- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎగుమతుల్లో తెలంగాణ రికార్డు: దేశంలోనే 7వ పెద్ద రాష్ట్రంగా అవతరణ
తెలంగాణ ఎగుమతుల రంగంలో దూసుకుపోతోంది. ఆర్బీఐ నివేదిక ప్రకారం ఏడాదిలోనే 5 వేల మిలియన్ డాలర్ల వృద్ధిని సాధించి దేశంలో 7వ స్థానంలో నిలిచింది.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రం ఎగుమతుల రంగంలో దుమ్మురేపింది. గణనీయమైన వృద్ధిని సాధిస్తూ దేశంలో కీలకమైన స్థానాన్ని సంపాదించుకున్నది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) తాజాగా విడుదల చేసిన హ్యాండ్ బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఆన్ ఇండియన్ స్టేట్స్ 2024-25 నివేదిక ప్రకారం.. తెలంగాణ ఎగుమతుల విలువ ఒక్క ఏడాదిలోనే 5 వేల మిలియన్ డాలర్లకుపైగా పెరిగింది. ఇది రాష్ట్ర ఆర్థిక బలాన్ని, పరిశ్రమల సామర్థ్యాన్ని స్పష్టంగా చూపిస్తున్నది. ఆర్‌బీఐ గణాంకాల ప్రకారం 2023-24 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ నుంచి జరిగిన మొత్తం ఎగుమతుల విలువ 14,026 మిలియన్ డాలర్లు కాగా, 2024-25 నాటికి అది 19,123 మిలియన్ డాలర్లకు చేరింది. కేవలం ఒక ఏడాదిలోనే దాదాపు 36 శాతం వృద్ధి నమోదైంది. ఈ పెరుగుదలతో దేశవ్యాప్తంగా ఎక్కువ ఎగుమతులు చేసే రాష్ట్రాల జాబితాలో తెలంగాణకు ఏడో స్థానం లభించింది. ఇది రాష్ట్రానికి ఒక ముఖ్యమైన మైలురాయి అని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఫార్మా, ఐటీ రంగాలకే పరిమితం కాకుండా..
ఐటీ, ఫార్మాస్యూటికల్ రంగాలు ఈ విజయానికి కారణంగా నిలిచాయి. రాష్ట్రం నుంచి ఎక్కువగా డ్రగ్ ఫార్ములేషన్లు, బల్క్ డ్రగ్స్, యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రిడియెంట్స్, సాఫ్ట్‌వేర్ ఉత్పత్తులు, ఐటీ సేవలు విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ కేంద్రంగా అభివృద్ధి చెందిన ఫార్మా క్లస్టర్లు, ఐటీ హబ్‌లు రాష్ట్ర ఎగుమతుల వృద్ధికి వెన్నెముకలా మారాయి. 2024-25లో ఐటీ ఉత్పత్తుల ఎగుమతుల్లో దేశవ్యాప్తంగా పెరుగుదల కనిపించింది. కానీ.. తెలంగాణలో ఐటీకి తోడు ఫార్మా రంగం సైతం సమానంగా బలంగా ఉండటంతో, రాష్ట్రానికి అత్యధిక వృద్ధి సాధ్యమైంది. ఫార్మా, ఐటీ రంగాలకే పరిమితం కాకుండా.. ఇంజినీరింగ్ సామగ్రి, రసాయనాలు, ఏరోస్పేస్ పరికరాలు వంటి తయారీ రంగ ఉత్పత్తులు కూడా తెలంగాణ నుంచి ఎగుమతి అవుతున్నాయి. అదేవిధంగా వ్యవసాయ రంగంలోనూ విత్తనాలు, బియ్యం, పత్తి వంటి ఉత్పత్తులు విదేశీ మార్కెట్లకు చేరుతున్నాయి. ఈ విభిన్న రంగాల భాగస్వామ్యం రాష్ట్ర ఎగుమతులకు స్థిరత్వాన్ని ఇస్తున్నది.
గుజరాత్ అత్యధికం.. చండీగఢ్ అత్యల్పం
దేశవ్యాప్తంగా చూస్తే గుజరాత్ రాష్ట్రం ఎగుమతుల్లో అగ్రస్థానంలో కొనసాగుతున్నది. 2017-18లో సుమారు 70 వేల మిలియన్ డాలర్ల ఎగుమతులు చేసిన గుజరాత్.. 2024-25 నాటికి 1,16,332 మిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులను నమోదు చేసింది. అయితే.. మూడేళ్లుగా అక్కడ ఎగుమతుల విలువల్లో కొంత తగ్గుదల కనిపిస్తుండడం గమనార్హం. 2022-23లో 1.46 లక్షల మిలియన్ డాలర్లుగా ఉన్న ఎగుమతులు, తరువాతి సంవత్సరాల్లో క్రమంగా తగ్గాయి. ఇక కేంద్రపాలిత ప్రాంతమైన చండీగఢ్‌లో దేశంలోనే అత్యల్ప ఎగుమతులు నమోదయ్యాయి. 2024-25లో అక్కడి నుంచి జరిగిన మొత్తం ఎగుమతుల విలువ కేవలం 14 మిలియన్ డాలర్లు మాత్రమే. తెలంగాణ కంటే ఎక్కువ ఎగుమతుల విలువ కలిగిన రాష్ట్రాలుగా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ ముందు వరుసలో ఉన్నాయి.






