో కార్యక్రమాన్ని హడావిడిగా ముగించాల్సి వచ్చింది. చీఫ్ గెస్ట్ గవర్నర్ రాధాకృష్ణన్, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సహా పలువురు మంత్రులు, అధికారులు వర్షంలో తడుస్తూనే కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తొలి అమరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. రెండున్నర గంటల పాటు జరిగిన ఈ సంబురాలకు రంగురంగుల ఫైర్ క్రాకర్స్ (బాణసంచా) ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

Next Story