కేటీఆర్‌ను కలిసిన టీఎస్ఈఏ ప్రతినిధులు

by Naga Rani Yarlagadda |

ప్రభుత్వ పాఠశాలల్లో ఏర్పాటు చేయనున్న రూఫ్‌టాప్ సోలార్ ప్రాజెక్టుల టెండర్ నిబంధనలను సవరించాలని కోరుతూ TSEA ప్రతినిధులు BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను శుక్రవారం కలిశారు.

కేటీఆర్‌ను కలిసిన టీఎస్ఈఏ ప్రతినిధులు
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వ పాఠశాలల్లో ఏర్పాటు చేయనున్న రూఫ్‌టాప్ సోలార్ ప్రాజెక్టుల టెండర్ నిబంధనలను సవరించాలని కోరుతూ తెలంగాణ సోలార్ ఎనర్జీ అసోసియేషన్ (టీఎస్‌ఈఏ) ప్రతినిధులు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను శుక్రవారం కలిశారు. సంఘం అధ్యక్షుడు బుర్ర అశోక్ కుమార్ గౌడ్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం వినతిపత్రం అందజేసింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అమలైన ప్రతిష్ఠాత్మక మన ఊరు-మన బడి కార్యక్రమంలో తెలంగాణకు చెందిన సోలార్ పారిశ్రామికవేత్తలకు సమాన అవకాశాలు కల్పించడంతో స్థానిక సంస్థలు తమ ప్రతిభను చాటుకున్నాయని టీఎస్‌ఈఏ పేర్కొంది. దీంతో రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు చిన్న, మధ్య తరహా సంస్థలు (ఎంఎస్‌ఎంఈలు) సాంకేతిక సామర్థ్యాన్ని నిరూపించుకున్నాయని వెల్లడించింది. అయితే.. ప్రస్తుతం సుమారు 10 వేల ప్రభుత్వ పాఠశాలల్లో 2, 3, 5 కిలోవాట్ల రూఫ్‌టాప్ సోలార్ వ్యవస్థల ఏర్పాటుకు విడుదల చేసిన టెండర్‌లో కనీస వార్షిక టర్నోవర్ రూ.150 కోట్లు, ఒకే సంవత్సరంలో 25 మెగావాట్ల ప్రాజెక్టుల అమలు అనుభవం వంటి నిబంధనలను విధించడం వల్ల తెలంగాణకు చెందిన స్థానిక సోలార్ సంస్థలు పోటీలో నిలవలేని పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేసింది.

గత దశాబ్దంలో రాష్ట్రంలో వార్షిక రూఫ్‌టాప్ సోలార్ ఇన్‌స్టాలేషన్లు చాలా సందర్భాల్లో 20 మెగావాట్లను కూడా మించలేదని, అలాంటి పరిస్థితుల్లో ప్రస్తుత అర్హత ప్రమాణాలు కొద్దిమంది పెద్ద కంపెనీలకు, ముఖ్యంగా రాష్ట్రం వెలుపల ఉన్న సంస్థలకు మాత్రమే ప్రయోజనం చేకూర్చేలా ఉన్నాయని సంఘం అభిప్రాయపడింది. ఇంతకుముందు విడుదలైన పాఠశాల సోలార్ టెండర్లు సైతం రాష్ట్రానికి వెలుపల ఉన్న కంపెనీలకే దక్కాయని, ఏడాది గడిచినా ఆ ప్రాజెక్టుల అమలులో ఆశించిన పురోగతి కనిపించలేదని పేర్కొంది. స్థానిక సంస్థల భాగస్వామ్యాన్ని పెంచాల్సిన సమయంలో కొత్త టెండర్ నిబంధనలు మరింత కఠినంగా మారడం వల్ల తెలంగాణ పారిశ్రామికవేత్తలకు నష్టం జరుగుతున్నదని తెలిపింది. తెలంగాణ ఎంఎస్‌ఎంఈ విధాన స్ఫూర్తికి అనుగుణంగా స్థానిక సంస్థలకు న్యాయమైన అవకాశాలు కల్పించేలా టెండర్ అర్హత ప్రమాణాలను హేతుబద్ధంగా సవరించాలని టీఎస్‌ఈఏ ప్రతినిధులు కేటీఆర్‌ను కోరారు. నాణ్యత ప్రమాణాలను కాపాడుతూనే రాష్ట్రానికి చెందిన అర్హులైన సంస్థలకు పోటీ చేసే అవకాశం కల్పించేందుకు జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో టీఎస్‌ఈఏ జనరల్ సెక్రెటరీ శ్రీహరిబాబు, జాయింట్ సెక్రెటరీలు బాబునాయుడు, శ్రీనివాస్ కుక్కడపు, వైస్ ప్రెసిడెంట్ రాజేష్ పరకాలతోపాటు కార్యవర్గ సభ్యులు బదరి నారాయణ, జాన్ విల్యం, రాఠి తదితరులు పాల్గొన్నారు.

Next Story