- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇందిరమ్మ ఇళ్లతో దేశానికే రోల్ మోడల్‌గా తెలంగాణ.. మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి
ఇందిరమ్మ ఇళ్లతో తెలంగాణ దేశానికే రోల్ మోడల్‌గా నిలిచిందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం కొఠారి గ్రామంలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రేపు రెండో విడతకు ఇందిరమ్మ ఇళ్లకు శ్రీకారం చుట్టబోతున్నామని రాష్ట్ర గృహ నిర్మాణ, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. కొత్తగూడలో సామూహిక గృహప్రవేశాల కార్యక్రమంలో సీఎం పాల్గొంటారని, రెండో విడతలో 2.5 లక్షల ఇళ్ల మంజూరుతో రెండు విడతల్లో కలిపి ఒక్కో నియోజకవర్గానికి 5,500 నుంచి 6,500 ఇళ్లను మంజూరు చేసినట్లు అవుతుందన్నారు. ఐటీడీఏ ప్రాంతాల్లోని గిరిజన నియోజకవర్గాలకు అదనంగా 500 నుంచి 1,500 వరకు మంజూరు చేశామని తెలిపారు. తాము ఆశించిన స్థాయిలో మొదటి విడతలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ కార్యక్రమం విజయవంతమైందని, గత ఏడాది ఫిబ్రవరి మూడవ వారంలో సీఎం రేవంత్ రెడ్డి నారాయణపేట జిల్లాలో ఇందిరమ్మ ఇళ్లకు శంకుస్థాపన చేశారని, ఈ 13 నెలల్లో లక్ష ఇళ్లను పూర్తి చేసుకొని మరో ఒకటి రెండు నెలల్లో మరో రెండు లక్షల ఇళ్లు పూర్తికాబోతున్నాయని వెల్లడించారు. ఇది దేశానికే ఆదర్శవంతంగా, ఒక రోల్ మోడల్‌గా నిలుస్తుందని అన్నారు. ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొంటూ.. ఏడు దశాబ్దాల స్వతంత్ర భారత దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పేదల సొంతింటి కల నెరవేర్చడానికి ఉచితంగా రూ.5 లక్షలతో భారీ గృహ నిర్మాణ కార్యక్రమం అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
గృహ నిర్మాణ కార్యక్రమం పేదల జీవితాలు మార్చుతోంది..
రాష్ట్రంలో అమలు అవుతున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం ఇప్పుడు కేవలం గృహ నిర్మాణ కార్యక్రమం మాత్రమే కాకుండా పేద కుటుంబాల జీవితాలను మార్చేస్తున్న సామాజిక ఉద్యమంగా మారిందన్నారు. ఈ ఏడాది క్యూఆర్ పరిధిలో లక్ష ఇళ్లకు, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో 2.50 లక్షలు.. మొత్తం 3.50 లక్షల ఇళ్ల మంజూరుకు పరిపాలనా అనుమతులు ఇవ్వడం జరిగిందన్నారు. ఒక ప్రణాళికాబద్ధంగా మొదటి విడతలో ఎదురైన మంచి చెడులను పరిగణనలోకి తీసుకొని మరింత పటిష్టంగా రెండో విడత కార్యక్రమాన్ని అమలు చేయాలని ఇప్పటికే అధికారులను ఆదేశించడం జరిగిందన్నారు. దేశంలోని చాలా రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పరిమిత నిధులతోనే గృహ నిర్మాణాలను కొనసాగిస్తున్నప్పటికీ, తెలంగాణ ప్రభుత్వం మాత్రం పేదవాడి ఇల్లు – ప్రభుత్వ బాధ్యత అనే లక్ష్యంతో సొంత నిధులతో ముందుకు సాగుతోందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కేంద్రం కేవలం రూ.72 వేలే, పట్టణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షలు మాత్రమే ఇస్తున్నా, తెలంగాణ ప్రభుత్వం ఒక్కో లబ్ధిదారునికి రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందిస్తోందని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి 2013 వరకు అమలు చేసిన ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ఇళ్లు మంజూరై, ఇప్పటికీ అసంపూర్తిగా ఉన్న ఇళ్లను పూర్తి చేయడానికి, 2023లో గృహలక్ష్మి పథకంలో ఇళ్లు మంజూరై ఇప్పటికీ పూర్తి చేసుకోలేకపోయిన వారికి రెండవ విడతలో ఆ ఇంటి నిర్మాణం పూర్తి అవడానికి అవసరమయ్యే ఆర్థిక సహాయాన్ని అందిస్తామన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో చేపట్టిన ఇందిరమ్మ పథకంలో రూ.20 వేల వరకు ఆర్థిక సహాయం పొందిన వారికి కూడా ఈ విడతలో ఇళ్ల మంజూరు చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.






