సీపీఐ, టీడీపీ కార్యాలయాల్లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

by Muthe.Rajitha |

రాష్ట్రంలో సీపీఐ, టీడీపీ కార్యాలయాల్లో సోమవారం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.

సీపీఐ, టీడీపీ కార్యాలయాల్లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో సీపీఐ, టీడీపీ కార్యాలయాల్లో సోమవారం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పార్టీ నేతలు జాతీయ జెండాను ఎగురవేశారు. ఎన్‌టిఆర్‌ భవన్‌లో తెలుగుదేశం పార్టీ నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు, మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింహులు జాతీయ జెండాను ఆవిష్కరించారు. మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎన్‌టిఆర్‌ విగ్రహానికి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. బక్కని నర్సింహులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

ప్రజల మనోభావాలకు అనుగుణంగా చంద్రబాబు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా లేఖ ఇచ్చిన విషయాన్ని బక్కని గుర్తు చేశారు. ఆనాడు కేంద్రానికి టీడీపీ కూడా లేఖ ఇవ్వడం వల్లే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియకు ముందుకు వెళ్లిందన్నారు. కానీ తమ అధినేత చంద్రబాబును ఆంధ్రావారిగా ముద్ర వేసి పార్టీని ఇబ్బందులకు గురి చేశారని ఇప్పటికీ బీఆర్​ఎస్​ మాజీ మంత్రి జగదీశ్వర్‌రెడ్డి లాంటి వారు విమర్శులు చేస్తున్నారని, ఇది తమను తీవ్రంగా బాధిస్తోందన్నారు. టీడీపీ ఎల్లప్పుడు వెనుకబడిన వర్గాల పార్టీయే నన్నారు. బడుగు, బలహీనవర్గాలకు మొట్టమొదట 46 ఆశ్రమ పాఠశాలలను ఏర్పాటు చేసింది ఎన్‌టిఆర్‌ నా, లేక బీఆర్‌ఎస్‌ పార్టీనా? కాంగ్రెస్‌ పార్టీనా? ఈ పాఠశాలలను 294 కు పెంచి రాష్ట్ర వ్యాప్తంగా విస్తరింప జేశామన్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ పార్టీ అధికార ప్రతినిధి నన్నూరి నర్సిరెడ్డి, రాష్ట్ర నాయకులు అజ్మీరా రాజునాయక్‌, మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన, తెలుగుదేశం ప్రకాశ్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సీపీఐ కార్యాలయంలో...

సిపిఐ రాష్ట్ర కార్యాలయం మగ్ధూంభవన్‌లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ జాతీయ కార్యదర్శులు డాక్టర్‌ కె.నారాయణ జాతీయ జెండాను ఎగురవేయగా, మాజీ ఎంపీ సయ్యద్‌ అజీజ్‌ పాషా సీపీఐ అరుణ పతాకాన్ని ఎగరువేశారు. డాక్టర్​కే నారాయణ మాట్లాడుతూ మాజీ సిఎం కెసిఆర్‌ నియంత పాలనతో తన కీర్తిని తనే పొగొట్టుకున్నారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర సాధన పేటెడ్‌ రైట్‌ మాత్రం కేసీఆర్​కే దక్కుతుందని కాని ఆయన దానిని ఈ 10 ఏళ్ల కాలంలో నిలబెట్టుకోలేక పోయ్యారని తెలిపారు. రాష్ట్ర సాధన తర్వాత తెలంగాణ ప్రజలు ఏ ఉద్దేశంతో అయితే కెసిఆర్‌కు అధికారం అప్పగించారో దానిని పూర్తి చేయడంలో ఆయన పూర్తిగా విఫలం అయ్యారన్నారు. అంతేకాకుండా గత 10 ఏళ్ల పాలనలో ఆయన ప్రభుత్వాన్ని, పార్టీని పూర్తిగా అప్రజాస్వామిక పద్దుతుల్లో నియంతృత్వ పాలన ను కొనసాగించారని నారాయణ విమర్శించారు.

దేశ చరిత్రలోనే ఫామ్ హౌజ్‌ కే పరిమితమై ప్రభుత్వాన్ని , పార్టీని నడిపిన ఏకైక ముఖ్యమంత్రి కెసిఆర్‌ మాత్రమేనన్నారు. తెలంగాణ ఉద్యమంతో ఆయన సాధించిన కీర్తిని ఆయనే పొగొట్టుకున్నారని పేర్కొన్నారు. ఆయన నియంత ధోరణే చివరికి వారి కుటుంబంలో కల్లోలం లేపేందుకు కారణమవుతోందన్నారు. ఇదే క్రమంలో కెసిఆర్‌ను గద్దె దించి కాంగ్రెస్‌కు ప్రజలు అధికారాన్ని కట్టబెట్టారని, మఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన రేవంత్‌రెడ్డి మాజీ సిఎం కెసిఆర్‌ పాలనను ఓ గుణపాఠంగా తీసుకుని పరిపాలనకొనసాగించాలని సూచించారు. అధికారం చేపట్టే ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను సిఎం రేవంత్‌రెడ్డి పూర్తి చేయాలని నారాయణ తెలిపారు. కాగా భాషాప్రయుక్త రాష్ట్రాలను విడగొట్టవద్దంటూ గతంలో తీసుకున్న నిర్ణయం మేరకు సీపీఐ (ఎం) పార్టీ రాష్ట్ర కార్యాలయం ముందు జాతీయ పతకాన్ని ఎగరువేయక పోవడం గమనార్హం.

Next Story