వరి ధాన్యం దిగుబడిలో తెలంగాణ రికార్డ్ : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

by Naga Rani Yarlagadda |

రాష్ట్రం ధాన్యం దిగుబడిలో దేశంలోనే సరికొత్త రికార్డు సృష్టించబోతుందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖామంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.

వరి ధాన్యం దిగుబడిలో తెలంగాణ రికార్డ్ : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
X
  • 148 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి
  • 80 లక్షల మెట్రిక్ టన్నుల వరి కొనుగోలుకు ఏర్పాట్లు
  • ధాన్యం నిల్వలకు గిడ్డంగుల కొరత ఆందోళన కలిగిస్తోంది
  • బాయిల్డ్​రైస్​నిల్వలను కేంద్రం ఇతర రాష్ట్రాలకు తరలించాలి : మంత్రి ఉత్తమ్​కుమార్​రెడ్డి

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రం ధాన్యం దిగుబడిలో దేశంలోనే సరికొత్త రికార్డు సృష్టించబోతుందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖామంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. వానాకాలం సీజన్ లో 148 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి ఉంటుందని, దేశ చరిత్రలోనే ఇప్పటి వరకు ఇంతటి దిగుబడి ఎక్కడ నమోదు కాలేదన్నారు. మంగళవారం వానాకాలం ధాన్యం కొనుగోలుపై పౌర సరఫరాల కేంద్ర కార్యాలయంలో కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, డైరెక్టర్ ఇతర అధికారులుసమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నీటిపారుదల విస్తరణతో రాష్ట్రం సాధించిన వృద్ధి ధాన్యం దిగుబడిలో తేలిపోయిందని, రాష్ట్ర వ్యాప్తంగా 67.57 లక్షల ఎకరాలలో జరిగిన వరి సాగులో 40.75 లక్షల ఎకరాలలో సన్నాలు,26.82 లక్షల ఎకరాలలో దొడ్డు వడ్ల సాగు చేశారన్నారు. ఇందులో సన్నాలు 90.46 లక్షల మెట్రిక్ టన్నులు, దొడ్డు రకం 57.84 లక్షల మెట్రిక్ టన్నులు మొత్తం కలిపి 148.30 లక్షల ధాన్యం దిగుబడి అంచనా వేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రం ఆవిర్భావం తరువాత ఇంత పెద్ద ఎత్తున ధాన్యం దిగుబడి అరుదైన రికార్డుగా అభివర్ణించారు. ఎన్నో సవాళ్ళను ఎదుర్కొని అరుదైన రికార్డు నెలకొల్పిన ఘనత తెలంగాణా రైతాంగానికి చెందుతుందన్నారు. అదే సమయంలో కొనుగోళ్లలోను రాష్ట్రం యావత్ భారతదేశానికి మార్గదర్శనంగా నిలుస్తోందని, 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసిందన్నారు. కనిష్ట మద్దతు ధర కింద కొనుగోలు మొత్తానికి రూ.21,112 కోట్ల అవుతున్నట్లు అంచనా వేసినట్లు తెలిపారు. ఇందులో నేరుగా రైతులకు చెల్లింపుల కింద రూ. 19,112 కోట్లు ఖర్చు కానున్నట్లు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం బియ్యం సబ్సిడీ నిమిత్తం చెల్లించాల్సిన రూ. 6,500 కోట్లు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కొనుగోలు చేసిన ధాన్యానికి చెల్లింపులలో ఆలస్యం కాకుండా చూడాలనేది తమ ప్రభుత్వ సంకల్పమన్నారు. తాము అధికారం చేపట్టిన తరువాత సన్నాలు పండించిన రైతులకు రూ. 500 బోనస్ ను పంపిణీ చేస్తున్నట్లు, ఈ వానాకాలం, యాసంగి పంటలకు రైతులకు బోనస్ రూ. 3,159 కోట్లు అవసరం ఉందన్నారు.

అంతర్జాతీయ స్ధాయిలో సన్నాలకు డిమాండ్​

రాష్ట్రంలో పండిస్తున్న సన్నాలకు అంతర్జాతీయ స్థాయిలో అధిక డిమాండ్ పలుకుతుందని, ఇప్పటికే ఫిలిప్పిన్ దేశంతో అనేక దేశాలకు ఎగుమతి అవుతుందన్నారు. రికార్డు స్థాయిలో ధాన్యం దిగుబడితో కొనుగోలు చేసిన ధాన్యాన్ని నిల్వలకు గిడ్డంగుల కొరత ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. భారత ఆహార సంస్థ అద్వర్యంలోని గిడ్డంగులు 22.61 లక్షల మెట్రిక్ టన్నుల సామర్ధ్యం ఉండగా ఇప్పటికే 21.72 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వలు ఉన్నాయని, కేవలం 0.89 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వకు మాత్రమే ఖాళీగా ఉందన్నారు. ప్రస్తుతం 20 లక్షల మెట్రిక్ టన్నుల బాయిల్డ్ రైస్ ను వినియోగించే రాష్ట్రాలకు రవాణా చేయక పోవడంతో ఎఫ్. సి.ఐ గిడ్డంగులలో అవి పేరుకపోయాయన్నారు. దీనితో వానాకాలం కొనుగోలు చేసిన ధాన్యాన్ని నిలువ ఉంచేందుకు స్థలం కొరవడిందన్నారు. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని బాయిల్డ్ రైస్ ను వినియోగించే రాష్ట్రాలకు సత్వరమే తరలించాలని కోరారు. స్థాక్ తరలింపుకు ఆదనపు రైళ్లను కేటాయించాలని,కేంద్రం ఈ విషయంలో జోక్యం చేసుకొని సహకరించని పక్షంలో ధాన్యం కొనుగోలులో ఉత్పన్నమయ్యే పరిస్థితులకు కేంద్రం బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ధాన్యం దిగుబడిలో తెలంగాణ సాధించిన రికార్డును కేంద్రం గుర్తించి సహకరించాలని కోరారు. 2019-20 లో 72 లక్షల మెట్రిక్ టన్నుల నుండి 2025-26 నాటికి ఏకంగా 148.30 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడికి చేరిందన్నారు. ఇది నీటిపారుదల శాఖా సాధించిన విజయానికి సంకేతమని, బలమైన సంకల్పంతో పాటు ఆధునిక పద్దతిలో కొనుగోళ్లు జరపడం రైతాంగానికి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన భరోసే కారణామన్నారు. కొనుగోళ్ల అంశంలో అధికారులు ఎఫ్ సీఐతో సమన్వయం చేసుకుని ప్రణాళికలు రూపొందించు కోవాలని అధికారులను ఆదేశించారు.

Next Story